గజ్వేల్, న్యూస్‌లైన్: స్థానికంగా లభించే ద్రాక్ష పండ్ల రుచిని ఆస్వాదించిన జనం ఇక పొరుగు రాష్ట్రాల సరుకుపై ఆధార పడక తప్పదు. ప్రభుత్వ చేయూత లేకపోవడంతో ఇక్కడి తోటలు క్రమంగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. మహారాష్ట్రలో మాత్రం అక్కడి ప్రభుత్వం రైతులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తోండడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. ఫలితంగా అక్కడినుంచే ‘ద్రాక్ష’ను దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఇప్పటికే మార్కెట్‌లోకి ఉత్పత్తులు వెల్లువలా వస్తున్నాయి. పొరుగు రాష్ట్రానికి చెందిన సరుకు కావడంతో ఇప్పటికే ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో రూ.70కిపైగానే పలుకుతుండగా ప్రత్యేకించి సామాన్యులకు ఇక అందని‘ద్రాక్ష’గానే మారింది.
రాష్ట్రంలో ద్రాక్ష సాగుకు సంబంధించి ఒకప్పుడు మెదక్, రంగారెడ్డి జిల్లాలే ఆధారం. ప్రత్యేకించి మెదక్ జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం ద్రాక్ష సాగులో సింహభాగాన్ని ఆక్రమించేది. విదేశాలకు ఎగుమతి చేసేం దుకు దోహదపడే సీడ్‌లెస్ రకాలే ఇక్కడి రైతులు ప్రధానంగా సాగుచేసేవారు. విదేశాలకే కాకుండా కర్ణాటక, తమిళనాడు, ఒడిషా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కూడా ద్రాక్ష ఎగుమతి అయ్యేది. సాధారణంగా ఎకరా ద్రాక్ష తోట సాగు చేయాలంటే కూలీలు, ఎరువులు, ఫంగీసైడ్స్, ఇతర అవసరాలు కలుపుకొని రూ.1.8 లక్షల వరకు పెట్టుబడి అవసరముంటుంది.
ఇంత భారీ పెట్టుబడి పెట్టినా 2006 వరకు రైతులు లాభాలను బాగానే గడించారు. 2007లో ద్రాక్ష తోటల సాగుకు సంబంధించి ఒక్కసారిగా సీను మారింది. ద్రాక్ష తోటలు సాధారణంగా జనవరి రెండో వారం నుంచి ఏప్రిల్ నెల వరకు కోతకు వస్తుంటాయి. ఈ క్రమంలో 2007, 2008 సంవత్సరాల్లో సరిగ్గా కోతల సమయాల్లోనే అకాల వర్షాలు కురిశాయి.
2008 సంవత్సరంలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో గజ్వేల్, ములుగు, వర్గల్ తదితర మం డలాల్లో సాగులో ఉన్న ద్రాక్ష తోటలకు ఫంగస్ సోకి పళ్లన్నీ విషతుల్యమయ్యాయి. దీంతో రైతులు కోట్లల్లో నష్టపోయారు.
గణనీయంగా పడిపోయిన విస్తీర్ణం..
2007, 2008వ సంవత్సరాల్లో వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉండడంతో కోట్లా ది రూపాయల నష్టాన్ని చవిచూడడంతో ద్రాక్ష సాగంటేనే రైతులు జంకుతున్నారు. కూరగాయల సాగుపై దృష్టి సారించారు. ఫలితంగా గజ్వేల్, ములుగు, వర్గల్, కొండపాక, తూప్రా న్ మండలాల్లో 2008లో వెయ్యి ఎకరాల్లో ద్రాక్ష సాగులో ఉండగా 2009, 2010వ సంవత్సరాల్లో 150 ఎకరాలకు తగ్గిపోయింది.
2013-14లో 20 ఎకరాలకు పడిపోవడం ఆం దోళన కలిగిస్తున్నది. జిల్లాలో ఐదేళ్లక్రితం మూడు వేల ఎకరాల్లో ‘ద్రాక్ష’ సాగైతే ప్రస్తుతం 200 ఎకరాలకు పడిపోయిందంటే అతిశయోక్తి కాదు. నష్టాల బారినపడ్డ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం చొరవచూపకపోవడంతో ద్రాక్షసాగు పడిపోయే ప్రమాదం ఉంది.
మహారాష్ట్ర నుంచే..
మన రాష్ట్ర అవసరాల కోసం మహారాష్ట్ర నుంచే ద్రాక్షను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ జనవరి మొదటి వారం నుంచి తోటలు కోతకు వస్తుంటాయి. తెలంగాణ జిల్లాల్లో ఫిబ్రవరి చివరి వారంలో తోటలు కోతకు వస్తా యి. కానీ సాగు గణనీయంగా పడిపోవడంతో మహారాష్ట్ర సరుకుపైనే ఆధారపడాల్సిన పరిస్థి తి. ఇప్పటికే మార్కెట్‌లోకి అక్కడి సరుకు వెల్లువలా రావడం ఆరంభమైంది. ప్రస్తుతం కిలో ధర రూ.70కిపైగానే పలకడం ఆందోళన కలిగిస్తున్నది.
మహారాష్ట్రలో సర్కార్ ప్రోత్సాహం..
ద్రాక్ష సాగుకు మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి రైతులను వెన్ను తట్టి ప్రోత్సహిస్తోంది. కొత్తగా ద్రాక్ష సాగుకు సిద్ధమయ్యే రైతులకు అక్కడి ప్రభుత్వం బ్యాంకు రుణంతోపాటు ఫంగీ సైడ్స్, పెస్టిసైడ్స్, ఆధునిక పరికరాలు, పందిరి అల్లడానికి వైరు, డ్రిప్ తదితర సౌకర్యాలను కల్పిస్తోంది. ఒక వేళ రైతులు అకాల నష్టాలతో నష్టపోతే ఎకరాకు రూ.80 వేల వరకు నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది.
అంతేగాక బ్యాంకుల్లో పంట రుణాలను రెన్యువల్ చేస్తుంది. కానీ మన రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉంది. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే వారిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇక్కడి ప్రభుత్వం కొత్తగా ద్రాక్ష సాగు చేసే రైతులకు అందిస్తున్న సాయం అరకొరేనని చెప్పవచ్చు.
పొరుగు రాష్ట్రం ద్రాక్షే దిక్కు!
Published Wed, Jan 22 2014 12:51 AM | Last Updated on Mon, Oct 8 2018 6:18 PM
Advertisement
Advertisement