సాక్షి, గ్వాలియర్ : ఢిల్లీ నుంచి విశాఖపట్నం వస్తున్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రెండు ఏసీ బోగీలు (బీ6, బీ7) పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో రెండు బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సోమవారం ఉదయం 11.55 గంటల సమయంలో గ్వాలియర్ సమీపంలోని బిర్లానగర్ రైల్వేస్టేషన్ వద్ద బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేశారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. కాగా ఈ ప్రమాదం నుంచి 36 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులు సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. ప్రయాణికులు సామాగ్రి మాత్రం మంటల్లో కాలిపోయింది.
హైటెన్షన్ విద్యుత్ తీగలు పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న రైల్వే సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా, లోకో పైలట్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పిందని, ఫైరింజన్లతో మంటలను ఆర్పివేసినట్లు రైల్వే పీఆర్‌వో మనోజ్ కుమార్ తెలిపారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. మంటలు అంటుకున్న రెండు బోగీల్లో వైజాగ్‌కు చెందిన 65 మంది ప్రయాణికులు ఉన్నారు.
మరోవైపు ఈ ప్రమాదం జరగడంతో ఆ మార్గంలో నడిచే రైల్వే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అధికారుల తీరుపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రైల్వే శాఖ విడుదల చేసిన అత్యవసర ఫోన్ నంబర్లు: 1322, 1800111189
విశాఖలో హెల్ప్‌లైన్ నంబర్లు: 08912883003, 08912883004, 08912746330, 08912746344
గ్వాలియర్‌లో హెల్ప్‌లైన్ నంబర్లు: 0751-2432799, 0751-2432849
ఝాన్సీలో హెల్ప్‌లైన్ నంబర్లు: 0510- 2440787, 0510- 2440790
Comments
Please login to add a commentAdd a comment