
పాణాలతో వత్తామనుకోనేదు..
వేటకు వెళ్తేకాని వారికి పూటగడవదు...
‘తిండీ తిప్పల్నేవు.. తాగేందుకు గుక్కెడు నీళ్లు నేవు.. కంటిమీద కునుకు నేదు.. ఏకంగా ఆరు రోజులు పగలు రాత్రి బిక్కు బిక్కుమంటూ నడిసంద్రంలో గడిపాం. అలల ఉధృతికి ఎటు పోతన్నామో తెలవనేదు. పెళ్లాం.. పిల్లల్ని మళ్లీ చూసుకుంటామన్న నమ్మకం నేదు. అసలు పాణాలతో బయటపడతామని కలలో కూడా ఊహించనేదు..’ ఇది సోమవారం తీరానికి చేరుకున్న గంగపుత్రుల ఆవేదన.
- తిండీ లేదు.. తాగటానికి నీళ్లూ లేవు
- భార్యా బిడ్డలను చూస్తామనుకోలేదు
- ఎలా బతికామో ఆ దేవుడుకే తెలియాలి
- తీరానికి చేరుకున్న విశాఖ, తూర్పుగోదావరి మత్స్యకారులు
సాక్షి, విశాఖపట్నం: వేటకు వెళ్తేకాని వారికి పూటగడవదు. సముద్రంతో సహజీవనం చేస్తుంటారు. అలలతో పోరాటం చేస్తారు. కానీ ఏ అల వచ్చి కాటేస్తోందో..ఏ మృత్యుకెరటానికి బలవుతామో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిందే. వేటకెళ్లే మగవారు ఇంటికి చేరుకునే వరకు ఇంటిల్లిపాది కళ్లల్లో వత్తు లేసుకుని ఎదు రు చూడాల్సిందే.. ఇదీ గంగపుత్రుల జీవనం. గతేడాది హుద్‌హుద్ చేదుజ్ఞాపకాలు ఇంకా కళ్లెదుటనుంచి దూరం కాకుండానే ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగండం వారిని వణికించింది.
తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలకు చెందిన మత్స్యకారులు వేటకు వెళ్లి నడిసంద్రంలో చిక్కుకున్నారు. ఆరు రోజుల పాటు నరకం చూశారు. ఇంజిన్లు చెడిపోయాయి. సెల్‌ఫోన్లు, వైర్‌లెస్ సెట్లు మూగబోయాయి. వలలు గాలి వాటానికి కొట్టుకుపోయాయి.తెచ్చుకున్న వంట సామాగ్రి, బియ్యం, నిత్యావసరాలతో పాటు చివరకు మంచినీళ్లు కూడా సముద్రం పాలయ్యాయి. బోటు ఎటు వెళ్తుందో.. తామెక్కడ ఉన్నామో కూడా తెలియని పరిస్థితి. పగటి పూట ఎలా గడిపినా చీకటి పడితే ఏం జరుగుతుందో తెలియక క్షణమొక యుగంగా గడిపారు. నడిసంద్రంలో చుక్కాని లేని నావలా గడిపిన ఆ గంగపుత్రులు బతుకు జీవుడా అంటూ ఒడ్డుకు చేరుకున్నారు.
విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పది బోట్లు సోమవారం తీరానికి చేరుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా సుబ్బంపేట, హుకుంపేట, ఎస్.పెరుమాళ్లపురానికిచెందిన 59మంది విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చేరుకోగా,జిల్లా ఎస్.రాయవరానికి చెందిన మైలపల్లి కాశీరావు, మైలపల్లి కోటయ్యలు విజయనగరం జిల్లా చింతపల్లి రేవు వద్ద తీరానికి చేరుకున్నారు. పెరుమాళ్లపురానికి చెందిన బోట్‌నెంబర్ 424లో ఎం.జగ్గారావు, గంటా దేవుడు, ఎం.కుమారస్వామి, మైలపల్లి భూషిత్, మేరుగు రమణ, మేరుగు ఎల్లారి, బోటు నెంబర్ 1448లో సీహెచ్ కాశీరావు, పి.గోపి, ఎం.శ్రీను, సీహెచ్ చల్లారావు, జి.మాణిక్యం, టి.మాణిక్యంలతో పాటు ఉప్పాడ మండలం సుబ్బంపేటకు చెందిన బోట్ నెంబర్ 9320లో చొక్కా ఎల్లయ్య, సూరాడి తాతబాబు, సూరాడ గోవిందు, సూరాడదుర్గ, మైలపల్లి యోహాను, కుప్పరి నాగేశ్వరరావు, గరికిన గంగ రాజులు సురక్షితంగా సోమవారం తీరానికి చేరుకున్నారు. విశాఖ మత్స్యశాఖ ఏడీ కోటేశ్వరరావు వీరు స్వగ్రామాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.