- ఎంపీలు మేకపాటి, వైవీ, గల్లా ప్రశ్నలకు కేంద్రం సమాధానం
సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి రెవెన్యూ లోటు పూడ్చేందుకు తక్షణ సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ప్రత్యేక అభివృద్ధి సాయం కింద 2014-15 నుంచి 2018-19కి రూ.24,350 కోట్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. ‘ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నం దున కేంద్రం నుంచి సాయం అందించాలని ఏపీ ప్రభుత్వం కోరిందా? కోరితే ఎంతమేరకు కేంద్రం సాయం చేసింది? ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రకారం రెవెన్యూ లోటు భర్తీకి ఏం చర్యలు తీసుకుంటున్నారు?’-అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నలకు మంత్రి జయంతి సిన్హా పైవిధంగా లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
కేంద్ర హోం మంత్రి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల కమిటీ ఏపీకి సంబంధించిన 2014-15 రెవెన్యూ లోటు అంశాన్ని పరిశీలిస్తోందని, ప్రాథమికంగా రూ.500 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ఇవి కాకుండా మరో రూ.350 కోట్లు ఏపీలోని 7 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేటాయించినట్టు పేర్కొన్నారు.