విజయనగరంలోని బాలాజీ మార్కెట్ వస్త్ర దుకాణాల్లో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది.
విజయనగరం క్రైం: విజయనగరంలోని బాలాజీ మార్కెట్ వస్త్ర దుకాణాల్లో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. వాస్తవానికి మంగళవారం బాలాజీ మార్కెట్‌కు సెలవు. ఇక్కడ 31, 32 నంబర్ల రెడీమేడ్ దుకాణాలను కమల్ చోప్రా నిర్వహిస్తున్నారు. రాత్రి సుమారు ఏడుగంటల సమయంలో ఈ దుకాణాల్లో మంటలు రేగాయి. స్ధానికులు చూసి పట్టణ అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం అందించడంతో పట్టణ అగ్నిమాపక అధికారి ఎస్.దిలీప్‌కుమార్ ఆధ్వర్యంలో శకటంతో వెళ్లి సుమారు అరగంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.
విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక అధికారులు, సిబ్బంది, స్థానికులు మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో సుమారు రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. విద్యుదాఘాతం వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు అంచనా వేశారు.