Seven Hills Hospital
-
విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
సాక్షి,విశాఖపట్నం: విశాఖలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆరో అంతస్తులో మంటలు చెలరేగడంలో సిబ్బంది, పేషెంట్స్ బయటకు పరుగులు తీశారు. ఇక, ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు.వివరాల ప్రకారం.. విశాఖలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఆదివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఆరో అంతస్తులోని అడ్మిన్ బ్లాక్‌లో మొదట మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ బయటకు వస్తోంది. వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది భవనంలో ఉన్న పేషంట్స్‌ను బయటకు తరలించారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఆసుపత్రిలోకి ఇతర బ్లాక్‌ల్లోకి మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక, ఈ ప్రమాదంలో రోగులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
వంటింటి వైద్యంతో కరోనా ‘ఆవిరి’
సాక్షి, అమరావతి: వంటింటి చిట్కాలే కరోనా నియంత్రణకు ఔషధాలుగా పనిచేస్తున్నాయి. చివరకు అంతిమ నిర్ణయంగా చెప్పుకొనే వైద్యశాస్త్రం కూడా దీనివైపే మొగ్గుచూపడం గమనార్హం. కరోనా వైరస్ నియంత్రణకు తాజాగా ఆవిరి చికిత్స (స్టీమ్ థెరపీ) ప్రధాన ఔషధంగా ఉపయోగపడుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ముంబయిలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రి వైద్యులు 3 నెలలుగా పరిశోధన నిర్వహించి ఈ విషయాన్ని కనుగొన్నారు. ఆ ఆస్పత్రికి చెందిన డా.దిలీప్‌పవార్ నేతృత్వంలో ఈ పరిశోధనలు జరిగాయి. ఆవిరి పట్టిన వారికి మెరుగైన ఫలితాలు వచ్చినట్టు పేర్కొన్నారు. ఆ వివరాలు.. ► పలువురు కోవిడ్ పాజిటివ్ పేషెంట్లపై స్టీమ్ థెరపీ ప్రయోగం. ► అసింప్టమాటిక్ (ఎలాంటి లక్షణాల్లేని) పాజిటివ్ బాధితులు రోజుకు మూడు సార్లు ఆవిరి పట్టడం వల్ల త్వరితగతిన కోలుకున్నారు. ► సాధారణంగా ఇది హోం రెమిడీ (ఇంటి చిట్కా) అయినా కోవిడ్ సమయంలో బాగా ఉపయోగపడుతోంది. ► పరిశోధనలో 105 మంది బాధితులను రెండు గ్రూపులుగా విభజించారు. ► మొదటి గ్రూపులోని లక్షణాలు లేని బాధితులకు రోజుకు మూడు సార్లు ఆవిరి చికిత్స చేయగా మూడు రోజుల్లోనే కోలుకున్నారు. ► అదే లక్షణాలుండి తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్లు ప్రతి మూడు గంటలకోసారి ఐదు నిమిషాల పాటు ఆవిరి పట్టగా వారంలో సాధారణ స్థితికొచ్చారు. ► కొన్ని రకాల క్యాప్సూల్స్, విక్స్, అల్లం ఇలా కొన్నింటితో ఆవిరి చికిత్స చేశారు. -
కబ్జా దర్జా
⇒ వివాదాస్పద స్థలంలో టీడీపీ కార్యాలయానికి స్థలం లీజు ⇒కేటాయించింది 2వేల గజాలే.. ఆక్రమించింది అర ఎకరాపైనే ⇒తాజాగా పార్కింగ్ పేరుతో మరో వెయ్యి గజాల ఆక్రమణ ⇒కొండను తొలిచి మరీ కబ్జాకాండ ⇒అడ్డుకోవాల్సిన అధికారులు.. సేవలో తరిస్తున్నారు ⇒జీవీఎంసీ పొక్లెయిన్తోనే దగ్గరుండి స్థలం చదును ⇒ఈ అక్రమ నిర్మాణానికే రేపు చినబాబు రిబ్బన్ కటింగ్ వేలు చూపితే మండ మింగేశాడన్నది నానుడి.. ఆ నానుడిని తలదన్నేరీతిలో సాగుతోంది అధికార పార్టీ కబ్జాకాండ.. పార్టీ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని అడ్డం పెట్టుకొని ఏకంగా కొండనే మింగేస్తున్నారు. నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతం.. అందులోనూ వివాదంలో ఉన్న దసపల్లా హిల్స్‌లో స్థలం ఇవ్వడమే సరికొత్త వివాదానికి తెరలేపింది.. ఇవేమీ పట్టించుకోకుండా ఇచ్చిన స్థలానికి కొన్ని రెట్లు అధిక విస్తీర్ణంలో కొండను తొలిచేసి బహుళ అంతస్తుల భవనం నిర్మించేశారు. అయినా అధికార వర్గాలకు అదేమీ పట్టలేదు... అంతే.. అంతా టీడీపీ నేతల ఇష్టారాజ్యంగా మారింది.. తాజాగా పార్టీ కార్యాలయానికి పార్కింగ్ వసతి పేరుతో మరో వెయ్యి గజాల వరకు కొండను తొలిచేసి చదును చేశారు.. దానికి జీ హుజూర్.. అంటూ అధికారగణమే దగ్గరుండి మరీ పనులు చేయిస్తుండటం అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా నిలుస్తోంది. నగర నడిబొడ్డున సాగుతున్న ఈ అధికారిక కబ్జాకాండ విశాఖ వాసులను విస్మయానికి గురి చేస్తోంది. విశాఖపట్నం: అధికారంలో ఉన్న పార్టీ.. దాని కార్యాలయం చిన్నపాటి షెడ్లో ఉంటే ఏం బావుంటుంది?.. టీడీపీ నేతలు కూడా ఇదే ఆలోచన చేశారు. అందుకే బహుళ అంతస్తుల భవనం.. ఆధునిక హంగులు కల్పించాలని నిర్ణయించారు. కానీ ప్రభుత్వ లీజుకు ఇచ్చిన స్థలం ఈ హంగు ఆర్భాటాలకు ఏమాత్రం సరిపోదు. అధికారం తమ చేతిలోనే ఉంది కదా.. ఏం చేసినా చెల్లుతుందన్న ధీమాతో పార్టీ స్థలానికి ఆనుకొని ఉన్న కొండను దర్జాగా కొల్లగొట్టే పనిలో పడ్డారు. లీజుకు 2వేల గజాలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన దసపల్లా హిల్స్ సర్వే నెంబర్1196లో రెండు వేల గజాల స్థలాన్ని 2003లో అప్పటి టీడీపీ ప్రభుత్వం లీజు పద్ధతిలో కేటాయించింది. నగర నడిబొడ్డున సెవెన్ హిల్స్ ఆస్పత్రి వెనుక సంతోష్‌నగర్‌లో ఉన్న ఈ స్థలంలో చిన్నపాటి షెడ్లో కొద్ది కాలం క్రితం వరకు టీడీపీ కార్యాలయం కొనసాగింది. ఆ భూమి దసపల్లా హిల్స్లోనిదే టీడీపీ కార్యాలయం కోసం కేటాయించిన భూములు దసపల్లా హిల్స్‌కు చెందినవే. ఈ భూములపై వివాదం కోర్టుల్లో ఉంది. అయితే సెక్షన్ 22ఏ కింద విశాఖ అర్బన్ తహశీల్దార్ కార్యాలయ పరిధిలోని సర్వే నెంబర్ 1027లో వుడా 40 ఏళ్ల క్రితం గంగాపూర్ లే అవుట్ పేరుతో అభివృద్ధి చేసిన 12.83 ఎకరాలు, సర్వే నెం.1028లో 10.54 ఎకరాలు, సర్వే నెం. 1196లో 18.38 ఎకరాలు, సర్వే నెం.1197లో 38.89 ఎకరాలు (మహారాణిపేట వార్డులో వుడా లే అవుట్ 20.61ఎకరాలు కలిపి) మొత్తం 80.64 ఎకరాలు నోటిఫై చేసిన భూముల్లో ఉన్నాయి. కలెక్టర్ నోటిఫై చేయడంతో ఈ భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. దీనిపై దసపల్లా రాణి కమలాదేవి హైకోర్టును ఆశ్రయించారు. వ్యవహారాన్ని పరిశీలించిన హైకోర్టు కలెక్టర్ ఉత్తర్వులపై స్టే విధించింది. చివరిగా 2013లో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడా చుక్కెదురైంది. ఇలా వ్యవహారం కోర్టుల్లో నలుగుతుండగానే సర్వే నెం.1196 లో 2వేల గజాలను అప్పట్లో జేసీగా పనిచేసిన కృష్ణబాబు టీడీపీ కార్యాలయం కోసం కేటాయించారు. అధికార భోగం 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత షెడ్ స్థానంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించారు. నిర్మాణానికి భారీగా విరాళాలు సేకరించి కోట్లు కుమ్మరించారు. కోర్టు వివాదాల్లో ఉన్నా పట్టించుకోకుండా పక్కనే ఉన్న కొండను కూడా తొలిచేసి మరీ అర ఎకరానికి పైగా విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో భారీ భవంతిని నిర్మించారు. చుట్టూ భారీ ఎత్తులో ప్రహరీ కూడా నిర్మించారు. గతంలో సెవెన్ హిల్స్ వెనుక రోడ్డు వైపు ఉన్న కార్యాలయ ముఖద్వారాన్ని వాస్తు వంకతో తూర్పు వైపునకు మార్చేశారు. ఇందుకోసం టీడీపీ కార్యాలయానికి జీవీఎంసీ వాటర్ స్టోరేజ్ ట్యాంకుకు మధ్యలో ఉన్న కొండను సైతం తొలిచేశారు. అక్కడితో ఆగకుండా పార్కింగ్ పేరుతో సుమారు వెయ్యి గజాలకు పైగా కొండ స్థలాన్ని చదును చేసి తమకు అనుకూలంగా తీర్చిదిద్దారు. సేవలో తరిస్తున్న అధికారులు ఈ పనంతా జీవీఎంసీ అధికారులు దగ్గరుండి మరీ చేయించడం గమనార్హం. జీవీఎంసీ పొక్లెయిన్ తెప్పించి కొండను తొలిచి టీడీపీ కార్యాలయానికి ఎదురుగా పార్కింగ్‌కు అనుకూలంగా చదునుచేశారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖల మంత్రి లోకేష్‌బాబుతో ఈ నెల 6న ఈ భవనానికి ప్రారంభోత్సవం చేయించేందుకు వీలుగా టీడీపీ జిల్లా కమిటీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పర్యావరణ సమతులత్యను దెబ్బతీసేలా కొండను తొలిచేసి భవంతిని నిర్మించడమే కాకుండా పార్కింగ్ పేరుతో వివాదస్పద భూములను సైతం ఆక్రమించుకోవాలని చూడడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. చదును చేసిన భూమి విలువ ఇక్కడ మార్కెట్ రేటును బట్టి చూస్తే రూ. 10 కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. అధికారం చేతులో ఉంది కదా అని అడ్డగోలుగా ఆక్రమణలకు పాల్పడుతూ నిర్మాణాలు సాగిస్తుంటే ఎలా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. -
విశాఖలో స్వైన్ ఫ్లూ కలకలం
విశాఖ మెడికల్: విశాఖలో మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం రేగింది. సోమవారం నగరంలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైనట్లు ప్రచారం జరగడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. అయితే దీన్ని అధికారులు ధ్రువీకరించడం లేదు. వివరాల్లోకి వెళితే.. జూన్ 1న నగరంలోని ఇసుకతోటకు చెందిన 53 ఏళ్ల వ్యక్తి స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో సెవెన్‌హిల్స్‌లో చేరాడు. బాధితుడి గొంతు నుంచి సేకరించిన స్రావాలను హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగానికి నిర్థారణ కోసం పంపించారు. సోమవారం నివేదిక రావడంతో నగరంలో కలకలం రేగింది. అయితే నివేదికలో అతనికి స్వైన్‌ఫ్లూ నిర్థారణ కాలేదని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడిస్తుండగా, ఆస్పత్రి వర్గాలు మాత్రం అనుమానిత కేసుగా చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఇంతకుముందు స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో మరో ఇద్దరు సెవెన్‌హిల్స్, ఒకరు అపోలో ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. అయితే సెవెన్‌హిల్స్‌లో చేరిన ఇద్దరిలో ఒకరికి స్వైన్‌ఫ్లూ లేనట్లు తేలిందని, మరొకరి రిపోర్టు రావాల్సి ఉందని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దినకర్ తెలిపారు. -
సెవన్‌హిల్స్‌లో అరుదైన మైక్రో ప్లాస్టిక్ సర్జరీ
విశాఖపట్నం-మెడికల్: ఎలుగు బంటిల దాడిలో తల, ముఖ భాగాలపై తీవ్రంగా గాయాలైన ఓ వ్యక్తికి మైక్రో ప్లాస్టిక్ సర్జరీ విధానంలో ద్వారా అవయవాలను పునర్నిర్మించారు. ఈ అరుదైన శస్త్రచికిత్స విశాఖలోని సెవన్‌హిల్స్ ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జరీ వైద్యురాలు డాక్టర్ అంజలీ సాప్లై, న్యూరోసర్జరీ చీఫ్ డాక్టర్ పి.వి.రమణలు విజయవంతంగా నిర్వహించారు. ఈ వివరాలను ఆస్పత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఒడిశాలోని గంజామ్ జిల్లాకు చెందిన నర్సింహులు (48) ఆగస్టు 24న జీడితోటలో పని చేస్తుండగా హఠాత్తుగా మూడు ఎలుగులు బంట్లు దాడిచేశాయి. ఈ దాడి లో అతడి ముఖం భాగాల్లో చర్మం పూర్తిగా లాగేయడంతో పాటు పుర్రె, బుగ్గ ఎముకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒడిశాలోని బరంపురంలో ప్రాథమిక చికిత్స అనంతరం అదే రోజు తమ ఆస్పత్రికి తీసుకువచ్చారన్నారు. పుర్రె ఎముక తొలగడంతో మెదడకు ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని ఎంఆర్ఐ స్కాన్ ద్వారా గుర్తించామన్నారు. దాన్ని నివారించేందుకు వెంటనే 10 గంటల పాటు శ్రమించి మైక్రోప్లాస్టిక్ సర్జరీ నిర్వహించినట్టు తెలిపారు. వీపు భాగంలోని చర్మాన్ని మాడు భాగంలో స్కిన్ గ్రాఫ్ట్ చేశారు. కొద్ది రోజులు ఐసీయూలో చికిత్స అనంతరం ముఖ భాగంలో దెబ్బతిన్న బుగ్గ, ముక్కు ఎముకలను బోన్ గ్రాఫ్టింగ్ ద్వారా సరిచేసి పునర్నిర్మించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రెండు రోజుల్లో డిశ్చార్జి చేయనున్నట్టు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దినకర్ తెలిపారు.