ఏపీ ఎక్స్‌ప్రెస్ బోగిలో అగ్ని ప్రమాదం జరిగిన దృశ్యం
సాక్షి, సిటీబ్యూరో : ఏపీఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ప్రమాదం పగటి పూట సంభవించడంతో పెను ముప్పు తప్పింది. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండే సమయంలో ఈ ఘటన జరిగి ఉంటే మరో తమిళనాడు ఎక్స్‌ప్రెస్, గౌతమి ఎక్స్‌ప్రెస్ దారుణాలను తలపించి ఉండేది. గ్వాలియర్ సమీం లోని బిర్లా స్టేషన్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో రెండు ఏసీ బోగీలు దగ్ధమైన సంఘటన రైల్వే శాఖ డొల్లతనాన్ని, భద్రతా వైఫల్యాన్ని మరోసారి బట్టబయలు చేసింది. కేవలం పగటి వేళ కావడంతో ప్రయాణికులు అప్రమత్తంగా ఉన్నందున సురక్షితంగా బయటపడగలిగారు.
పేలుడు పదార్ధాలు, విద్యు త్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ ముప్పును ముందే పసిగట్టి నివారించడంలో రైల్వేశాఖ విఫలమవుతోంది. ఈ క్రమంలో వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. గతంలో మహబూబ్‌బాద్ జిల్లా, కేసముద్రం వద్ద గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో డీజిల్ సరఫరా చేస్తుండగా మంటలంటుకొని సుమారు 70 మంది మృత్యువాతపడ్డారు. ఆ ఉదంతాన్ని ప్రజలు ఇంకా మరిచిపోకముందే మూడేళ్ల క్రితం నెల్లూరు వద్ద తెల్లవారు జామున తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో సంభవించిన పేలుడు కారణంగా 30 మందికి పైగా చనిపోయారు. మరోవైపు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తరచుగా బోగీలు కాలిపోతున్నా రైల్వే యంత్రాంగం మొద్దు నిద్రను వీడడం లేదు.
బెంబేలెత్తిస్తున్న వరుస సంఘటనలు....
తమిళనాడు ఎక్స్‌ప్రెస్ దుర్ఘటనకు ముందు నగరంలోని ఫలక్‌నుమా రైల్వేస్టేషషన్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా డెమూ ప్యాసింజర్ రైలుకు చెందిన 3 బోగీలు దగ్ధమయ్యాయి. అంతకు కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్ యార్డ్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ బోగీకి నిప్పంటుకోవడంతో దగ్ధమైంది. 2013లో నాంపల్లి రైల్వేస్టేషషన్ వద్ద నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక బోగీ కాలిపోయింది. 2007లో సికింద్రాబాద్ నుంచి నాంపల్లి స్టేషన్‌కు వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌సర్క్యూట్ కారణంగా రెండు బోగీలు కాలిపోయాయి. నగరంలో జరిగిన ఈ ప్రమాదాల్లో అదృష్టవశాత్తు ప్రయాణికులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే ఈ అన్ని దుర్ఘటనల్లోనూ విద్యుత్ సరఫరాలో సాంకేతిక లోపాలే ప్రధాన కారణమని రైల్వే భద్రతా కమిషన్ తేల్చిచెప్పింది. మరోవైపు గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో డీజిల్ వంటి పేలుడు పదార్ధాల సరఫరా కూడా కారణమని నిర్ధారించారు.
ప్రమాదాలు జరిగినప్పుడు భద్రతా కమిటీలు కారణాలపై నివేదికలు సమర్పిస్తున్నాయి. మానవ తప్పిదాల్లో చట్టపరమైన చర్యలు తీసుకుంటున్న అధికారులు బాధ్యులను విధుల నుంచి తప్పిస్తున్నారు. అయితే ముప్పును ముందస్తుగా గుర్తించి చర్యలు తీసుకోవడంలో మాత్రం రైల్వే యంత్రాంగం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేకపోతోంది. అతి కీలకమైన విభాగాల్లో సిబ్బంది కొరత, నైపుణ్యం లేని కాంట్రాక్ట్ వర్కర్లు, ఎలక్ట్రికల్ విభాగంలోనూ నైపుణ్యత లోపించడం తదితర అంశాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. రైళ్లలో తగినంత మంది భద్రతా సిబ్బంది లేకపోవడంతో తేలిగ్గా పేలుడు పదార్ధాల రవాణా జరుగుతోంది. తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్–11 బోగీలో పేలుడు పదార్థాల కారణంగానే పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నట్లు గుర్తించారు.
నిపుణుల కొరత...
సాధారణంగా రైళ్లు బయలుదేరడానికి ముందు 6 గంటల పాటు పిట్‌లైన్‌లో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. వివిధ అంశాలపై పూర్తిగా తనిఖీ చేసిన అనంతరం ట్రైన్ ఎగ్జామినేషన్ డిపార్ట్‌మెంట్ (టిఎక్స్‌ఆర్) బ్రేక్ పవర్ సర్టిఫికెట్‌ను అందజేస్తుంది. ఈ సర్టిఫికెట్ పొందిన అనంతరమే రైలు బయలుదేరాలి. అయితే అటు పిట్‌లైన్‌లలోనూ, ఇటు స్టేషన్‌న్లలోనూ సిబ్బంది కొరత కారణంగా నాణ్యత లోపిస్తోంది. పిట్‌లైన్‌లో ఒక రైలును 16 మంది ఎలక్ట్రికల్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తనిఖీ చేయాల్సి ఉండగా కేవలం 5 నుంచి 6 గురు మాత్రమే చేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఎలాంటి నైపుణ్యం, కనీస విద్యార్హతలు లేని వారిని కాంట్రాక్ట్ సిబ్బందిగా నియమించి ఏసీ బోగీల నిర్వహణ వంటి కీలకమైన విధులను అప్పగించడం కూడా షార్ట్‌సర్క్యూట్‌లకు కారణమవుతున్నట్లు సమాచాఉరం.
విడిభాగాలూ కరువే ...
రైళ్ల మరమ్మతులకు అవసరమైన నట్లు, బోల్టుల నుంచి కీలకమైన విడిభాగాలు సైతం కరువయ్యాయి. దీంతో విశ్రాంతిలో ఉన్న రైలు విడిభాగాలను తీసి రన్నింగ్ ట్రైన్‌కు బిగిస్తున్నారు. రైలును ఆపడంలో కీలకమైన బ్రేక్‌బ్లాక్స్ ఒక్కొక్క బోగీకి 16 చొప్పున అవసరమవుతాయి. అయితే వీటి కొరత తీవ్రంగా ఉండటంతో ఆగి ఉన్న మరో రైలు బ్రేక్‌బ్లాక్స్‌ను తొలగించి ఉపయోగిస్తున్నారు. ఇవి కూడా చాలా వరకు అరిగిపోయి ఉండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. షాక్‌అబ్జర్వర్లకు కొరత ఉందని, కోచ్‌ల మధ్య డాష్‌పాట్స్‌కు, కాంపోజిట్ రింగ్‌లకు నడుమ బిగించే కీలకమైన బఫర్‌ప్యాడ్స్ కూడా సరఫరా చేయడం లేదని మెకానికల్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. రాత్రి వేళల్లో రైళ్లను తనిఖీ చేసేందుకు అవసరమైన హెడ్‌లైట్లు కూడా తగినన్ని లేకపోవడం వల్ల చీకట్లోనే తనిఖీలు నిర్వహించవలసి వస్తోందన్నారు.
బోగీల్లో సీసీ కెమెరాలు అవసరం...
ఇలాంటి ఘోర ప్రమాదాలు తరచూ జరుగుతున్నా రైల్వే అధికారులు గుణపాఠం నేర్వడం లేదు. ప్రతి 2 బోగీలకు ఒక టిటిఈ ఉండాల్సి ఉండగా సిబ్బంది కొరత కారణంగా ఒక టిటిఈ 4 బోగీలను పర్యవేక్షించవలసి వస్తోంది. ఈ పరిస్థితుల్లో బోగీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే కొంతవరకు నిఘా లోపాన్ని అధిగమించేందుకు అవకాశం ఉండేది. రైళ్లలో టీ, కాఫీ విక్రయించే వారు యధేచ్ఛగా బోగీల్లో హీటర్‌లను వినియోగిస్తున్నా రైల్వే భద్రతా సిబ్బంది వారిని నియంత్రించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment