
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు
అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లుపై ముందుగా ఓటింగ్ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే సమైక్య తీర్మానం చేసేంత వరకు సభా కార్యక్రమాలను అడ్డుకుంటామని వారు స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత టీడీపీ నేతలకు లేదని వారు పేర్కొన్నారు. తమ నాయకుడిని విమర్శించడమే పనిగా పెట్టుకుని సభ సమయాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు.
అలా కాకుండా టీడీపీ నేతలు ప్రజా సమస్యలపై దృష్టి పెడితే మంచిదని హితవు పలికారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన అవినీతిపై కేసులు నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్తో కుమ్మక్కైందని చంద్రబాబు కాదా అని శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. విభజనపై అసెంబ్లీలో చర్చ వెనుక పెద్ద కుట్ర ఉందని వారు అనుమానిస్తున్నట్లు చెప్పారు. ఆ కుట్రలో కాంగ్రెస్, టీడీపీలకు భాగస్వామ్యం ఉందని శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు.