అనుమతుల కథా కమామీషు ఇదీ
విశాఖ రూరల్‌లో ఉన్న మొత్తం సినిమా హాళ్లు: 43
అగ్నిమాపక అనుమతులు ఉన్న థియేటర్లు: 19
విశాఖ నగరంలో ఉన్న మొత్తం సినిమా హాళ్లు: 33
విశాఖ నగరంలోని మల్టీప్లెక్స్‌లు: 4
రెండు కంటే ఎక్కువ థియేటర్లున్న సినీ కాంప్లెక్స్‌లు: 2
జీవీఎంసీ ఆర్‌ఎఫ్‌వో పరిధిలోకి వచ్చే థియేటర్లు: 27
అగ్నిమాపక అనుమతులు ఉన్న థియేటర్లు: 21
(మొత్తంగా సరాసరిన విశాఖ నగరం, రూరల్ జిల్లా పరిధిలో సగానికిపైగా థియేటర్లకు అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు లేవంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.)
విశాఖ సిటీ: థియేటర్ కట్టామా.. టిక్కెట్లు అమ్మామా..? సినిమా వేశామా..? అంతే... ఆ థియేటర్‌లో నిబంధనలు పాటిస్తున్నామా..? సగటు ప్రేక్షకుడికి పూర్తి స్థాయి భద్రత కల్పిస్తున్నామా అన్నది మాత్రం గాలిలో దీపమే. నిరభ్యంతర పత్రాలు లేకున్నా అడిగే నాథుడే లేడు. ఏటా జరగాల్సిన తనిఖీలూ శూన్యమే.? అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మాత్రం హడావిడి చెయ్యడం.. ఆ తర్వాత వ్యవహారం గాలికొదిలెయ్యడం జిల్లాలోనూ, నగరంలోనూ రివాజుగా మారిపోయింది. విశాఖ నగరంలోనూ, రూరల్ జిల్లాల్లోనూ సగానికి పైగా థియేటర్లకు అగ్నిమాపక శాఖ అనుమతులే లేవంటే ఎంత నిర్లక్ష్యంగా నిర్వాహకులు వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. తాజాగా సోమవారం వేకువజామున గాజువాక శ్రీకన్య కాంప్లెక్స్‌లో జరిగిన ప్రమాదం ఊహకందనిది. సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో ప్రమాదం జరిగి ఉంటే..? ప్రేక్షకుడి ప్రాణానికి బాధ్యుడెవరు.? థియేటర్ నడిపే యజమానా..? అగ్నిమాపక వ్యవస్థ సరిగా ఉందా లేదా అని పట్టించుకోని యంత్రాం గమా..? ఇవన్నీ సగటు ప్రేక్షకుడిని తొలిచేస్తున్న ప్రశ్నలు.
అమలుకాని నిబంధనలు
ఆర్థిక రాజధానిగా భాసిల్లుతున్న విశాఖ మహా నగరంలోనూ, జిల్లా వ్యాప్తంగా సినిమా థియేటర్లలో ఫైర్ సేఫ్టీ మొక్కుబడితనం భయం పుట్టిస్తోంది. పలు సినిమా థియేటర్లలో నిర్వాహకులు ప్రధానంగా అగ్నిప్రమాద నివారణకు సంబంధించి నిబంధనలను గాలికి వదిలేస్తున్నారన్న విమర్శలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని థియేటర్లలో అగ్నిప్రమాద నివారణ పరికరాలు అలంకారప్రాయంగా మారాయి. అగ్నిమాపక, రెవెన్యూ శాఖల అధికారులు తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ చేతులు దులిపేసుకోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ప్రజలు బాహాటంగానే దుమ్మెత్తిపోస్తున్నారు. కొన్ని థియేటర్లలో ఎప్పుడో ఏర్పాటు చేసిన అగ్నిప్రమాద నిరోధక పరికరాలు మూలనపడ్డాయి. విశాఖ మహా నగరంలో 5 మల్టీప్లెక్స్‌లు, దాదాపు 35 వరకూ సినిమా థియేటర్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాలు, ముఖ్యమైన మండల కేంద్రాల్లో దాదాపు మరో 70 వరకూ సినిమా హాళ్లు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇలా మొత్తం జిల్లా వ్యాప్తంగా సుమారు 110 వరకు అన్ని రకాల థియేటర్లలో నిత్యం వేలాది మంది ప్రేక్షకులు సినిమా చూస్తుంటారు. అయితే ఈ థియేటర్‌లలో అగ్నిప్రమాద నివారణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు శూన్యమేనని చెప్పవచ్చు. అగ్నిమాపక పరికరాలు కొన్నిచోట్ల ఉన్నా అవి సక్రమంగా పనిచేయడం లేదు. వాటర్ ట్యాంకులు, పైప్‌లైన్లు శిథిలావస్థకు చేరుకున్న థియేటర్లూ ఉన్నాయి. నిబంధనల మేరకు ప్రేక్షకులను హాలులో నింపే సామర్థ్యాన్ని బట్టి థియేటర్ పై భాగంలో వాటర్ ట్యాంకులు, అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంకులు, పైప్‌లైన్లు, విద్యుత్, డీజిల్ మోటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే వీటి జాడ ఏ ఒక్క థియేటర్‌లో కనిపించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే స్ప్రే ద్వారా కార్బన్‌డయాక్సైడ్‌ను వదులుతూ ప్రేక్షకులను బయటకు పంపించే విధంగా ట్యూబ్‌లు ఏర్పాటు చెయ్యాలి. అలాంటి పరికరాలు దాదాపు 65 శాతం థియేటర్లలో కనిపించడం లేదని తెలుస్తోంది.
సరంజామా ఉంటే సరిపోదు
శ్రీకన్య సినీ కాంప్లెక్స్‌లో అగ్నిమాపక పరికరాలు పూర్తిస్థాయిలో ఉన్నాయి. కానీ ఇంత నష్టం జరగడానికి వేకువజామున ప్రమాదం జరగడం ఒక కారణమైతే... ఫైర్ సిస్టమ్‌పై సిబ్బందికి అవగాహన లేకపోవడమూ ఒక కారణమే. మా పరిధిలో ఉన్న మల్టీప్లెక్స్‌ల్లో పూర్తిస్థాయి ఫైర్ సిస్టమ్ ఉంది. కొత్త థియేటర్లైతే రెండేళ్ల వరకూ ఏడాదికి మూడు సార్లు మాక్ డ్రిల్ చెయ్యాలి. పాత థియేటర్లలో ఏడాదికి రెండు సార్లు మాక్ డ్రిల్ నిర్వహించాలి. దాదాపు అన్ని థియేటర్ల రిజిస్టర్లలోనూ మాక్ డ్రిల్ చేసినట్లు పొందుపరిచి ఉన్నారు. కానీ అదెంత వరకూ వాస్తవమో తెలీదు. ఎందుకంటే మాక్ డ్రిల్ చేసినప్పుడు మాకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు. అది వారి కనీస బాధ్యత. మాకు సమాచారమిచ్చి మాక్ డ్రిల్ చేస్తే మరిన్ని సలహాలు అందించగలం. గాజువాక ప్రమాదం చూసైనా.. మిగిలిన థియేటర్‌ల నిర్వాహకులు జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తం చేశాం. ఫైర్ సరంజామా ఉంటే సరిపోదు.. అవి ఎలా పనిచేస్తున్నాయో చూసుకోవాలి. సిబ్బందికి అవగాహన కల్పించాలి. అప్పుడే ప్రమాద తీవ్రత నుంచి బయటపడగలరు.
– బీవీఎస్ రామ్‌ప్రకాష్, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి.
సినిమా థియేటర్లలో తనిఖీలు
రెండు థియేటర్‌లు అగ్నికి ఆహుతవడంతో అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా అగ్నిమాపక శాఖాధికారి బీవీఎస్ రామ్ ప్రకాశ్ ఆధ్వర్యంలో నగరంలోని చిత్రాలయ, సీఎంఆర్ సెంట్రల్, వరుణ్ ఐనాక్స్, జగదాంబ, విశాఖ సెంట్రల్, శ్రీకన్య థియేటర్లతోపాటు గాజువాకలోని అన్ని థియేటర్లలోనూ తనిఖీలు చేపట్టారు.
అగ్ని ప్రమాదంపై విచారణకు కమిటీ
శ్రీకన్య థియేటర్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు ఏసీపీ రంగరాజు ఆధ్వర్యంలో కమిటీని నియమించినట్లు లా అండ్ ఆర్డర్ డీసీపీ ఫకీరప్ప విలేకరులకు వెల్లడించారు. ఇప్పటికే ఈ ఘటనపై గాజువాక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment