కబ్జా దర్జా | Lease space for TDP office in the controversial area | Sakshi
Sakshi News home page

కబ్జా దర్జా

Published Fri, May 5 2017 10:59 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

కబ్జా దర్జా - Sakshi

కబ్జా దర్జా

వివాదాస్పద స్థలంలో టీడీపీ కార్యాలయానికి స్థలం లీజు
కేటాయించింది 2వేల గజాలే.. ఆక్రమించింది అర ఎకరాపైనే
తాజాగా పార్కింగ్‌ పేరుతో మరో వెయ్యి గజాల ఆక్రమణ
కొండను తొలిచి మరీ కబ్జాకాండ
అడ్డుకోవాల్సిన అధికారులు.. సేవలో తరిస్తున్నారు
జీవీఎంసీ పొక్లెయిన్‌తోనే దగ్గరుండి స్థలం చదును
ఈ అక్రమ నిర్మాణానికే రేపు చినబాబు రిబ్బన్‌ కటింగ్‌


వేలు చూపితే మండ మింగేశాడన్నది నానుడి.. ఆ నానుడిని తలదన్నేరీతిలో సాగుతోంది అధికార పార్టీ కబ్జాకాండ.. పార్టీ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని అడ్డం పెట్టుకొని ఏకంగా కొండనే మింగేస్తున్నారు. నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతం.. అందులోనూ వివాదంలో ఉన్న దసపల్లా హిల్స్‌లో స్థలం ఇవ్వడమే సరికొత్త వివాదానికి తెరలేపింది.. ఇవేమీ పట్టించుకోకుండా ఇచ్చిన స్థలానికి కొన్ని రెట్లు అధిక విస్తీర్ణంలో కొండను తొలిచేసి బహుళ అంతస్తుల భవనం నిర్మించేశారు.

అయినా అధికార వర్గాలకు అదేమీ పట్టలేదు... అంతే.. అంతా టీడీపీ నేతల ఇష్టారాజ్యంగా మారింది.. తాజాగా పార్టీ కార్యాలయానికి పార్కింగ్‌ వసతి పేరుతో మరో వెయ్యి గజాల వరకు కొండను తొలిచేసి చదును చేశారు.. దానికి జీ హుజూర్‌.. అంటూ అధికారగణమే దగ్గరుండి మరీ పనులు చేయిస్తుండటం అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా నిలుస్తోంది. నగర నడిబొడ్డున సాగుతున్న ఈ అధికారిక కబ్జాకాండ విశాఖ వాసులను విస్మయానికి గురి చేస్తోంది.


విశాఖపట్నం: అధికారంలో ఉన్న పార్టీ.. దాని కార్యాలయం చిన్నపాటి షెడ్‌లో ఉంటే ఏం బావుంటుంది?.. టీడీపీ నేతలు కూడా ఇదే ఆలోచన చేశారు. అందుకే బహుళ అంతస్తుల భవనం.. ఆధునిక హంగులు కల్పించాలని నిర్ణయించారు. కానీ ప్రభుత్వ లీజుకు ఇచ్చిన స్థలం ఈ హంగు ఆర్భాటాలకు ఏమాత్రం సరిపోదు. అధికారం తమ చేతిలోనే ఉంది కదా.. ఏం చేసినా చెల్లుతుందన్న ధీమాతో పార్టీ స్థలానికి ఆనుకొని ఉన్న కొండను దర్జాగా కొల్లగొట్టే పనిలో పడ్డారు.

లీజుకు 2వేల గజాలు
తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన దసపల్లా హిల్స్‌ సర్వే నెంబర్‌1196లో రెండు వేల గజాల స్థలాన్ని 2003లో అప్పటి టీడీపీ ప్రభుత్వం లీజు పద్ధతిలో కేటాయించింది. నగర నడిబొడ్డున సెవెన్‌ హిల్స్‌ ఆస్పత్రి వెనుక సంతోష్‌నగర్‌లో ఉన్న ఈ స్థలంలో చిన్నపాటి షెడ్‌లో కొద్ది కాలం క్రితం వరకు టీడీపీ కార్యాలయం కొనసాగింది.

ఆ భూమి దసపల్లా హిల్స్‌లోనిదే
టీడీపీ కార్యాలయం కోసం కేటాయించిన భూములు దసపల్లా హిల్స్‌కు చెందినవే. ఈ భూములపై వివాదం కోర్టుల్లో  ఉంది. అయితే సెక్షన్‌ 22ఏ కింద విశాఖ అర్బన్‌ తహశీల్దార్‌ కార్యాలయ పరిధిలోని సర్వే  నెంబర్‌ 1027లో వుడా 40 ఏళ్ల క్రితం గంగాపూర్‌ లే అవుట్‌ పేరుతో అభివృద్ధి చేసిన 12.83 ఎకరాలు, సర్వే నెం.1028లో 10.54 ఎకరాలు, సర్వే నెం. 1196లో 18.38 ఎకరాలు, సర్వే నెం.1197లో 38.89 ఎకరాలు (మహారాణిపేట వార్డులో వుడా లే అవుట్‌ 20.61ఎకరాలు కలిపి) మొత్తం 80.64 ఎకరాలు నోటిఫై చేసిన భూముల్లో ఉన్నాయి. కలెక్టర్‌ నోటిఫై చేయడంతో ఈ భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. దీనిపై దసపల్లా రాణి కమలాదేవి హైకోర్టును ఆశ్రయించారు. వ్యవహారాన్ని పరిశీలించిన హైకోర్టు కలెక్టర్‌ ఉత్తర్వులపై స్టే విధించింది. చివరిగా 2013లో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడా చుక్కెదురైంది. ఇలా వ్యవహారం కోర్టుల్లో నలుగుతుండగానే సర్వే నెం.1196 లో 2వేల గజాలను అప్పట్లో జేసీగా పనిచేసిన కృష్ణబాబు టీడీపీ కార్యాలయం కోసం కేటాయించారు.  

అధికార భోగం
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత షెడ్‌ స్థానంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించారు. నిర్మాణానికి భారీగా విరాళాలు సేకరించి కోట్లు కుమ్మరించారు. కోర్టు వివాదాల్లో ఉన్నా పట్టించుకోకుండా పక్కనే ఉన్న కొండను కూడా తొలిచేసి మరీ అర ఎకరానికి పైగా విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో భారీ భవంతిని నిర్మించారు. చుట్టూ భారీ ఎత్తులో ప్రహరీ కూడా నిర్మించారు. గతంలో సెవెన్‌ హిల్స్‌ వెనుక రోడ్డు వైపు ఉన్న  కార్యాలయ ముఖద్వారాన్ని వాస్తు వంకతో తూర్పు వైపునకు మార్చేశారు. ఇందుకోసం టీడీపీ కార్యాలయానికి జీవీఎంసీ వాటర్‌ స్టోరేజ్‌ ట్యాంకుకు మధ్యలో ఉన్న కొండను సైతం తొలిచేశారు. అక్కడితో ఆగకుండా పార్కింగ్‌ పేరుతో  సుమారు వెయ్యి గజాలకు పైగా కొండ స్థలాన్ని చదును చేసి తమకు అనుకూలంగా తీర్చిదిద్దారు.  

సేవలో తరిస్తున్న అధికారులు
ఈ పనంతా జీవీఎంసీ అధికారులు దగ్గరుండి మరీ చేయించడం గమనార్హం. జీవీఎంసీ పొక్లెయిన్‌ తెప్పించి కొండను తొలిచి టీడీపీ కార్యాలయానికి ఎదురుగా పార్కింగ్‌కు అనుకూలంగా చదునుచేశారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖల మంత్రి లోకేష్‌బాబుతో ఈ నెల 6న ఈ భవనానికి ప్రారంభోత్సవం చేయించేందుకు వీలుగా టీడీపీ జిల్లా కమిటీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. పర్యావరణ సమతులత్యను దెబ్బతీసేలా కొండను తొలిచేసి భవంతిని నిర్మించడమే కాకుండా పార్కింగ్‌ పేరుతో వివాదస్పద భూములను సైతం ఆక్రమించుకోవాలని చూడడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. చదును చేసిన భూమి విలువ ఇక్కడ మార్కెట్‌ రేటును బట్టి చూస్తే రూ. 10 కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. అధికారం చేతులో ఉంది కదా అని అడ్డగోలుగా ఆక్రమణలకు పాల్పడుతూ నిర్మాణాలు సాగిస్తుంటే ఎలా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement