విజయనగరం : విజయనగరం జిల్లాలో లక్కవరపు కోట మండలం యేతపేటలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 30 పూరిళ్లు దగ్దమైనాయి. గ్రామానికి చెందిన కల్లు గీత కార్మికులు నివాసముండే ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది.
పూరిళ్లలో ఎవరు లేని సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి నష్టం అధికంగా ఉన్నప్పటికి ప్రాణ నష్టం ఏమీ జరగలేదని పోలీసులు తెలిపారు.
చిన్న పిల్లలు వీధిలో జీడిపిక్కలు కాల్చుకుంటుండగా నిప్పురవ్వలు ఎగసిపడి అగ్నిప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అన్నీ పూరిళ్లు కావడంతో మంటలు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి క్షణాల్లో వ్యాపించాయి. ఈ ప్రమాదంతో సుమారు 60 కుటుంబాల వారు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఏడాదంతా కష్టపడి దాచుకున్న తిండిగింజలు, సామగ్రి పూర్తిగా కాలిపోవడంతో వారంతా నిరాశ్రయులయ్యారు. రూ.50 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని రెవెన్యూ అధికారులు ప్రాథమిక అంచనా.