సినిమా థియేటర్లలో రక్షణ ఎంత ? | fire accident on in Ambika Theatre | Sakshi
Sakshi News home page

సినిమా థియేటర్లలో రక్షణ ఎంత ?

May 28 2014 12:05 AM | Updated on Sep 5 2018 9:45 PM

సినిమా థియేటర్లలో రక్షణ ఎంత ? - Sakshi

సినిమా థియేటర్లలో రక్షణ ఎంత ?

పట్టణంలోని అంబికా థియేటర్ ఆధునికీకరణ పనులు జరుగుతుండగా సోమవారం సాయంత్రం 4.30-4.35 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. 4.45 గంటలకు మండపేట ఫైర్‌స్టేషన్‌కు

మండపేట, న్యూస్‌లైన్ : పట్టణంలోని అంబికా థియేటర్ ఆధునికీకరణ పనులు జరుగుతుండగా సోమవారం సాయంత్రం 4.30-4.35 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. 4.45 గంటలకు మండపేట ఫైర్‌స్టేషన్‌కు సమాచారమందగా 4.52 గంటలకే అగ్నిమాపకవాహనంతో సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. అప్పటికే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. మరో వాహనం కోసం 5.05 గంటలకు రామచంద్రపురం ఫైర్‌స్టేషన్‌కు స్థానిక ఫైర్ అధికారులు సమాచారమందించారు. 5.34 గంటలకు రామచంద్రపురం సిబ్బంది వాహనంతో అక్కడకు చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండున్నర గంటల పాటు శ్రమించి 7.20 గంటలకు మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే థియేటర్ మొత్తం కాలి బూడిదైపోయింది. ఇది జరగడానికి పట్టింది కేవలం 30 నిముషాలు మాత్రమే.
 
 సుమారు రూ. 60 లక్షల మేరకు ఆస్తినష్టం వాటిల్లింది. ప్రమాద సమయానికి ప్రదర్శన లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టమూ సంభవించలేదు. ఒకవేళ థియేటర్‌లో ప్రేక్షకులే ఉంటే... తలచుకొంటేనే భయమేస్తుంది.  క్షణాల్లో వ్యాపించిన మంటలతో దట్టంగా కమ్ముకున్న పొగలు, అగ్నికీలల నుంచి ప్రేక్షకులు బయటకు రావడం అసాధ్యమే అవుతుంది. అపార ప్రాణనష్టం సంభవించేది. 1997 ప్రాంతంలో ఢిల్లీలోని ఒక సినిమా థియేటర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో అనేక మంది మృత్యువాతపడ్డారు. ఈ విషయమై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం కోర్టులో విచారణలో ఉంది.
 
 కాగా 1970లో వచ్చిన సినిమా రెగ్యులైజేషన్ యాక్ట్‌ప్రకారం సినిమా థియేటర్లలో యాజమాన్యాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిబంధనలను రూపొందిస్తోంది.  గత ఏడాది జూలై 3న జీవో నంబర్ 177ను విడుదల చేసింది. మండల గ్రామాలు, అర్బన్ ఏరియాల్లో ఉండే థియేటర్లు, వాటి ఎత్తు, థియేటర్ల సముదాయంలో ఉండే స్క్రీన్లు సంఖ్య తదితర వాటి ఆధారంగా థియేటర్లను ఆరు కేటగిరీలుగా విభజించి వాటిలో చేయ్యాల్సిన ఏర్పాట్లు, ఫైర్ సేఫ్టీ నిబంధనల గురించి అందులో పేర్కొంది. జిల్లాలో సుమారు 149 వరకు సినిమా థియేటర్లు ఉన్నాయి.
 
