ఏపీ సెక్రటేరియట్ లో కలకలం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో ఫైర్ అలారం మోగడంతో ఉద్యోగులు భయభ్రాంతులకు గురయ్యారు. వెలగపూడిలోని సెక్రటేరియట్ మూడో బ్లాకులో సోమవారం అకస్మాత్తుగా అలారం మోత వినిపించడంతో కలకలం రేగింది. ఏం జరుగుతుందో తెలియక ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక కారణాలతోనే క్యాంటీన్ లోని ఫైర్ అలారం మోగినట్టు గుర్తించారు. సాంకేతిక సమస్యను సరిచేసి అలారం మోతను ఆపారు.
ఏపీ సచివాలయంలో భద్రత డొల్ల అని ఇంతకుముందు జరిగిన ఘటనలు రుజువు చేశాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల కొలువుండే సచివాలయంలో ఎలాంటి అనుమతులు లేకుండానే.. ఓ సామాన్య పౌరుడు యథేచ్ఛగా లోపలకు వచ్చి, గుర్రంస్వారీ చేసిన ఘటన గత నెలలో చోటుచేసుకుంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విధులు నిర్వర్తించే బ్లాక్ లోకే నీళ్లు రావడం కూడా గత నెలలో చర్చనీయాశంమైంది. ఇలా రోజుకొకటి బయటపడుతుండడంతో సచివాలయ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.