ఓ మహిళకు అసభ్యకర మైన ఫోన్లు, మెసేజ్‌లు పంపిన పట్టణానికి చెందిన ఐదుగురు యువకులను విశాఖపట్నానికి
ఫోన్‌లో అసభ్య సంభాషణలు.. మెసేజ్‌లు
Published Sat, Nov 30 2013 2:58 AM | Last Updated on Thu, Apr 4 2019 5:20 PM
చిలకలూరిపేట, న్యూస్‌లైన్ :ఓ మహిళకు అసభ్యకర మైన ఫోన్లు, మెసేజ్‌లు పంపిన పట్టణానికి చెందిన ఐదుగురు యువకులను విశాఖపట్నానికి చెందిన పోలీసులు శుక్రవారం అరెస్టుచేశారు. రెండురోజుల నుంచి పట్టణంలోని 30మంది యువకులను అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహించిన విశాఖ పోలీసులు చివరకు పట్టణంలోని సుగాలీకాలనీకి చెందిన యువకులను నిందితులుగా నిర్థాయించి అరెస్టుచేశారు. విశాఖపట్నం సైబర్ సెల్ ఎస్‌ఐ ఎస్.రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. తమ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ మహిళకు తరుచూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్‌చేసి అసభ్యకరంగా మాట్లాడడం, మెసేజ్‌లు పంపుతుండడంతో బాధితురాలు అక్టోబర్‌లో పోలీసులకు ఫిర్యాదుచేసింది.
కేసు దర్యాప్తు ఇలా...
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఫోన్‌చేసిన నంబర్లపై నిఘా పెట్టారు. టవర్ లొకేషన్ ఆధారంగా చిలకలూరిపేట పండరీపురం సమీపం నుంచి ఫోన్‌కాల్స్ వచ్చినట్లు నిర్థారించారు. వారి ఫోన్ నంబర్ల కాల్ రికార్డులను సేకరించి వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించడంతో విషయం బయటకుపొక్కింది. పూర్తి సమాచారం సేకరించిన అనంతరం సుగాలీకాలనీకి చెందిన బాణావతు దుర్గాప్రసాద్‌నాయక్, కేతవతు బుజ్జినాయక్, రమావతు జయరామ్‌నాయక్‌లతో పాటు ఇద్దరు బాలురను అరెస్టుచేశారు. వీరిపై సైబర్ నేరం కింద కేసు పెట్టనున్నట్లు తెలిసింది.
ఆందోళనకు గురైన బంధువులు..
సుగాలీకాలనీ, ఇతరప్రాంతాల నుంచి సుమారు 30 మంది యువకులను విచారణ నిమిత్తం తీసుకురావడంతో గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు విషయం తెలియక బంధువులు అందోళనకు గురయ్యారు. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగుడారు. వారిని విశాఖకు తరలిస్తున్న సమయంలో పోలీస్‌స్టేషన్ వద్ద బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి.
Advertisement
Advertisement