విశాఖపట్నం-మెడికల్: ఎలుగు బంటిల దాడిలో తల, ముఖ భాగాలపై తీవ్రంగా గాయాలైన ఓ వ్యక్తికి మైక్రో ప్లాస్టిక్ సర్జరీ విధానంలో ద్వారా అవయవాలను పునర్నిర్మించారు. ఈ అరుదైన శస్త్రచికిత్స విశాఖలోని సెవన్‌హిల్స్ ఆస్పత్రి ప్లాస్టిక్ సర్జరీ వైద్యురాలు డాక్టర్ అంజలీ సాప్లై, న్యూరోసర్జరీ చీఫ్ డాక్టర్ పి.వి.రమణలు విజయవంతంగా నిర్వహించారు. ఈ వివరాలను ఆస్పత్రిలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఒడిశాలోని గంజామ్ జిల్లాకు చెందిన నర్సింహులు (48) ఆగస్టు 24న జీడితోటలో పని చేస్తుండగా హఠాత్తుగా మూడు ఎలుగులు బంట్లు దాడిచేశాయి.
ఈ దాడి లో అతడి ముఖం భాగాల్లో చర్మం పూర్తిగా లాగేయడంతో పాటు పుర్రె, బుగ్గ ఎముకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒడిశాలోని బరంపురంలో ప్రాథమిక చికిత్స అనంతరం అదే రోజు తమ ఆస్పత్రికి తీసుకువచ్చారన్నారు. పుర్రె ఎముక తొలగడంతో మెదడకు ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని ఎంఆర్‌ఐ స్కాన్ ద్వారా గుర్తించామన్నారు. దాన్ని నివారించేందుకు వెంటనే 10 గంటల పాటు శ్రమించి మైక్రోప్లాస్టిక్ సర్జరీ నిర్వహించినట్టు తెలిపారు.
వీపు భాగంలోని చర్మాన్ని మాడు భాగంలో స్కిన్ గ్రాఫ్ట్ చేశారు. కొద్ది రోజులు ఐసీయూలో చికిత్స అనంతరం ముఖ భాగంలో దెబ్బతిన్న బుగ్గ, ముక్కు ఎముకలను బోన్ గ్రాఫ్టింగ్ ద్వారా సరిచేసి పునర్నిర్మించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రెండు రోజుల్లో డిశ్చార్జి చేయనున్నట్టు ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దినకర్ తెలిపారు.
సెవన్‌హిల్స్‌లో అరుదైన మైక్రో ప్లాస్టిక్ సర్జరీ
Published Wed, Sep 10 2014 3:09 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement