దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం
విజయవాడ : త్వరలో విజయవాడలో దుర్గగుడి వద్ద ప్లైఓవర్ నిర్మిస్తామని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటుకు అవకాశం ఉందని ఆయన శనివారమిక్కడ అన్నారు. త్వరలో గన్నవరం విమానాశ్రయం విస్తరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు వెంకయ్య నాయుడు తెలిపారు. నగర ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యల నుంచి త్వరలో శాశ్వత విముక్తి లభించే అవ కాశం ఫ్లైఓవర్ ద్వారా సాధ్యమవుతుందని అన్నారు.
అంతకు ముందు కామినేని ఆస్పత్రిని నూతన శాఖ ఆరంభం సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పేద, మధ్యతరగతి వారికి వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. వైద్య సేవలను అందించడానికి కేంద్రం యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టనుందని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రులు మానవతా దృక్పథంలో పనిచేయాలని, పేద, మధ్యతరగతి వారికి కూడా వైద్య సేవల ధరలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కార్పొరేట్ ఆసుపత్రులు ఏర్పాటు కావాలని అన్నారు. వైద్యులు సేవా దృక్పదంతో పని చేయాలని పిలుపునిచ్చారు.