వేటాడే నడి సంద్రంలోనే కాదు.. జీవించే నేలపై కూడా మత్స్యకారుల జీవితాలకు భరోసా లేకుండా పోయింది. ఎగిసిపడే అలలను.. లోతైన సముద్రాన్ని.. పెను తుపాన్లు దాటుకు వచ్చిన వారికి అగ్ని ప్రమాదం పెను నష్టాన్ని మిగిల్చింది. గంగమ్మ ఒడిలో సంపాదించుకున్న కొద్దిపాటి నగదు.. బంగారం అగ్నికి ఆహుతవుతుంటే చేష్టలుడిగి చూడడం తప్ప గంగ పుత్రులకు మరోదారి లేకుండా పోయింది. తీర ‡గ్రామం బలుసుతిప్పలో శనివారం జరిగిన అగ్నిప్రమాదం మత్స్యకార కుటుంబాలను నడివీధికి నెట్టింది. అగ్ని కీలలకు పెథాయ్ పెనుగాలులు తోడై, క్షణాల్లో 16 పూరిళ్లను భస్మీపటలం చేసింది. 24 కుటుంబాల వారిని కట్టుబట్టలతో రోడ్డున పడేసింది.
కాట్రేనికోన/ ముమ్మిడివరం/ఐ.పోలవరం: కాట్రేనికోన మండలంలోని మరో మత్స్యకార గ్రామం అగ్నిప్రమాదం బారిన పడింది. తీర ప్రాంత గ్రామం బలుసుతిప్పను శనివారం అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఒకానొక సమయంలో గ్రామం మొత్తం తగలబడిపోతుందేమోనని స్థానికులు ఆందోళన చెందారు. పరిసర ప్రాంతాల్లో పక్కా భవనాలు ఉండడంతో ప్రమాద ఉధృతి చాలా వరకూ తగ్గింది. లేకపోతే పెనుగాలులకు గ్రామంలోని వందలాది ఇళ్లు భస్మీపటలం అయ్యేవే. ఈ ప్రమాదంలో విలువైన బంగారం, వెండి, నగదు, దస్తావేజులు, ఇతర వస్తువులు కాలి బూడిదవడంతో రూ.కోటి వరకూ ఆస్తినష్టం ఏర్పడింది. కట్టెల పొయ్యి నుంచి లేచిన నిప్పురవ్వల వల్ల ఈ ప్రమాదం సంభవించింది. గ్రామంలోని మత్స్యకారులు సముద్రంలో చేపలు వేటాడగా వచ్చే కొద్దిపాటి సొమ్మును ఇంట్లోనే భద్రపరుచుకుంటారు. అలా దాచుకున్న నగదు, బంగారు వస్తువులు ఈ ప్రమాదంలో కాలి బూడిదవడంతో ఆస్తి నష్టం ఎక్కువగా ఉంది. ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో గ్రామస్తులు ఆక్రందనలతో బయటకు పరుగులు తీశారు. కొందరు మంటలు ఎగసి పడకుండా చుట్టుపక్కల ఇళ్లపై నీళ్లుజల్లి ప్రమాదం నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు.
ఆకుల సరస్వతి ఇంట్లో నిద్రిస్తోంది. ఇంటి నుంచి మంటలు ఎగసి పడటంతో పక్కన ఉన్న వారు చూసి చెప్పడంతో ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటకు వచ్చింది. క్షణాల్లో అగ్నికీలలు ఎగసిపడి చుట్టుపక్కల ఉన్న ఇళ్లను చుట్టుముట్టాయి. ప్రమాదంలో రేకాడి గవరమ్మ, ఆకుల అనపర్తి, సంగాని భూలక్ష్మి, మేడా వెంకటేశ్వర్లు, ఓలేటి సత్తిరాజు, ఆకుల వెంకటేశ్వర్లు, సంగాని ధర్మారావు, ఓలేటి భూలక్ష్మిలకు చెందిన ఇళ్లతో సహా మొత్తం 16 ఇళ్లు దగ్ధమయ్యాయి. రేకాడి గవరమ్మ, నరసింహమూర్తి దంపతులు గ్రామంలోనే చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకొంటూ జీవిస్తున్నారు. వారి చిన్న కుమార్తె జ్యోతికి వివాహం నిశ్చయం కావడంతో ఖర్చుల కోసం ఇంట్లో దాచిన రూ.ఐదు లక్షల నగదు, ఏడు కాసుల బంగారం భద్రపరిచారు. అగ్ని ప్రమాదంలో అవన్నీ కాలి బూడిదవడంతో ఆ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కాకినాడలో చదువుకుంటున్న తన కూతురిని చూడడానికి వెళ్లిన మేడా వెంకటేశ్వర్లు ఇల్లు బుగ్గయ్యింది. ఇంట్లో ఉన్న బంగారం, నగదు, డాక్యుమెంట్లు కాలి బూడిదయ్యాయి. సంగాని ధర్మారావు, పార్వతి కుటుంబానికి చెందిన ఇంటితో పాటు, ఆరు కాసుల బంగారం, నగదు ఆగ్నికి ఆహుతయ్యాయి.
ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి: పొన్నాడ సతీష్‌కుమార్
బలుసుతిప్ప అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ ముమ్మిడివరం నియోజకవర్గ కోఆర్డినేటర్ పొన్నాడ సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన గంటకే ఆయన సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఓదార్చారు. ప్రమాదం జరిగిన ప్రతి ఇంటినీ పరిశీలించారు. గతంలో పల్లం, కొత్తపాలెం గ్రామాల్లో జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.8 వేలు, బియ్యం పంపిణీ చేసినందున, ఇప్పటి బాధితులకు కుటుంబానికి రూ.15 వేల చొప్పున అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
పక్కా ఇళ్లకు నివేదిస్తాం: ఆర్డీవో
బలుసుతిప్పఅగ్ని ప్రమాదంలో 16 ఇళ్లు కాలిపోగా 24 కుటుంబాలు నిరాశ్రయులయ్యారని అమలాపురం ఆర్డీవో వెంకటరమణ తెలిపారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా 20 కేజీల బియ్యంతో పాటు, పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి మూడు పూటలా భోజనం పెడతామన్నారు. వారికి పక్కా ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment