నిజామాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ :
పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసుకుంటే ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని జాయిం ట్ కలెక్టర్ హర్షవర్ధన్ పేర్కొన్నారు. అనేక రాష్ట్రాలు టూరిజంపై ఆధారపడే చాలా అభివృద్ధి చెందాయన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియం ప్రాంగణంలో గల న్యూ అంబేద్కర్ భవన్‌లో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. అలీసాగర్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 30 శాతం పెంచడంతోపాటు 54 ఎకరాల భూమిని కేటాయించి పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి * 5 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.
అశోక్‌సాగర్ అభివృద్ధికి * 15 లక్షలు, లింబాద్రిగుట్టలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవాలయానికి * 50 లక్షలు, ఆర్మూర్‌లోని సిద్ధులగుట్ట అభివృద్ధికి * 30 లక్షలు మంజూరు చేయాలని కోరామన్నారు. జిల్లాలోని పలు పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపించామని పేర్కొన్నారు. జిల్లాకు టూరిజం సైన్స్ పార్క్ మంజూరైందని జేసీ తెలిపారు. పర్యావరణానికి, నీటికి అవినాభావ సంబంధం ఉందన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే నీటి లభ్యత తప్పనిసరన్నారు. జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముందుగా సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. చిందు యక్షగానం, సాంఘిక సంక్షేమ వసతి గృహాల డిగ్రీ విద్యార్థులు, కళాకారుడు గంగాధర్ బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.
పర్యాటక దినోత్సవం సందర్భంగా చిత్రలేఖనం, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. వీటిలో గెలిచిన వారికి జేసీ చేతుల మీదుగా బహుమతులు అందించారు. కార్యక్రమంలో టూరిజం అభివృద్ధి మండలి జిల్లా ఇన్‌చార్జి అధికారి వెంకటేశం, ఎన్‌సీఎల్‌పీ పీడీ సుధాకర్‌రావు, మెప్మా పీడీ సత్యనారాయణ, టూరిజం శాఖ జిల్లా మేనేజర్ గంగారెడ్డి, టూరిజం జిల్లా అధికారి అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
టూరిజంతో ఆర్థికాభివృద్ధి
Published Sat, Sep 28 2013 4:50 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM
Advertisement