=మానవ మృగాల మధ్య బతకలేం
=బాధితురాలి భర్త ఆవేదన
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : కొండల్లో పుట్టారు... కోనల్లో పెరిగారు. బతుకు తెరువు కోసం ఉన్న ఊరికి దూరమయ్యారు. పొట్ట చేత పట్టుకుని నగరానికి వలస వచ్చారు. కూలి పనులు చేసుకుంటూ జీవన పోరాటం సాగిస్తున్నారు. మానవ మృగాలు వారి బతుకును చిందరవందర చేశారు. భర్త కళ్లెదుటే భార్యపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి కంచరపాలెం దరి దోబీ ఘాట్ పాత రైల్వే క్వార్టర్స్‌లో చోటుచేసుకుంది. (వివరాలు మెయిన్‌లో) జి.మాడుగుల మండలం పాంగిమామిడి గ్రామానికి చెందిన ఓ గిరిజన యువకుడు భార్య పిల్లలతో నగరానికి వచ్చి ఆర్.కె.ఏజెన్సీలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అతడి భార్యపై అత్యాచారయత్నం చేశారు.
అడ్డుకున్న అతడిని తాళ్లతో కట్టి కర్కశంగా వ్యవహరించారు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. దీంతో వారు ప్రాణ భయంతో వణికిపోయారు. గత్యంతరం లేక రక్షణ కల్పించాలని కంచరపాలెం పోలీసులను ఆశ్రయించారు.
బతిమలాడినా కనికరించలేదు
‘బతుకుతెరువుకి వలస వచ్చాం. అద్దె ఇంట్లో ఉండే స్తోమత లేక పాడుబడిన క్వార్టర్స్‌లో ఉంటున్నాం. తుప్పలు, డొంకలు, విష సర్పాల మధ్య జీవిస్తున్నాం. మనుషుల్లో విషం ఉంటుందని గ్రహించలేకపోయాం. మా బతుకుల మీద కొట్టారు. కాళ్లు పట్టుకుని బతిమలాడినా కనికరించలేదు. క్రూరంగా, అతికిరాతకంగా వ్యవహరించారు. నా కళ్ల ముందే నా భార్యపై అత్యాచారం చేశారు. బయటకు చెబితే చంపేస్తామన్నారు. నగరంలో మృగాల మధ్య నివసించలేం మన ఊరికి వెళ్లిపోదామని’ గిరిజన యువకుడు రోదిస్తూ భార్యను ఓదార్చాడు. పోలీస్‌స్టేషన్‌లో బాధిత జంటను చూసిన ప్రజలు చలించిపోయారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
స్థానికుల పనే...!
అత్యాచారం చేసింది పరిసర ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. భర్త తెలిపిన వివరాల ఆధారంగా యువకులని గ్రహించారు. క్రికెట్ ఆడడానికి వచ్చి కొంతమంది యువకులు క్వార్టర్స్ పరిసరాల్లో తిరుగుతారని, పలుమార్లు తనను కొట్టి జేబులో డబ్బులు తీసుకున్నారని బాధితురాలి భర్త పోలీసులకు చెప్పాడు. నిందితులను గుర్తిస్తానని స్పష్టం చేశాడు.