అమరావతి : పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఇసుక దందాకు అడ్డుతొలగింది. ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) వర్గాల మధ్య చెలరేగిన ఇసుక దుమారం పోలీస్ బాస్ జోక్యంతో సద్దుమణిగింది. గతంలో ఇక్కడ పనిచేసి, అధికార పార్టీకి అత్యంత అనుకూలంగా వ్యవహరించారనే పేరున్న పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వారి మధ్య రాజీకుదిర్చారని సమాచారం. ఫలితంగా ఈ నియోజకవర్గంలో ఇసుక దందా పూర్తిగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పరమైంది. నిబంధనలు తీసి గట్టు మీద పెట్టి విచ్చలవిడిగా సాగిస్తున్న ఇసుక రవాణాతో రోజుకు రూ.10 లక్షలకు పైగా నికర ఆదాయం ఎమ్మెల్యే బోడె సొంతమైంది.
పెనమలూరు నియోజకవర్గంలోని మద్దూరు, చోడవరం ఇసుక కార్వీల్లో ఇసుక తవ్వకాల ఆధిపత్యం కోసం ఎమ్మెల్యే బోడె ప్రసాద్, కాంగ్రెస్ నాయకుడు దేవినేని రాజశేఖర్(నెహ్రూ) వర్గాల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే, అతని అనుచరులు ఈ రెండు క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రయివేటు ర్యాంపులు నిర్మించడంతో పాటు పొక్లెయిన్లతో విచ్చలవిడిగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. ఇదే తరహాలో కాంగ్రెస్ నేత నెహ్రూ అనుచరులు కూడా ఈ క్వారీల్లోకి ప్రవేశించి ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమయింది. రెండు వర్గాల్లో ఎవరూ వెనక్కు తగ్గకపోవడంతో.. నాలుగు రోజుల క్రితం తాత్కాలికంగా తవ్వకాలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో పోలీస్‌బాస్ జోక్యం చేసికొని, ఇసుక తవ్వకాలు నిలిపివేస్తే ఇద్దరూ నష్టపోతారని సర్ది చెప్పారని సమాచారం. రెండు వర్గాలకు సయోధ్య కుదిర్చి, ఈ రీచ్‌ల్లో ఇసుక తవ్వుకొనే అవకాశం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వర్గానికి ఇచ్చి, మరో చోట నెహ్రూ వర్గానికి అవకాశం కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.
ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అనుచరులు బుధవారం నుంచి చోడవరం, మద్దూరు రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. చోడవరం క్వారీలో ఆరు పొక్లెయిన్లు ఏర్పాటుచేసి తవ్వకాలు చేపట్టారు. లారీకి రూ.1500 చొప్పున లోడింగ్ చార్జీ వసూలు చేస్తున్నారు. తొలి రోజే ఈ క్వారీ నుంచి రోజుకు 500 లారీల ఇసుక తరలివెళ్లింది.
మద్దూరు రీచ్ 12 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే అనుచరులు ఎనిమిది పొక్లెయిన్లతో ఇసుకను తవ్వుతున్నారు. ఇక్కడ కూడా లారీకి రూ. 1500 చొప్పున లోడింగ్ చార్జీ వసూలు చేశారు. ఈ క్వారీ నుంచి కూడా రోజుకు 500 లారీలు బయటకు వెళ్తున్నాయి.
అధికార బలంతో ఎమ్మెల్యే రోజుకు వెయ్యి లారీల ఇసుక కొల్లగొడుతన్నారు. అధికారులు అండగా నిలుస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రయివేటు ర్యాంపులు నిర్మించినా, పొక్లెయిన్లతో ఇసుక తవ్వతున్నా పట్టించుకోవడ లేదు.
ఇసుక అవసరమైన సామాన్యులు ర్యాంపుల్లోకి వెళ్తే టీడీపీ నేతలు గొడవలకు దిగడంతో పాటు పోలీసుల సహాయంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పోలీసు అధికారులు కూడా ఇసుక అక్రమ తవ్వకాల్లో అధికార పార్టీ నేతలకు అండగా నిలుస్తున్నారు.
ఈ రెండు కార్వీల్లో రోజుకు నికర రాబడి రూ.15 లక్షల పైమాటే. ఖర్చులు, అధికారులకు మామూళ్లు పోనూ రూ.10 లక్షలకు పైగా మిగులుతుంది.ఈ లెక్కన నెలకు రూ.3 కోట్లు అయాచితంగా ఎమ్మెల్యేకు దక్కనుంది. క్రమంగా తవ్వకాలు పెంచి ఆదాయాన్ని మరింతగా పెంచుకొనే ప్రయత్నాల్లో ఎమ్మెల్యే ఉన్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆ రీచ్‌లు బోడేకే!
Published Thu, Jul 14 2016 1:04 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement