స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం అందించే రుణాల కోసం నిరుద్యోగులు, మహిళలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. నిబంధనల పేరుతో ప్రభుత్వం వారి సహనానికి పరీక్ష పెడుతోంది. ఇంత జరిగినా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందనేది అనుమానంగా మారింది. పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే సిఫార్సులు ఉన్న వారికే రుణాలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఉంటున్నాయి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు. నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరులో పారదర్శకత కోసమంటూ తెచ్చిన నిబంధనలు అర్హుల ఆశలకు గండికొట్టేలా ఉన్నాయి.
లబ్ధిదారుల ఎంపిక కోసం ఏర్పాటు చేస్తున్న కమిటీల్లో సామాజిక కార్యకర్తల ముసుగులో అధికార పార్టీ నేతల అనుచరులు వచ్చే ప్రయత్నాలు జరుగుతుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. లబ్ధిదారుల ఎంపికకకు మండల కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు అందాయి.
కమిటీల్లోకి అధికారులతో పాటు ముగ్గురు సామాజిక కార్యకర్తలను సభ్యులుగా తీసుకోవాలనే నిబంధన తెచ్చారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సూచించిన వారినే కమిటీల్లోకి తీసుకునేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ కమిటీల నియామకం అధికారులకు పెద్ద సమస్యగా మారింది. ‘ఇలాంటప్పుడు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను రాజకీయ నాయకులకే అప్పగిస్తే మాకు ఈ కష్టాలు ఉండవు కదా..’ అని ఓ అధికారి వ్యాఖ్యానించాడంటే వారిపై పెరుగుతున్న ఒత్తిడికి నిదర్శనం.
కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రాధాన్యం
లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన మండల స్థాయి కమిటీలను ఈ నెల 21వ తేదీలోపు నియమించాలని మొదట ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇన్‌చార్జి మంత్రి ఎవరినీ సిఫారసు చేయకపోవడంతో ఆ గడువును 31వ తేదీ వరకు పొడిగించింది. మండల స్థాయిలో ఎంపీడీఓ, మున్సిపాలిటీల్లో కమిషనర్లు కన్వీనర్లుగా వ్యవహరించే కమిటీలో ఆయా కార్పొరేషన్ల అధికారులు, బ్యాంకు మేనేజర్లు, మం డల, జిల్లా మహిళ సమాఖ్య అధ్యక్షులను సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు ఇన్‌చార్జి మంత్రి సిఫార్సు చేసిన వారిని ముగ్గురిని తీసుకోవాల్సి ఉంది. వీరిలో ఒకరు మహిళ ఉండాలి. ఈ క్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సిఫార్సు చేసే వారిలో కాం గ్రెస్ కార్యకర్తలకే అవకాశం దక్కనుంది. దీం తో లబ్ధిదారుల ఎంపికలోనే వారి హవానే సాగే అవకాశాలు ఉండటంతో అర్హులైన నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
మళ్లీ ఎంపికలా !
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రుణాల మంజూ రుకు 2013 జూన్‌లోనే లబ్ధిదారులను ఎంపిక చేశారు. రాయితీ పెంపు నిర్ణయం వచ్చిన త ర్వాత వారికి రుణాలు మంజూరు చేస్తామంటూ చెబుతూ వచ్చారు. డిసెంబర్ 31న రాయితీని పెంచుతూ నిర్ణయం వెలువడింది. అదే సమయంలో లబ్ధిదారులకు వయోపరిమితి విధించడంతో పలువురు అర్హత కోల్పోయారు. ఇంటర్వ్యూలకు హాజరై రుణ పత్రా లు పొందిన వారు కూడా మళ్లీ ఇప్పుడు కొత్త కమిటీల ముందు హాజరుకావాల్సిన పరిస్థితి నెలకొంది. వీరిని మళ్లీ ఎంపిక చేసే విషయం కమిటీ సభ్యుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు.
రాజకీయ లబ్ధి కోసమే: చండ్ర రాజగోపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి
లబ్ధిదారుల ఎంపిక కమిటీల్లో మంత్రి సిఫార్సుల మేరకు సభ్యులను నియమించే ప్రయత్నాలు రాజకీయ లబ్ధి కోసమే. కొత్త నిబంధనలతో అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వారికే లబ్ధి చేకూరే అవకాశం ఉంది. మండల కమిటీల్లో రాజకీయ నేతలు సభ్యులుగా ఉంటే అర్హులకు అన్యాయం జరుగుతుంది.
సంక్షేమ పథకాలను నీరుగార్చేందుకే: తలమంచి రాగవేణి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యురాలు
సంక్షేమ పథకాలను నీరు గార్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది. రాజకీయ లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ అనాలోచిత చర్యలతో గిరిజనులు రుణాలకు దూరమయ్యే ప్రమాదముంది.
సిఫార్సులకే రుణం
Published Sat, Jan 25 2014 2:10 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement