నిద్ర ఒడి నుంచి మృత్యు కౌగిలికి | fire accidents in Rajahmundry | Sakshi
Sakshi News home page

నిద్ర ఒడి నుంచి మృత్యు కౌగిలికి

Published Wed, Mar 12 2014 1:20 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

నిద్ర ఒడి నుంచి మృత్యు కౌగిలికి - Sakshi

నిద్ర ఒడి నుంచి మృత్యు కౌగిలికి

విధి రాతకు బడుగు జీవులు బలైపోయారు. పగలంతా కష్టించి వచ్చి ఆదమరిచి తమ పూరి పాకలో నిద్రిస్తున్న వారిని హఠాత్తుగా మంటలు చుట్టుముట్టాయి. నిద్ర మత్తు వీడి చుట్టూ చూస్తే.. కళ్లు కనిపించనంతగా కమ్ముకున్న దట్టమైన పొగ.. ఎటువైపు వెళితే తమ ప్రాణాలు కాపాడుకోవచ్చో తెలియనంత ఉక్కిరిబిక్కిరి. కాలుతున్న పైకప్పు రూపంలో మృత్యువు క్రూరంగా కోరలు చాచి  తమ వైపు వస్తుంటే బిగ్గరగా కేకలు వేస్తూ భయంతో ఒకరినొకరు హత్తుకొని ఆ అయిదుగురు కుటుంబ సభ్యులు సజీవ దహనమైపోయారు. మంటలు తమ శరీరాలను నిలువునా దహించి వేస్తుండగా నిస్సహయంగా వారు చేసిన ఆర్తనాదాలు అగ్నికీలల ఊళలలో కలసిపోయాయి.
 
 ధవళేశ్వరం/రాజమండ్రిరూరల్, న్యూస్‌లైన్ :ధవళేశ్వరం కొత్తపేటలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో తాటాకింట్లో నిద్రపోతున్న ఐదుగురు ఒకేసారి సజీవ దహనమయ్యారు. తట్టా ముత్యాలరావు భార్య  తట్టా మార్తమ్మ (48), చిన్న కుమార్తె  తట్టా శ్రీలక్ష్మి (20), పెద్ద కుమార్తె బీర వసంతకుమారి (28), మనుమరాళ్లు బీర గ్రేస్ (10), బీర శ్రావణి (8)లు దుర్మరణం పాలయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన అయిదేళ్ల చిన్నారి తట్టా సునంద్‌ను ముత్యాలరావు పెంచుకుంటున్నాడు. ప్రమాదం నుంచి సునంద్ అదృష్టవశాత్తు బయటపడ్డాడు. వీరిలో వసంతకుమారికి భర్తతో మనస్పర్ధలు రావడంతో మూడునెలలుగా తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. తల్లి మార్తమ్మతోపాటు కుమార్తెలిద్దరూ సమీపంలోని ఫ్యాక్టరీల్లో రోజుకూలి పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నారు.
 
 చిన్నారుల్లో పెద్దమ్మాయి నాల్గవ తరగతి, చిన్నమ్మాయి మూడో తరగతి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఎప్పుడూ బయటపడుకునే వీరు కొడుకు అత్తారింటికి వెళ్లడంతో ఒకే గదిలో నిద్రించారు. అదే వీరి పాలిట మృత్యువైంది. ఎండావానల నుంచి రక్షించుకునేందుకు పటిష్టమైన గూడును కూడా ఏర్పరచుకోలేని స్థితిలో ఉన్న వారు తాటాకుపాకపై రక్షణగా ఉంటుందని పాత ఫ్లెక్సీలను పాకపై కప్పుకున్నారు. కానీ క్షణాల్లో మంటలు వ్యాపించేందుకు అదే కారణమవుతుందని వారు ఊహించలేకపోయారు. పాకలో ఒకమూల ఏర్పడిన మంట క్షణాల వ్యవధిలో ఇల్లంతా వ్యాపించడంతో వారు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. 
 
 అగ్నికీలలు చూసి భయపడిన ఐదుగురూ గదిలో ఒకే చోటుకు చేరుకుని ఒకరికొకరు ధైర్యం చెప్పుకునేందుకు ప్రయత్నించినట్టు అక్కడి పరిస్థితిని బట్టి తెలుస్తోంది. ఒకరినొకరు గట్టిగా పట్టుకుని అక్కడికక్కడే మృతిచెందిపడి ఉండడం చూసిన వారిని కలిచి వేసింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి శిధిలాలు తొలగిస్తుండగా ఐదు శరీరాలు ఒకే ముద్దగా బయటపడడంతో అక్కడున్నవారంతా  కన్నీరుమున్నీరయ్యారు. అతి ఇరుకుగా ఉన్న ఆ గదిలో ఆరుగురు నిద్రకు ఉపక్రమించారు. పక్కపోర్షన్‌లో ఉంటున్న వ్యక్తి మంటలు రాజుకోవడం గమనించి ఈ గదివద్దకు వచ్చి వీరిలో సునంద్‌ను రక్షించగలిగాడు. మిగిలిన వారిని రక్షించే ప్రయత్నాల్లో ఉండగా పైకప్పు కూలి ఐదుగురూ అందులో చిక్కుకుపోయి, ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు వదలడం చూసిన తట్టా రాజేష్ ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కళ్ళెదుటే చనిపోతున్నా కాపాడలేకపోయామని విలపిస్తున్నాడు. ఇంటిలో నిద్రిస్తున్న తనకు మంటలను చూసి పై నుంచి ఎర్రపువ్వులు పడుతున్నాయేమో అనుకుని దుప్పటి కప్పుకుని పడుకున్నానని, తీరా చూస్తే మంట వేడి తగలడంతో గుమ్మం దగ్గరకు వచ్చి నిలుచుంటే తనను బయటకు లాగారని రోదిస్తూ చెప్పాడు సునంద్.
 
 సర్వం బూడిదైపోయింది..
 తట్టా ముత్యాలరావు, తట్టా రాజేష్‌లకు చెందిన ఈ రెండు పోర్షన్ల తాటాకిల్లు అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైపోయింది. ముత్యాలరావు కుటుంబీకులు ఐదుగురూ సజీవ దహనమైపోయారు. రాజేష్ భార్యాపిల్లలు ప్రమాదం నుంచి బయట పడినప్పటికీ ఇల్లు మొత్తం దహనమైపోవడంతో సుమారు రెండు లక్షల రూపాయల మేర ఆస్థినష్టం సంభవించింది.
 
 అధికారుల సందర్శన
 కాగా సంఘటన స్థలాన్ని అర్బన్ జిల్లా ఎస్పీ టి. రవికుమార్‌మూర్తి, అదనపు జాయింట్ కలెక్టర్ మార్కండేయులు, రాజమండ్రి ఆర్డీవో వర్ధనపు నాన్‌రాజ్, డీఎస్పీ ఎన్. అశోక్‌కుమార్, రూరల్ తహశీల్దార్ యంసీహెచ్ నాగేశ్వరరావు, సీఐ శివాజీరాజులు సందర్శించారు.
 
 అగ్గి ఎలా రాజుకుందో?
 ఐదుగురు సజీవదహనం కావడానికి కారణమైన మంటలు ఏర్పడడానికి కారణమేంటన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు పోర్షన్ల ఇల్లు అయినప్పటికీ ఆరుగురు పడుకున్నది చిన్నగది. అందులో గుమ్మం వద్దనే ఉన్న బాలుడిని మాత్రమే రక్షించగలిగారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులున్నారు. మిగిలిన ముగ్గురు మహిళల్లోనూ మార్తమ్మకు  48 ఏళ్లు. వసంతకుమారి, శ్రీలక్ష్మిలు 30 ఏళ్లలోపు వారే. అయినా తప్పించుకోలేకపోయారు. మంటలు వీళ్ళున్న పోర్షలోనే మొదలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఒకే గుమ్మం నుంచి బయటకు రావాల్సి ఉంది. ఒకేసారి పాక పైభాగం కిందికి పడిపోవడం, పొగ పూర్తిగా కమ్మేయడంతో దారి కన్పించకే ఐదుగురూ అందులో చిక్కుకుని చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మంటలు రేగడానికి మాత్రం కారణం తెలియరాలేదు. కుటుంబ సభ్యులను కోల్పోయి ముత్యాలరావు, చిన్నా, బంధువులు రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది. 
 
 బాధితులకు పలువురి పరామర్శ
 అగ్ని ప్రమాదం కారణంగా కుటుంబ సభ్యులను కోల్పోయిన ముత్యాలరావును పలువురు మంగళవారం పరామర్శించారు. వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రమాద విషయం తెలిసిన వెంటనే అర్ధరాత్రి రెండుగంటలకే అక్కడికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు. స్థానిక నేతలు తలారి వరప్రసాద్, దేవదాసి రాంబాబు, తలారి మూర్తి, చాటకాల చంటి తదితరులతో కలిసి బాధితులకు ఏ విధంగా న్యాయం జరగాలన్నదానిపై చర్చించి, అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ పరంగా సాయమందించి ఆదుకోవాలని ఆర్డీవోను విజయలక్ష్మి కోరారు. జిల్లా కలెక్టర్ నీతూ కుమారిప్రసాద్‌తో మాట్లాడి తక్షణ సాయంగా రూ. 40వేల నగదును ఆర్డీవో అందించారు. వైఎస్సార్ సీపీ రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు తనయుడు ఆకుల బాపిరాజు, ఎమ్మెల్సీ బలశాలి ఇందిర, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ బాధితులను పరామర్శించి రూ. 5వేల వంతున అందజేశారు. జైసమైక్యాంధ్ర పార్టీ నాయకులు, ఎంపీలు ఉండవల్లి అరుణ్‌కుమార్, జీవీ హర్షకుమార్,  బాధితులను పరామర్శించారు. ఆ పార్టీ తరఫున రూ. రెండు లక్షలు అందజేస్తామని ఎమ్మెల్సీ ఇందిర తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement