ఒంగోలు క్రైం : ఆర్టీసీ సమ్మె..ప్రైవేటు ఆపరేటర్లకు వరంలా మారింది. జిల్లా నుంచి వివిధ నగరాలకు ప్రయాణిస్తున్న వారి నుంచి అధిక చార్జీల రూపంలో నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేపట్టడంతో ప్రైవేటు ఆపరేటర్లకు అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేసేందుకు మంచి అవకాశం దక్కింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు ప్రైవేటు ఆపరేటర్లు వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె రూపంలో ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు కనకవర్షం కురిపిస్తున్నారు. గతంలో ఉన్న చార్జీల స్థానంలో నూరు శాతం ఎక్కువ చేసి రెట్టింపు మొత్తంలో వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారు.
జిల్లా నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు నగరాలతో పాటు పలు నగరాలకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నడుస్తున్నాయి. అదే అదనుగా చేసుకుని ప్రయాణికుల అవసరాన్ని ఆసరా చేసుకుని ముక్కుపిండి చార్జీలు వసూలు చేస్తున్నారు. గతంలో ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే రూ.300 నుంచి రూ.350 వసూలు చేసేవారు. అయితే ఇటీవల ట్రాన్స్‌పోర్టు డ్యూటీని పెంచడంతో రూ.350 ఉన్న బస్స చార్జీని రూ.450 నుంచి రూ.500 చేశారు. తాజాగా సమ్మె నేపథ్యంలో రూ.800 నుంచి రూ.1100 వరకు వసూలు చేస్తున్నారు. జిల్లా నుంచి, జిల్లా మీదుగా 40 నుంచి 60 వరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వివిధ నగరాలకు ప్రయాణీకులను చేరవేస్తున్నాయి.
అదే విధంగా ఒంగోలు నుంచి విశాఖపట్నంకు గతంలో రూ.700 నుంచి రూ.800 వరకు వసూలు చేసేవారు. అలాంటిది ప్రస్తుతం రూ.1,100 నుంచి రూ.1,400 వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అదేమని అడిగితే బస్సుల్లో సీట్లు ఖాళీ లేవని చెబుతున్నారు. దీంతో ప్రయాణికులు తప్పనిసరై వారు అడిగినంత చెల్లిస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు సొంత జిల్లా అయినప్పటికీ ప్రైవేట్ ఆపరేటర్ల అక్రమ వసూళ్లకు ముక్కుతాడు వేసే పరిస్థితి లేకుండా పోయిందంటే ప్రైవేట్ ఆపరేటర్ల దందాలు ఏ స్థాయిలో ఉన్నాయో అట్టే అర్థమవుతోంది.
ప్రైవేటు దోపిడీ
Published Fri, May 8 2015 5:32 AM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM
Advertisement