చౌటుప్పల్, న్యూస్‌లైన్‘స్వాతంత్య్రం వచ్చి 65ఏళ్లు దాటింది.. అయినా మన పాలకులకు గుక్కెడు మంచినీళ్లు అందించే సోయి లేదు.. దేశంలోనే మంచినీళ్ల పేరుతో విషం తాగుతోంది నల్లగొండ జిల్లావాసులే’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చౌటుప్పల్ మండలానికి మూసీజలాలు అందించాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి డాక్టర్ గంగిడి మనోహర్‌రెడ్డి 5రోజుల క్రితం భూదాన్ పోచంపల్లి మండలం మైసమ్మ కత్వ వద్ద పాదయాత్రను ప్రారంభించారు. 94కి.మీ.ల మేర చౌటుప్పల్ మండలంలోని అన్ని గ్రామాల మీదుగా పాదయాత్ర చేశారు. పెద్దకొండూరులో శుక్రవారం రాత్రి పాదయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. నల్లగొండ జిల్లాకు ఒక పక్క గోదావరి, మరోపక్క కృష్ణానది పారుతున్నా, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు గుక్కెడు మంచినీళ్లను అందించలేదన్నారు.
ఫ్లోరైడ్ విషపునీళ్లను తాగిన జనం బతికున్న శవాలుగా మారినా పాలకులకు కనిపించడం లేదన్నారు. రాష్ట్ర విభజనకు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ, చంద్రబాబునాయుడులు అడ్డుపడుతున్నారన్నారు. మంత్రి జానారెడ్డి తెలంగాణ ఇస్తామని చెప్పాం.. తెచ్చాం.. సోనియమ్మకు వందనాలు అంటూ ఫ్లెక్సీలు పెట్టుకున్నారు.. ఏనాడైనా మీరు తెలంగాణ కోసం జైలుకెళ్లారా అని జానారెడ్డిని ప్రశ్నించారు. మంత్రి పదవి రాకముందు తెలంగాణ కోసం మాట్లాడి, మంత్రి పదవి ఇవ్వగానే పదవి పోతుందని ఏనాడు మాట్లాడలేదన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధు పోరాటంతో తెలంగాణ రాలేదన్నారు. శ్రీకాంత్‌చారి లాంటి 1100మంది తెలంగాణ అమరవీరుల ఆత్మబలిదానాలతో తెలంగాణ వచ్చిందన్నారు. బీజేపీ జాతీయ నాయకుడు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టులు బీజేపీలో చేరుతుంటే ఈ ప్రాంత నాయకులు అడ్డుపడుతున్నారని, బీజేపీ జెండా ఎగురనీయమని అంటున్నారని అన్నారు.
సీపీఎంను కాదని, బీజేపీలో చేరితే మోటార్లు బావిలో వేయడం, గడ్డివాములను తగలబెట్టడం లాంటివి చేస్తే ఊరుకునేది లేదన్నారు. బీజేపీ రాష్ట్ర కోశాధికారి గంగిడి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌కు 16టీఎంసీల నీటిని తాగుజలాల కోసం ఇస్తున్నారని అన్నారు. సుమారు 12టీఎంసీల నీటిని వాడుకొని వదిలేస్తున్నారని, మూసీనది గుండా వెళ్లి సముద్రంలో కలుస్తుందన్నారు. భవిష్యత్తులో మూసీలో నీటి ప్రవాహం ఇంకా పెరగనుందన్నారు. మూసీ జలాలను వినియోగంలోకి తెచ్చుకుంటే సగం జిల్లా సస్యశ్యామలం అవుతుందని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేసి, ఒత్తిడి తెచ్చేందుకే పాదయాత్రకు పూనుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా పెద్దకొండూరు, లక్కారం, చిన్నకొండూరు, మసీదుగూడెం గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి మంది బీజేపీలో చేరారు. ఈ సభలో బీజేపీ జిల్లా అధƒ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, ప్రేమ్‌రాజ్‌యాదవ్, వెదిరె శ్రీరామ్, కర్నాటి ధనుంజయ, పాలకూర్ల జంగయ్య, దోనూరి వీరారెడ్డి, దూడల భిక్షంగౌడ్, రమణగోని శంకర్, మండల పార్టీ అధ్యక్షుడు మన్నె ప్రతాపరెడ్డి, గుజ్జుల సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మంచినీళ్ల పేరుతో విషం!
Published Sat, Oct 12 2013 12:51 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement