సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్రం 2018–19 వరకు రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉంది. కానీ ఆ తర్వాత క్రమంగా రెవెన్యూ లోటు నమోదయింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.9,335 కోట్ల రెవెన్యూ లోటు, రూ.46,639 కోట్ల ద్రవ్యలోటు ఏర్పడింది. మిగులు నుంచి లోటుకు వెళ్లినా అంతకుముందు ఏడాదితో పోలిస్తే రెవెన్యూ, ద్రవ్యలోటు పరిమాణం కాస్త తగ్గింది. 2020–21లో రెవెన్యూ లోటు రూ.22,298 కోట్లు కాగా, ద్రవ్యలోటు రూ.49,038 కోట్లుగా ఉంది. 2021–22లో నమోదైన రెవెన్యూ లోటు జీఎస్‌డీపీలో 0.81 శాతం కాగా, ద్రవ్యలోటు 4.06 శాతంగా నమోదయింది.
అదే రెవెన్యూ రాబడులతో పోలిస్తే 27 శాతం ద్రవ్యలోటు ఏర్పడింది..’అని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను అకౌంట్ల నిర్వహణకు సంబంధించిన పరిశీలన అనంతరం కాగ్ రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం.. వర్షాకాల సమావేశాల చివరిరోజు ఆదివారం శాసనసభ, మండలి ముందు ఉంచింది.
ఈ నివేదికలో వివిధ ప్రభుత్వ శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు, వేజ్ అండ్ మీన్స్, ఓవర్ డ్రాఫ్ట్‌లకు వెళ్లి ప్రభుత్వం తెచ్చుకున్న అడ్వాన్సులు, పద్దుల వారీగా చూపెట్టాల్సిన ఖర్చుల్లో తేడాలు, చూపెట్టిన నగదు నిల్వ, ఖర్చుల్లో తేడాలు, రెవెన్యూ రాబడులు, ప్రభుత్వ అప్పుల గణాంకాలను వెల్లడించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వివిధ ప్రభుత్వ శాఖల ఆర్థిక పారదర్శకతపై ఆడిట్ నిర్వహించి కాగ్ రూపొందించిన నివేదిక అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వం సభ ముందుంచకపోవడం గమనార్హం.
2021–22 అకౌంట్ల నిర్వహణలో కాగ్ గుర్తించిన ముఖ్యాంశాలు
► 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి అడ్వాన్సులు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో కనీస నగదు నిల్వ ఉంచింది 76 రోజులు. స్పెషల్ డ్రాయింగ్ సౌకర్యం (ఎస్‌డీఎఫ్) వినియోగించుకుంది 30 రోజులు. వేజ్ అండ్ మీన్స్‌కు వెళ్లింది 159 రోజులు. ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లింది 100 రోజులు.
► అడ్వాన్సులు తీసుకున్న 289 రోజుల్లో (ఎస్‌డీఎఫ్ 30, వేజ్ అండ్ మీన్స్ 159, ఓడీ 100 రోజులు కలిపి) ఎస్‌డీఎఫ్ కింద రూ.9,636 కోట్లు, వేజ్ అండ్ మీన్స్ అడ్వాన్సుల రూపంలో రూ.34,969 కోట్లు వినియోగించుకుంది. ఓడీ కింద రూ.22,669 కోట్లు తెచ్చుకుంది.
► 2021–22 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అప్పుల రూపంలో తెచ్చిన రూ.42,936 కోట్లు, ప్రజాపద్దు కింద వినియోగించాల్సిన రూ.3,773 కోట్లను ద్రవ్యలోటు కింద చూపెట్టారు.
► ఆర్థిక జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) కింద 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఇందులో రెవెన్యూ మిగులుతో ఖజానా నిర్వహించాలనేది మొదటి లక్ష్యం కాగా, రూ.9,335 కోట్లు రెవెన్యూ లోటు ఏర్పడింది. జీఎస్‌డీపీలో 3 శాతానికి మించకుండా ద్రవ్యలోటు ఉండాలనేది రెండోలక్ష్యం కాగా, అది 4.06 శాతంగా నమోదైంది. నికర అప్పులు జీఎస్‌డీపీలో 25 శాతం మించవద్దనే మూడో లక్ష్యం కూడా నెరవేరలేదు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి జీఎస్‌డీపీలో 27.40 శాతం అప్పులు మిగిలాయి.
► రెవెన్యూ రాబడుల కింద వచ్చిన రూ.1,27,468 కోట్లలో దాదాపు 50 శాతం అనివార్య వ్యయం కిందనే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఇందులో రూ.30,375 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు, రూ.19,161 కోట్లు వడ్డీ చెల్లింపులు, రూ.14,025 కోట్లు పింఛన్ల కింద ఖర్చు పెట్టారు.
► ఏప్రిల్ 1, 2021 నాటికి రాష్ట్ర ప్రభుత్వ నికర అప్పులు రూ.2,78,017.64 కోట్లు. ఆ ఏడాదిలో తీసుకున్న అప్పులు రూ.43,593.94 కోట్లు. 2022 మార్చి 31 నాటికి నికర అప్పులు రూ.3,21,611.58 కోట్లు.
► పలు కార్పొరేషన్లు, సంస్థలకు రుణాలు తీసుకునేందుకు గాను రూ.40,449 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం గార్యంటీ ఇచ్చింది. దీంతో 2022 మార్చి 31 నాటికి ప్రభుత్వ నికర గ్యారంటీల మొత్తం రూ.1,35,283 కోట్లకు చేరింది.
► మొత్తం అప్పుల్లో రూ.28,883 కోట్లు మూలధన వ్యయం కింద, రూ.8,469 కోట్లు రుణాలు, అడ్వాన్సుల చెల్లింపులకు వెచ్చించారు. జీఎస్‌డీపీకి సమాంతరంగా మూలధన వ్యయం లేదు. జీఎస్‌డీపీలో 2.51 శాతం మాత్రమే మూలధన పద్దు కింద వెచ్చించారు.
► వివిధ మేజర్ పద్దులను ఆడిట్ చేయగా, ఉండాల్సిన నగదు నిల్వ కంటే తక్కువ ఉంది.
► 2021–22 ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రభుత్వ పథకాల అమలుకు గాను కేంద్రం నేరుగా ఇచ్చిన రూ.18,392 కోట్లు ప్రభుత్వ అకౌంట్లలో కనిపించలేదు. తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, తెలంగాణ స్టేట్ సివిల్ సప్‌లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లకు పలు పథకాల అమలు కోసం ఈ నిధులను కేంద్రం ఇచ్చింది.
► హౌసింగ్, పరిశ్రమల శాఖలకు బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం కంటే చాలా తక్కువ ఖర్చు పెట్టారు. బడ్జెట్ అంచనాల రూపకల్పనలో ఆయా శాఖలకు స్పష్టత లేని కారణంగానే ఇది జరిగింది.
► ఇక ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కంట్రిబ్యూటరీ పింఛన్ పథకం కోసం ప్రతి నెలా వసూలు చేసే మొత్తంలో రూ.2,074.22 కోట్లు మాత్రమే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్)కు జమ చేసింది. మరో రూ.313.72 కోట్లు జమ చేయాల్సి ఉంది.
మిగులు నుంచి లోటుకు.. తెలంగాణ ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక
Published Mon, Aug 7 2023 1:49 AM | Last Updated on Mon, Aug 7 2023 10:10 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment