తెలతెలవారక ముందే హైలెస్సా..హైసెల్సా అంటూ బతుకుదెరువు కోసం కడలి కెరటాలపై సవారీ చేసే వారిని ఆ కెరటాలే కాటేశాయి. సముద్రంలో వేటకెళ్లిన వారి పడవ బోల్తా పడటంతో నలుగురి ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. పెళ్లయిన ఏడాదికే భర్త కళ్లెదుటే నీటమునిగి తనువు చాలించిన వారొకరైతే...అన్నకు చేదోడుగా ఉంటున్న చెల్లెలు... భర్త చనిపోవడంతో ముగ్గురు పిల్లల పోషణ కోసం పడవెక్కిన మరో మహిళ.. భర్తతో కలిసి వేటకొచ్చిన వృద్ధురాలు నీటమునిగి ఊపిరాడక కన్నుమూశారు. ఊరికి చెందిన నలుగురు ఒకేసారి మృత్యువాతపడటంతో వేటపాలెం మండలంలోని మత్స్యకార పల్లె రామచంద్రాపురం శోకసంద్రమైంది.
చీరాల, వేటపాలెం, న్యూస్‌లైన్:
విధి వారి జీవితాలపై విషం చిమ్మింది. పట్టెడన్నం పెట్టే గంగమ్మకు ఆగ్రహం వచ్చింది. రోజూ కెరటాలపై ఆడుతూ పాడుతూ ఉండే వారి పాలిట అవే మృత్యుపాశాలయ్యాయి. నాగులుప్పలపాడు మండలం గుండమాల సముద్ర తీరంలో గురువారం ఉదయం జరిగిన పడవ ప్రమాదంలో వేటపాలెం మండలం రామచంద్రాపురానికి చెందిన నలుగురు మత్య్సకార మహిళలు మృతిచెందారు. మృతుల కుటుంబాలది రోజూ వేటకెళితేనే పూటగడిచే పరిస్థితి. కుటుంబ సభ్యులకు చేదోడువాదోడుగా ఉందామని ధైర్యంగా సముద్రంపై వేటకు వెళ్లిన కోడూరి ముత్యాలమ్మ(35),కాటం పోలమ్మ(50), చిన్నంగారి పోలమ్మ (22), కుమారి నాగమ్మ(18) ఆటుపోటు సమయంలో ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటాలకు బలైపోయారు. మృతుల కుటుంబాలది
ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ...భర్త కళ్లెదుటే...
ప్రమాదంలో మృతి చెందిన చిన్నంగారి పోలమ్మకు పెళ్లయి ఏడాదయింది. భార్యాభర్తలు కలిసి చేపల వేటకు వెళ్లారు. పడవ బోల్తా పడటంతో పోలమ్మ సముద్రపు నీటిలో మునిగిపోయింది. తన కళ్లెదుటే భార్య నీటిలో మునిగిపోవడంతో జాలయ్య తట్టుకోలేకపోతున్నాడు. పెళ్లయిన ఏడాదికే భార్యను పోగొట్టుకున్నానని కన్నీరుమున్నీరవుతున్నాడు.
కుటుంబంలో మిగిలింది ఒక్కరే...
ఐదేళ్ల కిందట కుమారి నాగమ్మ తల్లిదండ్రులు మృతిచెందారు. అన్నయ్య శివతో కలిసి బతుకుదెరువు కోసం చిన్న అమ్మమ్మ గ్రామమైన రామచంద్రాపురానికి వచ్చి ఉంటున్నారు. అన్నాచెల్లెళ్లిద్దరూ సముద్రంలో వేటసాగిస్తూ పొట్టపోసుకుంటున్నారు. పడవ ప్రమాదంలో నాగమ్మ మృతిచెందడంతో ఆ కుటుంబంలో శివ ఒంటరివాడయ్యాడు.
అనాథలైన ముగ్గురు పిల్లలు..
కోడూరి ముత్యాలమ్మకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. భర్త మూడేళ్ల కిందట మృతిచెందాడు. అప్పటి నుంచి ఆమె చేపల వేట ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటోంది. తన కుమారుడిని తీసుకుని రోజూ సముద్రంలో చేపల వేటకు వెళ్తుంటుంది. పడవ ప్రమాదంలో ముత్యాలమ్మ మృతిచెందడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. తండ్రి లేకున్నా..తమకు అండగా ఉన్న తల్లి చనిపోవడంతో ఆ పిల్లలు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
చేపల వేటపైనే జీవనం...
కాటం పోలమ్మ... 50 ఏళ్ల వయసుపై బడినా సముద్రంపై వేట ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తోంది. ఏడుగురు పిల్లలకు పెళ్లిళ్లు చేసింది. భర్త పోలయ్యతో కలసి చిన్న కుమారుడి వద్ద ఉంటోంది. భర్తతో కలసి చేపల వేటకు వెళ్లి పడవ ప్రమాదంలో మృత్యువాత పడింది. పోలమ్మ మృతితో భర్తకు చేదోడు కరువైంది.
శోక సంద్రం
Published Fri, Mar 7 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 4:25 AM
Advertisement