 అయితే వీటిలో ఎన్నింటికి సరైన అనుమతులు ఉన్నాయి ?  అగ్నిమాపక నిబంధనలు మేరకు ఎన్నింటికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు ఉన్నాయి ? అనే విషయమై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న దాఖలాలు నామమాత్రమే. ప్రమాదం సంభవించినప్పుడు మాత్రం హడావుడి చేసే అధికారులు అవి జరగకుండా నిబంధనలు అమలుచేయడంలో నిర్లక్ష్యధోరణే అవలంబిస్తున్నారు. అగ్నిమాపక అధికారుల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) లేకుండా థియేటర్ నిర్వహించడానికి రెవెన్యూ అధికారులు అనుమతులు ఇవ్వకూడదు. కానీ ఈ నిబంధన ఎక్కడా సరిగా అమలుకావడం లేదన్న విమర్శలున్నాయి. అగ్నిప్రమాదాల నివారణకు పూర్తిస్థాయిలో అన్ని సౌకర్యాలు కల్పించి, నిర్ణీత ఫీజు చెల్లించి అగ్నిమాపక అధికారుల నుంచి థియేటర్ యాజమాన్యాలు ఎన్‌ఓసీలు తీసుకోవాల్సి ఉంది. అందుకోసం ఒక్కో థియేటర్‌కు ఏడాదికి రూ.10 వేలు చొప్పున మూడేళ్లకు రూ.30 వేలు ఎన్‌ఓసీ లెసైన్స్ ఫీజు కింద చెల్లించాలి. అయితే చాలా థియేటర్ల యజమానులు ఎన్‌ఓసీలు తీసుకోవడం లేదు. అయినా అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
 
 నిబంధనలు
 కేటగిరీ-1
  అగ్నిమాపక శకటం తిరిగేందుకు వీలుగా గేటు 4.5 మీటర్లు వెడల్పు, ఐదు మీటర్లు ఎత్తు ఉండాలి.
  థియేటర్ చుట్టూ వాహనం తిరిగేలా 4.5 మీటర్లు వెడల్పును వదిలి మిగిలిన స్థలంలో టికెట్టు కౌంటర్లు, క్యాంటీన్‌లు ఏర్పాటు చేసుకోవాలి.
 
  కరెంటు పోయినప్పుడు నాలుగు గంటలు బ్యాటరీపై పనిచేసేలా లైటు ఉండాలి.
  కరెంటు పోయినప్పుడు కూడా కనిపించే విధంగా ఎగ్జిట్ బోర్డ్సును రేడియం స్టిక్కరింగ్‌తో తయారుచేయించాలి.
 
  ప్రతీ ఆటకు లోపల శుభ్రం చేస్తూ ఉండాలి.
  అగ్నిప్రమాదాల నివారణలో సిబ్బందికి తగిన శిక్షణ ఇప్పించాలి.
  ఏదైనా ఆపద సంభవించినప్పుడు ముందుగా హెచ్చరించేందుకు మైక్ సిస్టమ్ ఏర్పాటుచేయాలి.
  అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు ఫైర్ ఎక్సింటగ్ విషర్స్, కొన్ని బకెట్లలో ఇసుక, మరి కొన్నింటిలో నీళ్లు ఉండాలి.
 
  మాన్యువల్ ఆపరేటర్ ఎలక్ట్రికల్ ఫైర్ అలారం వాడాలి.
  థియేటర్ పైకప్పుపై ఐదు వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన వాటర్ ట్యాంకు ఉండాలి. దానికి హోసరీస్ పైప్ అనుసంధానం చేసి ఉండాలి. 450 ఎల్‌పీఎం బూస్టర్ పంపు ఉండాలి.
  పునాది 200 చదరపు మీటర్లు దాటితే స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయాలి.
  అగ్నిమాపక శకటానికి అడ్డు లేకుండా జనరేటర్ అందరికీ కనిపించే విధంగా ఉండాలి.


 కేటగిరీ-2
  థియేటర్ పైకప్పుపై 10 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకు ఉండాలి.
 
 కేటగిరీ-3
  ప్రేక్షకులు కిందికి దిగేందుకు వీలుగా థియేటర్లలోని మొత్తం సిట్టింగ్‌ను 80తో విభజించగా వచ్చే సంఖ్యకు సమానంగా స్క్వేరు మీటర్లు వెడల్పు కలిగిన మెట్లు ఏర్పాటుచేయాలి. అలాగే బయట కూడా మెట్లు మార్గం ఏర్పాటుచేయాలి.
      కాంప్లెక్సులో ఎన్ని స్క్రీన్లు ఉంటే అన్ని ఐదు వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంకులను థియేటర్ పైకప్పుపై ఏర్పాటుచేయాలి. 900 ఎల్‌పీఎం సామర్థ్యం కలిగిన బూస్టర్ పంపును ఏర్పాటుచేయాలి.
 
 కేటగిరీ-4
  నిరంతరం నీళ్లతో ఉండే వెటరైజర్ సిస్టమ్‌కు అండర్ గ్రౌండ్ ట్యాంకు కనెక్ట్ అయి ఉండాలి.
  ఆటోమెటిక్ స్ప్రింక్లర్ సిస్టమ్, ఆటోమెటిక్ డిటెక్షన్ అలారం సిస్టమ్ ఏర్పాటుచేయాలి.
  35 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకు, ఎలక్ట్రిక్, డీజిల్‌తో నడిచే 2280 ఎల్‌పీఎం సామర్ధ్యం కలిగిన బూస్టర్ పంపు ఉండాలి. పైకప్పులో పది వేల లీటర్ల సామర్ధ్యం కలిగిన వాటర్ ట్యాంకు ఉండాలి. 450 ఎల్‌పీఎం సామర్ధ్యం కలిగిన బూస్టర్ పంపు, 180 ఎల్‌పీఎం సామర్థ్ధ్యం కలిగిన జాకీ పంపు ఉండాలి.
 కేటగిరీ-5, కేటగిరి-6  154 జీవో ప్రకారం అధనపు రక్షణ నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు.
 
 థియేటర్ల కేటగిరీలు
 177 జీవో మేరకు థియేటర్లను
 ఆరు కేటగిరీలుగా విభజించారు.
 కేటగిరీ - 1 : 10 మీటర్లు కన్నా తక్కువ ఎత్తు ఉండే గ్రామాల్లో థియేటర్లు
 కేటగిరీ - 2 : పది మీటర్లు కన్నా తక్కువ ఎత్తు ఉండే అర్బన్ ఏరియాల్లోని థియేటర్లు
 కేటగిరీ - 3 : ఒక కన్నా ఎక్కువ తెరలు ఉండే థియేటర్లు
 కేటగిరీ - 4 : 10 నుంచి 15 మీటర్ల మధ్య ఎత్తు ఉండే థియేటర్లు
 కేటగిరీ - 5 : 15 నుంచి 24 మీటర్ల మధ్య ఎత్తు ఉండే థియేటర్లు
 కేటగిరీ - 6 : మల్టీఫ్లెక్సులు
 
 ప్రమాద హేతువులు

 మల్టీఫ్లెక్సులు, ఏసీ థియేటర్లు, త్రీడీ, ఆడియో ఎఫెక్ట్‌ల కోసం ఏర్పాటు చేస్తున్న సామగ్రి, వాటి వైర్లు అగ్ని వాహకాలుగా ఉంటున్నాయి.
 
ఆడియో ఎఫెక్ట్ కోసం, ఏసీ ఎక్కువ సేపు ఉండేందుకు గోడలకు, పైకప్పునకు గడ్డి, ఫైబర్ మొదలైన వాటితో తయారుచేసిన మెటిరీయల్‌ను వినియోగిస్తున్నారు.
 
  కుర్చీలలో వినియోగించే స్పాంజి, ఫ్లోరింగ్‌కు మ్యాట్‌లు క్షణాల్లో మండిపోయేవిగా ఉంటున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement