
సాక్షి,విశాఖపట్నం: విశాఖలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆరో అంతస్తులో మంటలు చెలరేగడంలో సిబ్బంది, పేషెంట్స్ బయటకు పరుగులు తీశారు. ఇక, ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు.
వివరాల ప్రకారం.. విశాఖలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఆరో అంతస్తులోని అడ్మిన్ బ్లాక్‌లో మొదట మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ బయటకు వస్తోంది. వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది భవనంలో ఉన్న పేషంట్స్‌ను బయటకు తరలించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఆసుపత్రిలోకి ఇతర బ్లాక్‌ల్లోకి మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక, ఈ ప్రమాదంలో రోగులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.