
తోట్లవల్లూరు (పామర్రు) : మండలంలోని దేవరపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగిన అగ్ని ప్రమాదం గ్రామస్తులను భయాందోళనలకు గురి చేసింది. గ్రామానికి చెందిన టీడీపీ మండల మాజీ అధ్యక్షుడు భీమవరపు అంజిరెడ్డి ఇంటి ఆవరణలోని వరిగడ్డి వాములకు మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మంటలు అంటుకున్నాయి. ఎండ తీవ్రత, వడగాల్పుల ప్రభావం అధికంగా ఉండటంతో మంటలు ఒక్కసారిగా ఎక్కువయ్యాయి. ఇంటి ఆవరణలోని అంజిరెడ్డి, ఆయన బాబాయిలు అంజిరెడ్డి, శ్రీనివాసరెడ్డిలకు చెందిన నాలుగు భారీ గడ్డి వాములు (సుమారు 25 ఎకరాల గడ్డి) అగ్నికి ఆహుతైంది. రెండు పెద్ద పశువుల పాకలు కాలి బూడిదయ్యాయి. పశువుల పాకలో నిల్వ చేసిన 54 పుట్లు పసుపు, 60 పుట్లు కంద విత్తనం కూడా మంటల దాటికి ఎందుకు కొరగాకుండాపోయాయి. మొవ్వ ఫైర్ ఆఫీసర్ రాంబాబు తన సిబ్బందితో తరలివచ్చి మంటలను అదుపు చేశారు.
తహసీల్దార్ పరిశీలన..
అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ జీ. భద్రు, ఎస్‌ఐ మురళి ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. మంటల అదుపునకు తీసుకోవాల్సిన చర్యలను ఫైర్ సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. జేసీబీలను ఏర్పాటు చేయించి మంటల అదుపునకు కృషి చేశారు. పంచాయతీ కార్యదర్శి అశోక్, వీఆర్‌వో కిశోరకుమార్ పాల్గొన్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని ఫైర్ ఆఫీసర్ రాంబాబు తెలిపారు.