
జన్మభూమిలో జనాగ్రహం
జిల్లావ్యాప్తంగా తొలిరోజు జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని ప్రజలు కొన్ని చోట్ల అడ్డుకోగా, మరికొన్ని చోట్ల బహిష్కరించారు. తాగునీరు, పింఛన్లు, రుణమాఫీ, రేషన్‌కార్డులు లేకుండా జన్మభూమి కార్యక్రమానికి ఎందుకొచ్చారంటూ అధికారులను నిలదీశారు. దీంతో వారు వెనుదిరగాల్సి వచ్చింది.
సాక్షి, చిత్తూరు: ఎన్నికల కోడ్ నేపథ్యంలో జన్మభూమి కార్యక్రమం రద్దయినట్లు ప్రచారం జరిగింది. అయితే అధికారికంగా తమకు ఆదేశాలు రాలేదంటూ అధికారులు పలుచోట్ల జన్మభూమి కార్యక్రమాలను నిర్వహించారు. అధికారపార్టీ నేతలు సైతం నిబంధనలను తుంగలో తొక్కి జన్మభూమిలో పాల్గొన్నా అధికారులు అడ్డుచెప్పలేదు. పలమనేరు రూరల్ మండలం మొరం గ్రామంలో అర్హులైన వారి పింఛన్లు తొలగించారంటూ అధికార పార్టీ నేతలే జన్మభూమి సభను అడ్డుకున్నారు.
పింఛన్లు ఇచ్చేంత వరకు గ్రామంలో సభ జరగనివ్వమని హెచ్చరించారు. ప్రజలతో తిట్లు తినాల్సి వస్తోందని, గ్రామంలో తలెత్తుకుని తిరగలేకున్నామని స్థానిక నేతలు అధికారులను నిలదీసి చివాట్లు పెట్టారు. నగరి మున్సిపాలిటీ 1,2,3 వార్డుల్లో జరిగిన జన్మభూమి సభలను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. తాగేందుకు గుక్కెడు నీరు ఇవ్వలేమన్నప్పుడు సభలెందుకంటూ మున్సిపల్ కమిషనర్ బాలాజీనాథ్ యాదవ్‌ను నిలదీశారు. సభను జరగనివ్వమంటూ భీష్మించుకు కూర్చొన్నారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు.
అనంతరం సభలను బహిష్కరించి వెళ్లిపోయారు. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని పీఎస్ అగ్రహారంలో జరిగిన సభలో అధికారులు లేకుండా టీడీపీ నేతలు కొందరు వేదికపై కూర్చోవడంతో వైఎస్సార్‌సీపీకి చెందిన కౌన్సిలర్ శ్యామ్‌సుందర్ వారిని నిలదీశారు. అధికారులు లేకుండా జన్మభూమి ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. దీంతో అక్కడి నుంచి వారు లేచి వెళ్లిపోయారు. పీలేరులో తాగునీటి సమస్యను ఎంతచెప్పినా పరిష్కరించడం లేదంటూ స్థానికప్రజలు అధికారులను నిలదీశారు. పుంగనూరు నియోజకవర్గం సదుం మండల కేంద్రంలో జరిగిన సభలో పింఛన్లు పంపిణీ చేయకుండా మొక్కుబడిగా సభను ఎందుకు నిర్వహిస్తున్నారంటూ ఎంపీపీ, జడ్పీటీసీలను ప్రశ్నించడంతో సభ ఆగిపోయింది.
శ్రీకాళహస్తి పట్టణంలో తొలిరోజు ఏడు వార్డుల్లో జన్మభూమి కార్యక్రమాలను అధికారులు మొక్కుబడిగా నిర్వహించారు. మంత్రి వస్తున్నారంటూ ఉదయం 9 గంటలకే సభ అంటూ పింఛన్‌దారులతోపాటు గర్భవతులను సభల వద్దకు తరలించారు. 11 గంటలైనా మంత్రి రాకపోవడంతో అసహనానికి గురైన ప్రజలు అధికారులపై చిందులు తొక్కారు. మున్సిపల్ కమిషనర్‌ను నిలదీశారు. దీంతో కమిషనర్ జన్మభూమి ప్రారంభించారు. ఇంతలో మంత్రి వేరే వార్డులో ఉన్నారని తెలుసుకుని అర్థాంతరంగా కమిషనర్ మంత్రి వద్దకు పరుగులు పెట్టడంతో ప్రజలు చీవాట్లు పెట్టారు.
జన్మభూమి సందర్భంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ వర్గాల మధ్య గొడవ జరిగింది. జీడీనెల్లూరు నియోజకవర్గంలోని వెదురుకుప్పం మండల కేంద్రంలో అధికారులు మొక్కుబడిగా జన్మభూమి నిర్వహించి అర్జీలు తీసుకుని వెళ్లిపోయారు. చిత్తూరురూరల్ ఆనగల్లులో జన్మభూమి సభ మొక్కుబడిగా సాగింది. సభకు వచ్చిన కొద్దిపాటి మహిళలు సైతం రుణమాఫీ చేయలేదని, డ్వాక్రా రుణాలు ఇవ్వలేదంటూ నేతలను నిలదీశారు.