న్యూస్‌లైన్ నెట్‌వర్క్, విశాఖ జిల్లా : సీమాంధ్ర ప్రాంత ప్రజల హృదయాల్లో ప్రతిధ్వనిస్తున్న సమైక్య నినాదం కడలి కెరటంలా వాడవాడలా ఘోషించింది. పల్లెలు, పట్టణాలన్న తేడాలేకుండా జిల్లా నలుదిశలా మార్మోగింది. చిరుపల్లె నుంచి మహానగరం వరకు ఎటు చూసినా ఉద్యమ దీక్ష ప్రతిఫలించింది. విభజనను సమ్మతించేది లేదని ప్రతి గ్రామం గర్జించింది. ఊరూరా ఎగసిన ఆందోళన జ్వాలలతో వాతావరణం వేడెక్కింది. సకల జనుల సమ్మె ఉధృ తం కాగా, ప్రజలు స్వచ్ఛందంగా నిర్వహించి న బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది.
ఉప్పొంగిన ఉద్యమం
అనకాపల్లి: గ్రామీణ జిల్లాకు ప్రధాన కేంద్రమైన అనకాపల్లిలో బంద్ సంపూర్ణంగా జరిగిం ది. ఇంతవరకు స్వచ్చంద సంస్థలు, రాజకీయ పక్షాలు మాత్రమే పాల్గొన్న ఈ ఉద్యమంలోకి అన్ని యూనియన్లు, పాఠశాలలు, బెల్లం వర్తకులు, గ్రామాలు భాగస్వామ్యులు కావడంతో ఉద్యమం వేడెక్కింది. బవులవాడ పంచాయతీలో సమైక్యవాది ఆత్మహత్యకు పాల్పడ్డగా, అనకాపల్లి-గాజువాక రహదారిలో ఉన్న సిరసపల్లిలో కొద్దిపాటి గొడవ జరిగింది. తాజాగా ఎన్‌జివోల సమ్మె తోడవ్వడంతో మంగళవారం ఎన్నడూలేని రీతిలో బంద్ వాతావరణం తీవ్ర స్థాయిలో కనిపించింది. సమైక్య ఉద్యమకారులు ప్రైవేటు బ్యాంకులను, ఇతర వాణిజ్యసంస్థలను కూడా మూసి వేయించడంతో పట్టణం ఒక్కసారిగా వెలవెలబోయింది. దీనికి పెట్రోల్ బంకుల బంద్ తోడవడంతో ఉద్యమం హోరెత్తింది.
అపూర్వ స్పందన : మన్యానికి, మైదానానికి వారధిగా ఉన్న నర్సీపట్నంలో బంద్ ఉధృతంగా సాగింది. ప్రజలే ముందుకు వచ్చి ఉద్యమాన్ని నడిపించడంతో బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది. నర్సీపట్నం డివిజన్‌లో 4500 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో కార్యాలయాలలో స్తబ్దత నెలకొంది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బంద్ ప్రభావం కనిపించింది. ప్రజలే తమంత తాముగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టడంతో అన్ని ప్రాంతాల్లో వాతావరణం ఉత్కంఠభరితంగా కనిపించింది. నర్సీపట్నంలో ఎమ్మెల్యే ముత్యాలపాప నిరాహారదీక్షా శిబిరం వద్దకు వచ్చి ఆందోళనకారులకు సంఘీభావం తెలుపగా, అక్కడే ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు, కాంగ్రెస్ మద్దతుదారులకు మధ్య స్వల్ప వివాదం తలెత్తింది.
రాస్తారోకోలు.. నిరసనలు
చోడవరం: సకల జనుల సమ్మె మంగళవారం చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో సంపూర్ణంగా ప్రశాంతంగా జరిగింది. ఆందోళనకారులు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తూ రాష్ట్ర సమైక్యంగా ఉండాలంటూ బంద్ పాటించారు. అన్ని ప్రాంతాల నుంచి రాకపోకలను నిలిపివేయడంతో పాటు ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. చోడవరంలో ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజును విద్యార్థులు, సమైక్యాంధ్ర జెఎసీ ప్రతినిధులు రాజీనామా చేయాలంటూ నిలదీశారు. నర్సయ్యపేటలో రైతులు ఎడ్లబళ్లతో రాస్తారోకో చేశారు. మాడుగుల నియోజకవర్గంలో రోడ్లపైనే వంటావార్పు నిర్వహించి సహపంక్తి భోజనాలు చేశారు. గోవాడలో సుగర్‌ఫ్యాక్టరీ కార్మికులు చేపట్టిన దీక్షలు రెండో రోజు కూడా నిర్వహించారు.
దీక్షాధారులు ఆస్పత్రికి తరలింపు
యలమంచిలి: సమైక్యాంద్రకు మద్దతుగా యలమంచిలి నియోజకవర్గంలో బంద్, నిరసన కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. గత 6రోజులుగా యలమంచిలి పట్టణంలో ఆమరణనిరాహారదీక్ష చేస్తున్న కొఠారు సాంబ శివరావు, నక్కా వెంకటరమణల ఆరోగ్యం క్షీణించడంతో ఉద్రిక్తత మధ్య వారిని పోలీసు లు ఆస్పత్రికి తరలించారు. గొల్లవిల్లి అప్పారావు అనే నిరసనకారుడు శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడబోగా పోలీసు లు అడ్డుకున్నారు. అచ్యుతాపురం జంక్షన్‌లో గుర్రాలతో కేసిఆర్ దిష్టిబొమ్మను తొక్కించారు.
మన్యంలో సంపూర్ణం
అరకులోయ: విభజనకు వ్యతిరేకంగా ప్రారంభమైన నిరవధిక సమ్మె కారణంగా ఉద్యమం తీవ్ర స్థాయికి చేరింది. ఈ సందర్భంగా నిర్వహించిన బంద్ సంపూర్ణంగా జరిగింది. మండ ల కేంద్రంలో వర్తకులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేశారు. ప్రభుత్వ కార్యాలయాలన్ని మూతబడ్డాయి. ఎన్‌జీవో సంఘాల ప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించారు. యువకులు రోడ్లపై ఆటలాడారు. సాయంత్రం అరకులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బంద్ సందర్భంగా ఒక్క పర్యాటకుడు కూడా అరకులోయకు రాలేదు. మ్యూజియం, పద్మావతి గార్డెన్‌లు మూతబడ్డాయి. అరకు ప్రధాన రహదారిలో వంట వార్పు నిర్వహించి నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో జనం ఇబ్బంది పడ్డారు.
పాడేరులో పాలన స్తంభన
పాడేరు : పాడేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలు స్తంభించాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. డివిజన్ కేంద్రమైన పాడేరులో ఐటీడీఏ, సబ్‌కలెక్టర్ కార్యాలయాలతోపాటు పలు ప్రభుత్వ శాఖల కార్యాలయా లు నిశ్శబ్ధంగా కనిపించాయి. అధికారులు, పలు విభాగాల ఉద్యోగులు విధులకు గైర్హాజరై సమ్మెబాట పట్టారు. జి.మాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాల్లోను ఇదే పరిస్థితి. పాడేరు ఆర్టీసీ డిపోలోని కార్మిక సంఘాలన్ని సమ్మెబాట పట్టడంతో బస్ సర్వీసులు నిలిచిపోయి రవాణా స్తంబించింది.
పిడికిలి బిగించిన పల్లెలు
Published Wed, Aug 14 2013 4:26 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
Advertisement
Advertisement