Lakkavarapukota
-
విజయనగరం జిల్లా: టీ కాస్తుండగా పేలిన గ్యాస్ సిలిండర్
సాక్షి, విజయనగరం: లక్కవరపు కోట గవరవీధిలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఉదయం టీ కాచుకునే సమయంలో ఘటన జరిగింది. విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి రణస్థలం: మండలంలోని పైడిభీమవరం ఏపీటోరియా (అరబిందో) పరిశ్రమలో విధులు నిర్వర్తిస్తున్న ఎలక్ట్రీషియన్ మహంతి బాలకృష్ణ(34) విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. స్థానిక కార్మికులు, సీఐటీయూ నాయకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీటోరియా పరిశ్రమలోని కాంట్రాక్టర్ వద్ద ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న బాలకృష్ణ శనివారం ఉదయం 9 గంటలకు జనరల్ షిఫ్ట్‌కు వెళ్లాడు. ఫెన్సిలిన్ ఫ్లాంట్ ప్రొడెక్షన్ బ్లాక్–1లో బ్లూవేర్ రూంలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే తోటి కార్మికులు, యాజమాన్యం సహకారంతో పరిశ్రమ అంబులెన్స్‌లో విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శవపంచనామా నిమిత్తం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని స్వగ్రామం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలస. చదవండి: వివాహేతర సంబంధం..‘నిత్యా, నా భర్తను వదిలేయ్’ -
శ్రీకాకుళం: ఇద్దరు ప్రియుళ్లతో కలిసి హత్య.. అరెస్ట్
శ్రీకాకుళం: వారిద్దరూ మంచి స్నేహితులు. ఒకే గ్రామం, ఒకే విధులు కావడంతో ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు. వారి మధ్యతలెత్తిన ఆర్థిక విబేధాలతో స్నేహితురాలే నమ్మించి పథకం ప్రకారం తన ప్రియుడితో కలిసి స్నేహితురాలిని హతమార్చింది. ఎల్.కోట మండలం కళ్లేపల్లి గ్రామంలో వైఎస్సార్ క్రాతిపథంలో బుక్ కీపర్‌గా పని చేస్తున్న గోకేడ మహేశ్వరి హత్యకేసును పోలీస్‌లు ఛేదించారు. నిందితులను కోర్టులో హాజరుపరచడంతో రిమాండ్ విధించారు. ఎల్.కోట పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను విజయనగరం డీఎస్పీ ఆర్.గోవిందరావు వెల్లడించారు. కళ్లేపల్లి గ్రామానికి చెందిన గోకేడ మహేశ్వరి, గాడి చిన్నతల్లిలు వైఎస్సార్ క్రాంతి పథంలో బుక్ కీపర్లుగా పనిచేస్తున్నారు. ఒకే చోట ఉద్యోగం కావడంతో ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు. ఇరువురి మధ్య ఆర్థిక లావాదేవీలు సాగాయి. ఈ క్రమంలో నిందితురాలు గాడి చిన్నతల్లి సీ్త్రనిధి రుణాల్లోని కొంత సొమ్మును తన వ్యక్తిగత అవసరాలకు వాడుకుంది. రుణం డబ్బులు బ్యాంకుకు కట్టే సమయంలో తన స్నేహితురాలు, మృతురాలు మహేశ్వరి వద్ద అప్పుగా తీసుకొని అప్పుడప్పుడు బ్యాంకులో జమ చేసేది. తర్వాత కాలంలో మహిళా మండలి సభ్యుల నిధులను వీరిద్దరూ వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారు. ఎన్నాళ్లు ఇలా చేస్తాం... నీవు వాడుకున్న డబ్బులు, నా దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు తీసుకు రా.. నేను వాడుకున్న డబ్బులను తీసుకొచ్చి పూర్తి స్థాయిలో బ్యాంకు రుణాలను చెల్లించి హాయిగా ఉందామని చిన్నతల్లికి మృతురాలు మహేశ్వరి సూచించింది. దీంతో మహేశ్వరిని చంపేస్తే అప్పుగా తీసుకున్న డబ్బులతో పాటు నేత్రనిధి రుణాలు కట్టాల్సిన అవసరం లేదని చిన్నతల్లి హత్య పథకం రచించింది. రేగ గ్రామానికి చెందిన తన ప్రియుడు డెంకాడ వాసుకు పథకాన్ని వివరించింది. ఇద్దరూ కలిసి ఈ నెల 17వ తేదీన మహేశ్వరిని కారులో ఎక్కించుకుని విజయగనరం మహిళా ప్రాంగణంలో సమావేశానికి బయలుదేరారు. జామి మండలం అలమండ సంత సమీపంలో టిఫిన్ చేశారు. అక్కడ నుంచి భీమసింగి బ్రిడ్జి కిందకు కారును తీసుకెళ్లి ఆపారు. అక్కడ కారు వెనుక సీటులో కూర్చున్న మహేశ్వరితో మాటలు కలిపి ఆమె చున్నీనే పీకకు బిగించి కారులోనే హతమార్చారు. అక్కడ నుంచి నిందితురాలు చిన్నతల్లి ఏమీ తెలియనట్టుగా విజయనగరం సమావేశానికి వెళ్లిపోగా, మృతదేహాన్ని కారులోనే పెట్టుకొని జమ్మాదేవిపేట గ్రామం సమీపంలోని సరస్వతీ లేవుట్ వద్ద గల నిర్మానుష్య ప్రాంతంలో తుప్పల్లో పడేసి డెంకాడ వాసు తన ఇంటికి వెళ్లిపోయాడు. మృతదేహం 18వ తేదీన ఉదయం వెలుగు చూసింది. పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తును ముమ్మరం చేశారు. ఫోన్ లోకేషన్స్, చిన్నతల్లి నడవడికపై నిఘా పెట్టగా చిన్నతల్లి, ఆమె ప్రియుడు డెంకాడ వాసు, మరో ప్రియుడు కోరాడ సాయికుమార్‌తో కలిసి దూరప్రాంతాలకు వెళ్లిపోయేందుకు బుధవారం సిద్ధమైంది. అయితే సినీ ఫక్కీలో పోలీసులు వాళ్లను చేజ్ చేశారు. లక్కవరపుకోట మండలం గంగుబూడి కూడలి వద్ద ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయగా నేరాన్ని అంగీకరించారు. నిందితులు ముగ్గురినీ కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జిముందు హాజరుపర్చగా రిమాండ్ విధించినట్టు డీఎస్పీ తెలిపారు. దృశ్యం సినిమాను తలిపించిన కేసు.. మహేశ్వరి హత్యకేసును దర్యాప్తు చేసిన పోలీసులకు దృశ్యం సినిమా తలపించింది. నిందితురా లు గాడి చిన్నతల్లి తన స్నేహితురాలు మహేశ్వరి ఫోన్‌ను మాయం చేయడంతో పాటు లోకేషన్ దొరకుండా జాగ్రత్తలు పడింది. తన ప్రియడు డెంకాడ వాసుతో కలిసి హత్యచేసి, మరో ప్రియు డు, కళ్లేపల్లికి చెందిన సాయికుమార్‌తో కలిసి పరారయ్యేందుకు ప్రయత్నించింది. ఆమెతో పాటు ఇద్దరు ప్రియుల ఫోన్లను వారివారి ఇళ్ల వద్దనే ఉంచేసి.. ఎవరికి ఎవరూ ఫోన్లు చేయకుండా గడిపారు. ఎప్పటివలే విజయనగరం సమావేశానికి చిన్నతల్లి హాజరుకావడం అంతా డ్రామాను తలపించింది. పోలీసులు సవాల్‌గా తీసుకుని కేసును దర్యాప్తు చేయడంతో నిందితు లు పట్టుబడ్డారు. కేసు ఛేదనలో ప్రతిభ కనబర్చి న ఎల్.కోట, వేపాడ ఎస్ఐలు ముకుందరావు, రాజేష్, కానిస్టేబుల్స్ ఎం.రమేష్, పోతురాజు, గౌరినాయుడులను డీఎస్పీ గోవిందరావు అభినందించారు. -
‘అరకు’ ఆనందం... అంతలోనే విషాదం
యువకులందరూ అరకు అందాలు చూద్దామని బైక్‌లపై సందడిగా బయలు దేరారు. కేరింతలు కొడుతూ ఆ రోడ్లపై ‘రయ్’మని అరకు వైపు దూసుకుపోతున్నారు. అంతలోనే ఆ యువకులకు రోడ్డు మరమ్మతుల రూపంలో మృత్యువు ఎదురైంది. అంతే ఉరకలేసే ఆ ఉత్సాహంపై ఉగ్రరూపం చూపించింది. అందులో ఒకరిని ఘటనా స్థలంలోనే ఊపిరితీసేయగా... ఇంకొకరిని చావుబతుకుల మధ్యకు నెట్టివేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి, లక్కవరపుకోట: కన్న తల్లిదండ్రులకు చెప్పాపెట్టకుండా అరుకు అందాలను తిలకించేందుకు బయలుదేరిన ఆ యువకుల జీవితాలను రోడ్డు ప్రమాదం రూపంలో ఛిద్రం చేసింది. ఓ యువకుడు తీవ్ర గాయాలతో మృతి చెందగా మరో యువకుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించి హెచ్‌సీ జి.శ్రీనువాస్‌రావు, మృతుడి బంధువులు అందించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడ మండలం గంగవరం గ్రామానికి చెందిన పేర్ల ధనేష్ (22), గాజువాకకు చెందిన ఎం.గుణశేఖర్లు తమ స్నేహితులతో కలిసి ఆరకు ఆందాలు చూసేందుకు బైక్‌లపై గురువారం అర్ధరాత్రి పయనమయ్యారు. చదవండి: (ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా డాక్టర్ సహా ముగ్గురి దుర్మరణం) పేర్ల ధనేష్, గుణశేఖర్లు ఒక బండిపై వెళ్తుండగా లక్కవరపుకోట పాత జంక్షన్ సమీపంలో అసంపూర్ణంగా నిర్మించి వదిలేసిన బ్రిడ్జి వద్దకు వచ్చే సరికి బైక్ వేగాన్ని అదుపు చేసుకోలేక రోడ్డు మధ్యలో ఉన్న మట్టిదిబ్బను ఢీకొట్టారు. దీంతో బైక్ నడుపుతున్న ధనేష్ కుడి కాలు విరిగిపోయి, తలకు తీవ్రగాయాలయ్యాయి. వెనుక కూర్చున్న గుణశేఖర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. గమనించిన మిత్రులు క్షతగ్రాత్రులను ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ధనేష్ మృతి చెందాడు. గుణశేఖర్‌ను మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించారు. మృతుడి తండ్రి విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తూ ఇటీవల మృతి చెందగా పెద్ద కుమారుడైన ఈయనకు ఆ ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద ఇచ్చారు. భర్త పోయి బాధతో ఉన్న ఆ తల్లికి ఆదుకుంటాడనుకున్న కొడుకు అంనంత లోకాలకు వెళ్లి పోవడంతో కన్నీరు మున్నీరవుతోంది. మృతుడి చిన్నాన్న శ్రీనువాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శవ పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్‌సీజీ శ్రీనువాస రావు తెలిపారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్య ఫలితమే... ఈ బ్రిడ్జి పనులు 2018 సంవత్సరంలో అర్ధంతరంగా నిలిచిపోయాయి. సంబంధిత కాంట్రాక్టర్ కానరాకుండా పోయాడు. బ్రిడ్జి ప్రవేశంలో కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా లేకపోవడంతో అటుగా వెళ్లినవారికి పనులు ఆగిపోయిన విషయం తెలియక పోవడంతో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్టు స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ బ్రిడ్జి వద్ద 12 మంది అరకు వైపు వెళ్లే పర్యాటకులు మృతి చెందారు. ఇప్పటికైనా స్థానిక పోలీసులు స్పందించి కనీసం హెచ్చరిక బోర్డులు పెట్టాలని పలువురు కోరుతున్నారు. -
గ్రామం ఒక్కటే, పంచాయతీలు రెండు!
సాక్షి, లక్కవరపుకోట(విజయనగరం): ఆ గ్రామం పేరు కోనమసివానిపాలెం. అది రెండు పంచాయితీల పరిధిలో ఉంది. అంతేనా... మండలాలు కూడా వేర్వేరే. ఇద్దరు అన్నదమ్ములుంటే ఇద్దరూ వేర్వేరు మండలానికి చెందుతున్నారు. నలభై ఏళ్లుగా ఈ సమస్య అక్కడివారిని వేధిస్తోంది. గ్రామంలో సుమారు 2500 జనాభా, 5వందల ఇళ్లు ఉన్నాయి. 1976–77 సంవత్సరంలో తామరాపల్లి గ్రామ పంచాయతీ నుంచి విడదీసి కోనమసివానిపాలెం పంచాయితీని ఏర్పాటు చేశారు. గ్రామంలో కొంత భాగం లక్కవరపుకోట మండలం కోనమసివానిపాలెంగానూ, మరికొంత భాగాన్ని కొత్తవలస మండలం దేవాడ పంచాయతీలో మసివానిపాలెంగానూ కలిపారు. అదే అక్కడ సమస్యలకు కారణమవుతోంది. గ్రామం ఒక్కటే అయినా ప్రజలను రెండు పంచాయతీలుగా, రెండు మండలాలుగా విడగొట్టడంతో ఎవరు ఏ పంచాయతీకి చెందిన వారో తెలియక సతమతం అవుతున్నారు. ఎన్నికల సమయంలో వారు ఏ పంచాయతీ తరఫు న ఓటు వేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. ఆ గ్రామంలో రెండు అంగన్వాడీ కేంద్రాలు, రెండు ప్రాధమిక పాఠశాలలు, రెండు రక్షిత మంచినీటి పథకాలు, ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు రెవెన్యూ కార్యదర్శులు. రెండు పంచాయతీ భవనాలు ఉన్నాయి. -
అడ్డువచ్చాడని రాడ్‌తో కొట్టి చంపేశారు
సాక్షి, లక్కవరపుకోట : దాయాదుల మధ్య జరిగిన కొట్లాటలో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలోని సంతపేటలో చోటుచేసుకుంది. ఎస్సై కె. ప్రయోగమూర్తి, మృతుడి బంధువులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. కొరుపోలు దేముడుబాబు, అతని దాయాదులకు కొత్తవలస–కిరండోల్ (కె.కె)లైన్ సమీపంలో పశువుల కళ్లాలున్నాయి. ఈ కళ్లాల చెంతనే గల చెరువు గర్భాన్ని ఆక్రమించుకుని పెంటలు ఏర్పాటు చేసుకుని.. కొంత భూమిని నడక దారిగా వినియోగించుకుంటున్నారు. కొద్ది రోజుల కిందట దేముడుబాబు ఆ భూమిలో ముళ్లకంచె ఏర్పాటు చేసి మొక్కలు నాటాడు. దీంతో కళ్లాలకు వెళ్లేందుకు దారి లేకుండా పోయిందని దాయాదులు గొడవపడ్డారు. ఈ క్రమంలో శనివారం ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో దేముడుబాబుకు తన దాయాదుల కుటుంబానికి చెందిన కొరుపోలు చెల్లయ్యమ్మ (వరుసకు వదిన) కళ్లాల వద్ద కనబడడంతో వాగ్వాదం జరిగింది. దీంతో దేముడుబాబు తోసెయ్యడంతో చెల్లయ్య మ్మ కింద పడిపోయింది. విషయం తెలుసుకున్న చెల్లయ్యమ్మ కుమారులు సన్యాసిరావు, అప్పలనాయుడు, మరో అన్నదమ్ముడు అప్పలనాయుడు, ఆయన భార్య సత్యవతి వచ్చి దేముడుబాబుపై పిడుగుద్దుల వర్షం కురిపించారు. వెంటనే సమీపంలో ఉన్న వారు విడిపించినప్పటికీ అప్పటికే దేముడుబాబు స్పృహ తప్పి పడిపోయాడు. కొద్దిసేపటికి సంఘటనా స్థలానికి చేరుకున్న దేముడుబాబు భార్య లక్ష్మి, తదితరులు అత డ్ని స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విష మించడంతో మెరుగైన వైద్యం కోసం ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించగా.. అక్కడ చికిత్స పొందు తూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కొరుపోలు సన్యాసిరావు, అప్పలనాయుడు, చెల్లయ్యమ్మ, సత్యవతి, అప్పలనాయుడులపై ఎస్సై ప్రయోగమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్యతో పాటు కుమారుడు కోటి, కుమార్తె అనూష ఉన్నారు. ఇంటిపెద్ద మృతి చెందడంతో కుటుంబ సభ్యులు లబోదిబోమంటున్నారు. -
నోరూరించే... భీమాళి తాండ్ర
సాక్షి, లక్కవరపుకోట : మామిడి తాండ్ర.. ఆ పేరు వింటేనే నోరూరుతోంది కదూ. లక్కవరపుకోట మండలం భీమాళి ఈ తాండ్ర తయారీకి ప్రసిద్ధి. ఇక్కడ తయారయ్యే ఈ పదార్థానికి దేశ, విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఎంతోమంది ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయుకులు తమ పనులు చేయించుకోవాలంటే భీమాళి తాండ్రను తాయిలంగా ఇచ్చేవారట. ఏడాది పొడవునా ఇక్కడ తాండ్ర చెక్కుచెదరని రుచితో లభిస్తుంది. దాదాపు 350 కుటుంబాల వారు ఈ తాండ్ర తయారీపైనే ఆధారపడుతూ జీవిస్తున్నారు. మండు వేసవి వచ్చిందంటే గ్రామస్తులంతా వీటి తయారీతో బిజీ అయిపోతారు. మామిడి పండ్ల రసంతో దీనిని తయారు చేస్తారు. కోలంగోవ, కలెక్టర్ వంటి రకాలను వీటికి వాడుతారు. బాగా పండిన మామిడి పండ్ల రసాలను ప్రత్యేంగా మహిళలు తీసి సమపాళ్లలో చక్కెర కలిపి వెదురు చాపలపై పొరలు పొరలుగా వేసి ప్రకృతి సిద్ధంగా ఎండలో ఆరబెడతారు. ఇలా ఒక రెండు ఇంచీల మందం వరకు వేసి పూర్తిగా ఎండిన తరువాత కేజీకి ఒక ముక్క చొప్పున కట్ చేసి పెకింగ్ చేసి అమ్మకాలు చేస్తుంటారు. ప్రస్తుతం తాండ్ర కిలో ధర రూ.120లకు అమ్ముతున్నారు. -
నిద్రపోతున్న నిఘా నేత్రాలు..!
సాక్షి, లక్కవరపుకోట (విజయనగరం): అధికారుల నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయి. ఇసుక, కలప అక్రమరవాణా యథేచ్ఛగా సాగుతోంది. ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ప్రభుత్వ పాలనలో ప్రక్షాలన తీసుకొచ్చేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కృషిచేస్తోంది. అయితే, అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలో ఇష్టారాజ్యంగా వృక్షాలను నరికివేసి తరలించుకుపోతున్నా పట్టించుకునేవారే కరువయ్యారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. పగలు, రాత్రీ తేడా లేకుండా ఇసుక తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడాన్ని జనం తప్పుబడుతున్నారు. ఇటీవల కాలంలో మండలంలోని పలు గెడ్డలు, వాగుల్లోని ఇసుకను తవ్వి ట్రాక్టర్లు, లారీల సాయంతో తరలించుకుపోతున్నారు. అధికారులు మాత్రం తూతూ మంత్రంగా ఒకటి రెండు వాహనాలపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. పెద్దపెద్ద వృక్షాలను అడ్డంగా నరికేస్తున్నారు. మండలంలోని ఐదు కర్రల మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లుల వద్ద వివిధ రకాలకు చెందిన వందలాది మానులు నెట్టువేసి ఉన్నాయి. అటవీశాఖ వారు ఈ అక్రమ కలప దందాపై కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. చెట్ల నరికివేతకు ఇటీవల కాలంలో ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తహసీల్దార్ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. అలాంటప్పుడు ఇంత కలప ఎలా రవాణా అవుతుందో ఆర్ధం కావడం లేదని పలువురు బహిరంగానే చెబుతున్నారు. నిఘా నేత్రాలు నొట్టబోయే సరికి అక్రమ రవాణా దారులు దందాలకు తెగబడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేల్కొని అక్రమ రవాణపై దృష్టి సారించాలని కోరుతున్నారు. -
నిందితుడిని పట్టించిన సెల్‌ఫోన్
లక్కవరపుకోట : పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మహిళ హత్యకేసులో నిందితుడిని పట్టుకున్నారు. ఎట్టకేలకు నిందితుడు గనివాడ అప్పారావు ఉరఫ్ గ్యాస్ అప్పారావును పోలీస్‌లు అరెస్టు చేసి ఆదివారం ఎస్.కోట కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుకు సంబంధించి ఎస్.కోట సీఐ వై.రవి తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 23న కొత్తవలస మండలం సంతపాలెం గ్రామానికి చెందిన పల్లా లక్ష్మి ఉరఫ్ బంగారమ్మ(40) హత్యకు గురైన విషయం తెలిసిందే. ఎస్.కోటకు చెందిన గనివాడ అప్పారావు ఎస్.కోట భారత్ గ్యాస్ ఏజన్సీలో దినసరి వేతనదారుడుగా పనిచేసేవాడు. ఈక్రమంలో మృతురాలు లక్ష్మితో మూడు సంవత్సరాల కిందట పరిచమైంది. ఆ పరిచయం క్రమంగా అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం నిందితుడు భార్య అచ్చియ్యమ్మకు తెలియడంతో ఇద్దరిని నిలదీసింది. దీంతో లక్ష్మిని విశాఖపట్నం తీసుకువచ్చి అప్పారావు వేరేగా కాపురం పెట్టారు. ఈ సమయంలో అప్పారావుకు అనారోగ్యం సోకడంతో లక్ష్మి పట్టించుకోలేదు. దీంతో అప్పారావు ఎస్.కోటలో ఉంటున్న భార్య అచ్చియమ్మ వద్దకు వచ్చేశాడు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత శ్రీరాంపురం గ్రామ సమీపంలో గల స్టీల్ఎక్సే్చంజ్ కర్మాగారంలో రోజువారీ పనులకు వెళ్లాడు. ఈ సమయంలో లక్ష్మి మళ్లీ అప్పారావుకు ఫోన్ చేసి తన భవిష్యత్ ఏమిటని ప్రశ్నించేది. దీంతో లక్ష్మి బాధ పడలేక అదే కర్మాగారంలో రోజువారి పనిలో చేర్పించి కొత్తపాలెం గ్రామంలో చిన్న తాటాకు ఇల్లును అద్దెకు తీసుకొని అమెను ఉంచాడు. అప్పారావు మాత్రం ఎస్.కోట నుంచే రాకపోకలు సాగించేవాడు. ఇదిలా ఉండగా లక్ష్మి కర్మాగారంలో కొంతమంది వ్యక్తులతో చనువుగా ఉండడం చూసి అప్పారావు ఆమెను అంతమొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు. ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీ రాత్రి లక్ష్మికి ఫోన్‌చేసి గోల్డుస్టార్ జంక్షనవద్ద కలుద్దామని చెప్పాడు. ఎస్.కోట నుంచి రెండు మద్యం సీసాలు, గ్లాసులు, వాటర్ ప్యాకెట్లను కొనుగోలు చేసి అప్పారావు గోల్డుస్టార్ జంక్షన్‌కు వెళ్లేసరికి అప్పటికే లక్ష్మి చేరుకుంది. నిర్మాణుష్య ప్రాంతానికి వెళ్దామని లక్ష్మిని అడగ్గా, సర్లే నాకు తెలిసిన స్థలం ఉందని చెప్పి పక్కనే గల జమ్మాదేవిపేట వూట చెరువు గట్టుకు తీసుకెళ్లింది. అక్కడ ఇద్దరూ పూటుగా మద్యం సేవించి సంభాషించుకునే సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో లక్ష్మి గొంతును బలంగా అదిమి హత్య చేశాడు. మృతదేహంపై చెట్ల కొమ్మలు వేసి ఆమె ఫోన్ తీసుకుని అప్పారావు ఎస్.కోట వెళ్లిపోయాడు. పోలీసులు రంగప్రవేశం చేసి మృతురాలు లక్ష్మి పూర్తివివరాలు తెలుసుకున్నారు. ఈ క్రమంలో అప్పారావు పాత్రపై అనుమానాలు రావడంతో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. మృతురాలి ఫోన్ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ కాల్స్ పరిశీలించగా 22వ తేదీన అప్పారావుతో ఎక్కువగా మాట్లాడినట్లు తెలిసింది. పైగా మృతదేహం వద్ద లభించిన గ్లాసులు, వాటర్ ప్యాకెట్లపై అప్పారావు వేలిముద్రలున్నాయి. దీంతో నిందితుడ్ని గట్టిగా ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నాడు. నిందితుడ్ని ఎస్.కోట కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. కార్యక్రమంలో ఎస్.కోట, ఎల్.కోట ఎస్సైలు అమ్మినాయుడు, మండల శ్రీనువాస్ పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
లక్కవరపుకోట: హత్య కేసులో నిందితుడ్ని స్థానిక పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సీఐ సంజీవరావు, ఎస్సై నరేష్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మండలంలోని రెల్లిగౌరమ్మపేటకు చెందిన దార వెంకటరమణ (32) తన భార్య అప్పలకొండను గురువారం రాత్రి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించగా, అదే రోజు రాత్రి నిందితుడు వెంకటరమణ వీఆర్ఓ డీవీ రామదాసు సమక్షంలో పోలీసులకు లొంగిపోయూడు. దీంతో పోలీసు లు అతడ్ని విచారించగా నేరాన్ని అంగీకరించాడు తన భార్య వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతడ్ని అరెస్ట్ చేసి కొత్తవలసలో కోర్టులో హాజరుపరిచారు. హత్యకు సంబంధించిన కత్తిని పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్సై ఎల్.మన్మధరావు, కానిస్టేబుల్స్ పి.ప్రశాంత్‌కుమార్, షేక్ అమీనభీబి, సురేష్ పాల్గొన్నారు. -
చొక్కా కొంటే చిత్తు కాగితాలొచ్చాయి!
ఆన్లైన్ షాపింగ్‌తో మోసపోయిన బిహారీయుడు లక్కవరపుకోట (విజయనగరం): ఆన్లైన్లో షాపింగ్ చేసి.. ఆత్రంగా వచ్చిన పార్శిల్ తెరవగా అందులో చిత్తు కాగితాలు చూసి బిత్తరపోయిన యువకుడి ఉదంతమిది. విజయనగరం జిల్లాలో లక్కవరపుకోట మండలం శ్రీరాంపురం గ్రామం సమీపంలో గల స్టీల్ ఎక్స్ఛేంజ్ ఇండియా లిమిటెడ్ కర్మాగారం రోలింగ్ మిల్లులో పనిచేస్తున్న బిహార్ రాష్ట్రానికి చెందిన రాజుకుమార్‌సింగ్ ఈ నెల 9వ తేదీన సంశన్ టెలీషాపింగ్ సంస్థలో ఆన్లైన్ ద్వారా రూ.6,500 విలువైన టీషర్ట్, జీన్స్‌ప్యాంట్, సాంసంగ్ మొబైల్, కళ్లద్దాలు, బెల్టుకోసం ఆర్డర్ చేశారు. 15వ తేదీన లక్కవరపుకోట తపాలా హెడ్‌ఆఫీసుకు పార్శిల్ రాగా రూ.6,500 చెల్లించి తీసుకున్నారు. తీరా పార్శిల్ విప్పిచూడగా అందులో చెత్తపేపర్లు ఉండటంతో నిర్ఘాంతపోయాడు. లబోదిబో మంటూ పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీశాడు. -
నాసిరకం కానుకలు..!
* కందిపప్పులో రాళ్లు, పురుగులు * నెయ్యి,బెల్లం తూకంలో అవకతవకలు * రెండు డిపోలకు చేరని సరుకులు * అందని సంచులు * అసహనం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు లక్కవరపుకోట: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న క్రిస్మస్,సంక్రాంతి కానుకల్లో నాసిరకం సరుకులను అందజేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. పేదలే కదా ఇచ్చింది తీసుకుంటారు,..అదికూడా ఉచితంగానే కదా ఎలాంటి సరుకులు ఇస్తే ఏమిటి అనుకున్నారో ఏమో.పురుగులు పట్టి,పుచ్చిపోయిన కందిపప్పు.నాసిరకమైన బెల్లం అందజేస్తున్నారని లబ్ధిదారులు అవేదన చెందుతు న్నారు. ప్రతి తెల్లరేషన్ కార్డు దారుడికి కేజీ గోధుమపిండి,వంద గ్రాముల నెయ్యి,అరకేజీ బెల్లం,కందిపప్పు, శనగపప్పు,పంచదార అరకేజీ చొప్పున అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ వస్తువులను వాటి తూకాల ప్రకారం ప్యాకింగ్ చేసి కోట్లు రూపాయలు వెచ్చించి చంద్రబాబు ఫొటోతో ముద్రించిన సంచుల్లో అబ్ధిదారులకు అందజేస్తున్నారు. అయితే ఈ సరుకుల్లో బెల్లం అరకేజీకి బదులు 450 గ్రాములు,వంద గ్రాముల నెయ్యికి 90 గ్రాముల నెయ్యి మాత్రమే వస్తున్నట్లు పలువురు వాపోతున్నారు.అలాగే కందిపప్పులో రాళ్లు, పెంకిపురుగులతో పూర్తిగా నాసిరకం కొట్టొచ్చినట్లు కన్పిస్తోందని చెబుతున్నారు.ఈ సరుకులు అందజేసే సంచులు మాత్రం ఒక్కో డిపోకు కేవలం 50 చొప్పున అందజేశారు. ఆ సంచుల్లో ఎవరికి ఇవ్వాలో తెలియక డీలర్లు అయోమయంలో ఉన్నారు. క్రిస్మస్ పూర్తయినా అందని సరుకులు ప్రస్తుతం అదికారులు ముందస్తుగా క్రైస్తవ మతస్తులకు చంద్రన్న సంక్రాంతి కానుకలను క్రిస్మస్ పర్వదినానికి అందజేసేందుకు సిద్ధమయ్యారు. కాగా నేటికీ వేపాడ మండలంలోని చిన్నదుంగాడ,వేపాడ డిపోలకు సరుకుల సరఫరా జరగేదు.మరికొన్ని డిపోల్లో సర్వర్ పనిచేయకపోవడంతో సరుకుల పంపిణీ జరగలేదు. లక్కవరపుకోట మండలంలోని 15,834కార్డులు,వేపాడ మండలంలో 14,633కార్డులు ఉన్నాయి. సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడంతో శుక్రవారం నాటికి కేవలం 5శాతం మందికి మాత్రమే సరుకులను అందజేశారు. లబ్ధిదారుల్లో అసహనం ప్రభుత్వం అందజేస్తున్న సరుకుల్లో తూకాలు సక్రమంగా లేవని అదికూడా నాసిరకమైన సరుకులు అందజేయడంతో పలువురు లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ప్రచారం తప్ప సరుకుల్లో నాణ్యత లేదని వాపోతున్నారు. ఇచ్చింది గోరంత అయితే ప్రచారం మాత్రం కొండంతగా ఉందని అంటున్నారు. దీపావళికి కేజీ పంచదార అందజేస్తామని ప్రకటించారు. కాగా ఆరకేజీ చొప్పునే అందజేశారని పలువురు వాపోతున్నారు. ఈ విషయమై సీఎస్‌డీటీ రామచంద్రారెడ్డిని వివరణ కోరగా..సరుకుల కొలతలో తేడాలు వస్తున్నట్లు,నాణ్యత విషయంపై పలువురి దగ్గరనుంచి ఫిర్యాదులు వస్తున్నాయని అంగీకరించారు. ఈ విషయాలను పై అధికారులకు తెలియజేశామని చెప్పారు. మేము చేసిన ప్యాకింగ్‌లు కావు చంద్రన్న కానుకకు సంబంధించిన సరుకులు మేము ప్యాకింగ్ చేయలేదు. ప్యాకింగ్ చేసిన వస్తువులే మాకు అందజేశారు.ఆసరుకులే లబ్ధిదారులకు అందజేస్తున్నాం. తూకంలో కొద్దిపాటి తేడాలు రావడము వాస్తవమే. - ఐ.ముత్యాలు,ఆర్.జి.పేట డీలర్ సరుకులు బాగోలేవు ప్రస్తుతం కోటాలో ఇస్తున్న పండగ సరుకులు బాగోలేవు. బెల్లం,నెయ్యి తూకం వేస్తే తక్కువ వస్తున్నాయి.డీలర్లను అడిగితే వారు ఇచ్చిందే పంచుతున్నామంటున్నారు. -ఆర్.సత్యవతి,శ్రీరాంపురం -
లక్కవరపు కోటలో ఇళ్లు దగ్థం
విజయనగరం : విజయనగరం జిల్లాలో లక్కవరపు కోట మండలం యేతపేటలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 30 పూరిళ్లు దగ్దమైనాయి. గ్రామానికి చెందిన కల్లు గీత కార్మికులు నివాసముండే ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. పూరిళ్లలో ఎవరు లేని సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి నష్టం అధికంగా ఉన్నప్పటికి ప్రాణ నష్టం ఏమీ జరగలేదని పోలీసులు తెలిపారు. చిన్న పిల్లలు వీధిలో జీడిపిక్కలు కాల్చుకుంటుండగా నిప్పురవ్వలు ఎగసిపడి అగ్నిప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. అన్నీ పూరిళ్లు కావడంతో మంటలు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి క్షణాల్లో వ్యాపించాయి. ఈ ప్రమాదంతో సుమారు 60 కుటుంబాల వారు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఏడాదంతా కష్టపడి దాచుకున్న తిండిగింజలు, సామగ్రి పూర్తిగా కాలిపోవడంతో వారంతా నిరాశ్రయులయ్యారు. రూ.50 లక్షల వరకు ఆస్తినష్టం జరిగి ఉంటుందని రెవెన్యూ అధికారులు ప్రాథమిక అంచనా. -
అనుమానం పెనుభూతమై..
లక్కవరపుకోట:భార్యకు వివాహేతర సంబంధం ఉందేమోనన్న అనుమానం దహించి వేయడంతో కట్టుకున్న భార్యను హత్య చేశాడో కసాయి భర్త. కలకాలం అండగా ఉంటాడని భావించి ఏడడుగులు నడిచి పెళ్లి చేసుకున్నభర్త..వరుసకు మరిది అయిన వ్యక్తితో వివాహేతర సంబంధం అంటగట్టి ప్రాణాలు తీశాడు. ఇందుకు సంబంధించి ఎస్‌కోట సీఐ లక్ష్మణరావు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కిత్తన్నపేట గ్రామానికి చెందిన గొలగాని ఎర్రునాయుడుకు కొత్తవలస మండలం నరపాం గ్రామానికి చెందిన ముత్యాలమ్మతో ఐదు సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. కొంతకాలం వారి కాపురం సజావుగానే సాగింది. ఈ మధ్యకాలంలో వరుసకు మరిది అయిన వ్యక్తితో ముత్యాలమ్మ మాట్లాడడంతో భర్త ఆమెకు వివాహేతర సంబంధం అంటగట్టి నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో భార్యాభర్తలు గొడవపడేవారు. దీంతో మూడునెలలనుంచి ముత్యాలమ్మ కన్నవారింటి దగ్గర ఉంది. ఈనెల 8వతేదీన అత్తవారింటికి వచ్చింది. మరునాడు రాత్రి భార్తాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. రోజూలాగానే పశువులకు నీళ్లు తాగించడానికని భార్య బుధవారం వెళ్లడానికి చూసిన భర్త ఆమెను వెంబడించి చంపి ఉరివేశాడని సీఐ తెలిపారు. ముందుగా చంపేసి తరువాత ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకుందని పోలీస్ స్టేషన్‌కు వచ్చి నమ్మించాలని చూశాడని, విచారణలో మాత్రం వివాహేతర సంబంధం అనుమానంతో భార్యను చంపేసినట్లు ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు. మృతురాలి తండ్రి కొయ్యాన అప్పారావు ఇచ్చిన ఫిర్యాదుమేరకు ఎస్‌కోట సీఐ కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్‌కోట కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. -
మాజీ మంత్రి కోళ్ల కన్నుమూత
లక్కవరపుకోట : ఉత్తరాంధ్ర రాజకీయ కురువృద్ధుడు, మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు (86) శనివారం రాత్రి కన్నుమూశారు. కొన్నాళ్లుగా తీవ్ర అస్వస్థతకు గురై విశాఖపట్నంలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి పరిస్థితి విషమించి 12.05 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఉదయం ఐదు గంట లకు కోళ్ల స్వగ్రామం ఖాసాపేట శివారు ముత్యాలమ్మపాలేనికి ఆయన భౌతిక కాయూన్ని తీసుకువచ్చారు. అప్పటికే ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో గ్రామం లో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రులు కె.అచ్చెన్నాయుడు, కిమిడి మృణాళిని, ఎమ్మెల్యేలు ఆర్వీఎస్కే రంగారావు, కేఏ నాయుడు, పి.నారాయణస్వామినాయుడు, బండారు సత్యనారాయణ, వి.రామకృష్ణబాబు, పీలా గోవింద శ్రీనివాసరావు, గుండ లక్ష్మీదేవి, మాజీ మంత్రులు పెనుమత్స సాంబశివరాజు, పడాలఅరుణ, మత్స మణికుమారి, జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, కలెక్టర్ ఎంఎం నాయక్, జేసీ బి.రామారావు, ఆర్డీఓ జె.వెంకటరావు, డీఎస్పీ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు గద్దే బాబూరావు, ఆర్పీ భంజ్‌దేవ్‌తో పాటు ద్వారపురెడ్డి జగదీష్, డాక్డర్ పెద్దినాయుడు, వేచలపు చినరామునాయుడు, యల్లపు దమయంతి, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు కోళ్ల పార్దీవ దేహం వద్ద నివాళులర్పించారు. కోళ్ల మృతికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం తెలిపారు. సమాచారం తెలుసుకున్న చంద్రబాబు ఎమ్మెల్యే లలితకుమారిని ఫోన్లో పరామర్శించారు. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో... ముత్యాలమ్మపాలెం(లక్కవరపుకోట) : మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఆదివారం సాయంత్రం ఆయన స్వగ్రామంలో జరిగాయి. కోళ్ల వ్యవసాయ క్షేత్రంలో ఆర్డీఓ జె.వెంకటరావు పర్యవేక్షణలో డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి నివాళులర్పించారు. పెద్ద కుమారుడు రాంప్రసాద్ కోళ్ల చితికి నిప్పటించారు. ముందుగా కోళ్ల పార్దీవ దేహానికి వేదపండితులు హిందూ ధర్మశాస్త్ర ప్రకారం క్రియలు నిర్వహించారు. వేలాది మంది అభిమానులతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు కోళ్ల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. సర్పంచ్ నుంచి... శృంగవరపుకోట/లక్కవరపుకోట : సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన కోళ్ల అప్పలనాయుడు సర్పంచ్ స్థానం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. జిల్లాకే రాజకీయ రంగంలో వన్నె తెచ్చారు. అజాతశత్రువుగా మచ్చలేని రాజకీయ జీవితం గడిపారు. 1951లో ఖాసాపేట పీఏసీఎస్ డెరైక్టర్‌గా రాజకీయ జీవితం ప్రారంభించిన కోళ్ల సర్పంచ్‌గా, ఎమ్మెల్యేగా..ఏడుసార్లు గెలిచి ప్రజాభిమానం పొందారు. చంద్రబాబునాయుడు హయూంలో ప్రొటెం స్పీకర్‌గా కూడా పని చేశారు. కోళ్లకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉండగా... ఇటీవల రెండో కుమారుడు మోహన్ మృతి చెందారు. -
మమ్మల్ని కలపండి ప్లీజ్!
కోనమసివానిపాలెం(లక్కవరపుకోట):ఆ గ్రామం పేరు కోనమసిపాలెం. అక్కడ అం తా అయోమయం. గజిబిజి గందరగోళం. తమ్ముడు ఒక మండలంలో ఉంటే అన్న వేరే మండలంలో ఉంటాడు. ఎవరు ఏ పంచాయతీకి చెందిన వారో అసలు తెలీదు. ముప్పై ఏళ్లుగా ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. ఇన్నేళ్లుగా స్థానికులు అధికారులకు అధికారులకు వినతులు ఇస్తూనే ఉన్నారు. కానీ ఎవరూ వారి సమస్యను పట్టించుకోలేదు. లక్కవరపుకోట మండలం కోనమసివానిపాలెం గ్రామంలో ఐదు వందల ఇళ్లున్నాయి. దాదాపు 2,500 మంది జనాభా ఉన్నారు. 1976-77లో తామరాపల్లి గ్రామ పంచాయతీ నుంచి విడదీసి కోనమసివానిపాలెం పంచాయతీను అధికారులు ఏర్పాటు చేశారు. గ్రామంలో కొంత భాగాన్ని కొత్తవలస మండలం దేవాడ పంచాయతీలో కలిపారు. అక్కడే అసలు సమస్య ఏర్పడింది. గ్రామం ఒక్కటే అయినప్పటికీ ప్రజలను రెండు పంచాయతీలు, రెండు మండలాల్లో కలిపారు. దీంతో ఎవరు ఏ పంచాయతీకి చెందిన వారో స్థానికులకు కూడా అయోమయంగా ఉంది. వారికి అవసరమైన ధ్రువపత్రాలను ఏ మండలంలో తీసుకోవాలో కూడా తెలీకుండా వారు అవస్థలు పడుతున్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఏ పంచాయతీలో ఓటు వేయాలో కూడా తెలీదు. గ్రామంలో ఒక వీధి అవతల భాగం కొత్తవలస మండలం దేవాడ పంచాయతీ శివారు కోనమసివానిపాలెం గ్రామంగా, మరొక వైపు లక్కవరపుకోట మండలం కోనమసివానిపాలెం పంచాయతీగా గుర్తింపు ఉంది. అన్నీ రెండేసే... కోనమసివానిపాలెం గ్రామం ఒక్కటే కాగా ప్రభుత్వ కార్యాలయాలు రెండేసి ఉన్నాయి. రెండు అంగన్వాడీ కేంద్రాలు, రెండు ప్రాథమిక పాఠశాలలు, రెండు రక్షిత మంచినీటి పథకాలు, ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు రెవెన్యూ కార్యదర్శులు ఉన్నారు. అలాగే రెండు పంచాయతీ భవనాలు కూడా ఉన్నాయి. వృథా అవుతున్న ప్రజాధనంగ్రామంలో అన్నీ రెండేసి ఉండడంతో ప్రజాధనం వృథా అవుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో సరిపడినంత విద్యార్థులు లేకపోవడంతో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన భవనాలు ఖాళీగా ఉంటున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు కూడా పూర్తిస్థాయిలో అమలు కావడం లేదు. గ్రామాన్ని ఒక పంచాయతీగా చేసి ఒకే మండలానికి చెందినదిగా చేయాలని స్థానికులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం కనిపించలేదు. -
జగన్ పాలనతోనే స్వర్ణయుగం
లింగంపేట (లక్కవరపుకోట), న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనతోనే రాష్ట్రంలో స్వర్ణయుగం సాధ్యమని ఆ పార్టీ ఎస్. కోట నియోజకవర్గ సమన్వయకర్త గేదెల తిరుపతి అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ఆదివారం మార్లాపల్లి, లింగంపేట, పూడివానిపాలెం గ్రామాలకు చెందిన 60 కుటుంబాలు వైఎస్సార్ సీపీ లో చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతగానో శ్రమిస్తున్నారన్నారు. విభజనను అడ్డుకునే సత్తా జగన్మోహన్రెడ్డికే ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కన్వీనర్ యడ్ల నా యుడు, గుమ్మడి శ్రీను, జి. సూరిదేముడు, బి. దేము డు, ఎ. సురేష్, బి. సత్తిబాబు, పాల్గొన్నారు. భవిష్యత్తు మనదే! కురుపాం : రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే భవి ష్యత్తు ఉందని ఆ పార్టీ నాయకులు పత్తిక లక్ష్మయ్య, పెద్దింటి జ్యో తి అన్నారు. కొండబారిడి పంచాయతీ సర్పంచ్ టి. మంజువానితోపాటు ఆ పంచాయతీ ప రిధిలోని తుమ్మిక మానుగూడ గ్రామానికి 40 కుటుం బాలు వైఎస్సార్ సీపీలో చేరాయి. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలు సక్రమంగా కొనసాగాలంటే ఆయ న తనయుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయూలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పి. లేవిడి సర్పం చ్ పత్తిక ఇందిర, పార్టీ నాయకులు నిమ్మక గోపాల్, బోటు లక్ష్మీనారాయణ, నిమ్మక వెంకటరా వు, ఆరిక శంకరరావు, ఆరిక కిశోర్, బుద్దేష్, పాల్గొన్నారు.