సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా సమీక్ష మండలి (డీఆర్‌సీ) ప్రతి మూడు నెలలకోమారు క్రమం తప్పకుండా సమీక్షించాల్సి ఉంటుంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశం జిల్లా పాలనా యంత్రాంగానికి ఓ రకంగా దిశా నిర్దేశం చేస్తుంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా డీకే అరుణ బాధ్యతలు స్వీకరించి ఆగస్టుకు ఏడాది పూర్తయింది. 2012 సెప్టెంబర్ 27న, 2013 మార్చి 30న రెండు పర్యాయాలు మాత్రమే డీఆర్‌సీ సమావేశం నిర్వహించారు. సమావేశం ఏర్పాటు చేసిన ప్రతీసారి ప్రతి మూడు నెలలకోమారు సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్తున్నా, ఆచరణ కు మాత్రం నోచుకోవడం లేదు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పనితీరును సమీక్షించాల్సిన ‘విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ’ సమావేశం నిర్వహణ ఊసు ఏడాది దాటినా వినిపించడం లేదు.
మెదక్ ఎంపీ విజయశాంతి అధ్యక్షతన జరిగే ఈ సమావేశం కూడా ప్రతీ మూడు నెలలకోమారు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూలై 14న విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలని డీఆర్‌డీఏ ప్రతిపాదించింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో సమావేశం నిర్వహణ వాయిదా పడింది. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సమావేశం నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని అధికారులు చెప్తున్నారు.
మంత్రులదీ అదే దారి
డిప్యూటీ సీఎం సహా జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు కేబినెట్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరెవరూ కలెక్టరేట్ ముఖం చూసిన పాపాన పోవడం లేదు. అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి శాఖల వారీగా సమీక్షించేందుకు తీరిక చిక్కడం లేదు. దీంతో కీలక శాఖల పనితీరుపై సమీక్ష కొరవడి పాలన కుంటుపడింది.
స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసినా సర్పంచ్‌లకు చెక్‌పవర్ లేకపోవడంతో పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. జిల్లా, మండల పరిషత్, మున్సిపాలిటీలకు పాలక మండలి లేకపోవడంతో ప్రత్యేక అధికారులతో కాలం నెట్టుకొస్తున్నారు. అధికారుల పనితీరుపై సమీక్షించే నాథుడే లేడు.
విస్తారంగా వర్షాలు కురవడంతో సాగు విస్తీర్ణం అంచనాలకు మించి పెరిగింది. ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కుతున్నా పరిస్థితిని చక్కదిద్దే పరిస్థితి కనిపించడం లేదు.
రేషన్, పించన్లు కోసం అర్జీదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కనికరించే వారే కరువయ్యారు.
సంక్షేమ విభాగాలు, ఇంజనీరింగ్ శాఖల పనితీరుపై సమీక్ష లేక నిధులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఐదు నెలలు దాటినా ఊసులేని డీఆర్‌సీ
Published Tue, Sep 3 2013 12:33 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement