private operators
-
బస్సెక్కాలంటే భయం.. దోచేస్తున్న ప్రైవేటు ఆపరేటర్లు
దసరా పండగ వచ్చిందంటే పిండి వంటలు, కొత్త బట్టలు ఇలా బడ్జెట్ లెక్కలు వేసుకుంటారు సామాన్యులు, కానీ ఇప్పుడా లెక్కలు తారుమారు అవుతున్నాయి. కుటుంబ సమేతంగా ఇంటికి వెళ్లాలంటే భారీ బడ్జెట్ కేటాయించాల్సిందే. ప్రైవేటు ఆపరేటర్లు ఇష్టారీతిగా టిక్కెట్ల ధరలు పెంచడంతో ఈ పరిస్థితి నెలకొంది. బస్సుల్లోనే దసరా పండుగ వేళ ఇళ్లకు వెళ్లే వారి జేబులు గుల్ల అవుతున్నాయి. ఇటు ఆర్టీసీ అటు ప్రైవేటు ఆపరేటర్లు ఛార్జీలు పెంచేయడంతో సొంతిరికి ప్రయాణం భారంగా మారింది. ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ప్రదేశ్ ఆర్టీసీలు స్పెషల్ బస్సుల పేరుతో యాభై శాతం ఎక్స్ట్రా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. సాధారణ బస్సుల్లో రెగ్యులర్ ఛార్జీలే ఉన్నా స్పెషల్ బస్సుల్లో మాత్రం అధికం తప్పడం లేదు. మరోవైపు పండగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు నడిపించే రైల్వేశాఖ కోవిడ్ ఎఫెక్ట్‌తో గతేడాది నుంచి ప్రత్యేక రైళ్లు ఎక్కువగా నడిపించడం లేదు. దీంతో ఎక్కువ మంది బస్సుల్లోనే సొంతూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. నాలుగు వేల బస్సులు ఇదే అదనుగా భావించిన ప్రైవేటు ఆపరేటర్లు ఎడా పెడా టిక్కెట్ల ధరలు పెంచేశారు. దీంతో సామాన్యుల పండగ బడ్జెట్లో లెక్కలు తారుమారు అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి నిత్యం నాలుగు వేలకు పైగా ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. ఇందులో సగానికి పైగా బస్సులు ఏపీకే వెళ్తుంటాయి. మిగిలిన బస్సులు బెంగళూరు, ముంబై , ఇతర పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటాయి. దసరా పండగ సందర్భంగా పది రోజులకు పైగా సెలవులు రావడంతో ఏపీకి చెందిన వారు కుటుంబ సమేతంగా తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇలా వెళ్తున్న వారికి ప్రైవేటు ఆపరేటర్లు చుక్కలు చూపిస్తున్నారు. ఆన్లైన్లో ఫిల్ ఆర్టీసీతో పోటీ పడుతూ ప్రైవేటు ఆపరేటర్లు సైతం అధికారికంగా పండగ బస్సులకు 50 శాతం టిక్కెట్టు ధరలను పెంచారు. రెగ్యులర్‌గా నడిచే సర్వీసులను సైతం స్పెషల్ కోటాకి మార్చేశారు. అంతటితో ఆగలేదు.. ఆన్లైన్లో నామ్ కే వాస్తేగా కొన్ని సీట్లు మాత్రమే అమ్ముతూ.. బస్ ఫుల్ అయ్యిందంటూ కలరింగ్ ఇస్తున్నారు. దీంతో ఎలాగైనా సొంతూరికి వెళ్లాలి అనుకునే వారు ఆయా ప్రైవేట్ ఆపరేటర్స్ ఆఫీసులకు టిక్కెట్ల కోసం వెళ్తున్నారు. ఆఫ్‌లైన్‌లో బాదుడు ప్రైవేటు ఆపరేటర్లు దాదాపు ప్రతీ బస్సులు పది నుంచి పదిహేను సీట్ల వరకు బ్లాక్ చేసి ఉంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆన్లైన్లో కాకుండా ఆఫ్‌లైన్‌లో వెళ్లి టిక్కెట్ బుక్ చేసుకోవాలంటే 50 శాతం అదనపు ఛార్జీలతో పాటు ఎక్స్ట్రా అమౌంట్ కూడా చెల్లించాల్సి వస్తుంది. అప్పుడే సీటు గ్యారెంటీ లేదంటే లేనట్టే. విజయవాడకి వెళ్లేందుకు టిక్కెట్ ఛార్జీకి అదనంగా రూ. 800 చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. చదవండి : దసరాకు 4 వేల ఆర్టీసీ బస్సులు -
ప్రైవేటు చేతుల్లోకి విద్యుత్ పంపిణీ రంగం!
సాక్షి, హైదరాబాద్: ‘టెలికం రంగం తరహాలో విద్యుత్ పంపిణీ రంగాన్ని డీ లైసెన్స్డ్ చేస్తున్నాం. ప్రస్తుతమున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు అలాగే ఉంటాయి. విద్యుత్ పంపిణీ వ్యవస్థ (వైర్లు) నిర్వహణ డిస్కంల పరిధిలోనే ఉంటుంది. డిస్కంలకు పోటీగా ఎవరైనా ప్రైవేటు ఆపరేటర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టుకోవచ్చు. వీళ్లు ఎవరి నుంచైనా విద్యుత్ కొనుగోలు చేసి ఎవరికైనా అమ్ముకోవచ్చు. డిస్కంల వైర్లను వాడుకుని తమ వినియోగదారులకు విద్యుత్ అమ్ముకుంటారు. దీంతో విద్యుత్ పంపిణీ రంగంలో డిస్కంల గుత్తాధిపత్యం కనుమరుగవుతుంది..’అని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ పేర్కొన్నారు. విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లు–2020పై బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల విద్యుత్ శాఖ కార్యదర్శులు, విద్యుత్ సంస్థల సీఎండీలతో మాట్లాడారు. ‘ప్రైవేటు ఆపరేటర్లతో పోటీ పడి వినియోగదారులకు డిస్కంలు విద్యుత్ పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఎవరు తక్కువ ధరకు అమ్మితే వినియోగదారులు వారి వద్ద విద్యుత్ కొంటారు. పోటీతో వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్ లభిస్తుంది..’అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ‘ఇకపై డిస్కంలు రెండు రకాల వ్యాపారాలు చేయాలి. వినియోగదారులకు విద్యుత్‌ను అమ్ముకోవడంతో పాటు ప్రైవేటు ఆపరేటర్లతో వైర్ల వ్యాపారం చేయాలి. ప్రైవేటు ఆపరేటర్ల నుంచి విద్యుత్ కొనుగోలు చేసే వినియోగదారులపై డిస్కంలు విధించే వీలింగ్ చార్జీలు.. తమ సొంత వినియోగదారులతో సమానంగా ఉండాలి. వివక్షకు ఆస్కారం ఉండదు. ఫలాన వారికి వైర్లు ఇవ్వబోమని డిస్కంలు చెప్పడానికి వీల్లేదు..’అని ఆర్కే తెలిపారు. క్రాస్ సబ్సిడీ కోసం సెంట్రల్ ఫండ్.. ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్యం, రైల్వే తదితర కేటగిరీల వినియోగదారులపై అధిక విద్యుత్ చార్జీలు విధించి, వ్యవసాయం, గృహ వినియోగదారులకు సబ్సిడీ విద్యుత్‌ను డిస్కంలు పంపిణీ చేస్తున్నాయి. దీనిని క్రాస్ సబ్సిడీ అంటారు. విద్యుత్ టారీఫ్‌లో క్రాస్ సబ్సిడీని కొనసాగించడానికి ‘యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్’పేరుతో ప్రత్యేక ఫండ్ పెట్టనున్నామని ఆర్కే సింగ్ తెలిపారు. అదనంగా వసూలు చేసే మొత్తాన్ని ఈ ఫండ్‌లో జమా చేసి సబ్సిడీ వినియోగదారులకు ఇస్తామన్నారు. ఈ ఫండ్ కేంద్రం పరిధిలో ఉంటుందని వెల్లడించారు. అదనపు చార్జీలు వచ్చే ప్రాంతంలోని ఆపరేటర్లకు లాభాలు, సబ్సిడీ వినియోగదారులున్న ప్రాంతాల్లోని ఆపరేటర్లకు నష్టాలు రావచ్చు. లాభాల్లో ఉన్న ఆపరేటర్ నుంచి అదనపు చార్జీలను ఈ ఫండ్‌లో జమ చేసి నష్టాల్లో ఉండే ఆపరేటర్లకు బదిలీ చేస్తామని ఆయన వివరించారు. లాభాలు వచ్చే ప్రాంతాలను ఆపరేటర్లు ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉండదని, జిల్లాల వారీగా వారికి కేటాయింపులు చేస్తామని ఆయన తెలిపినట్టు సమాచారం. పీపీఏలన్నీ పంచుకోవాలి.. ‘ప్రస్తుతం డిస్కంలు చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందా (పీపీఏ) లను తమ వద్దే పెట్టుకోవాలంటే అన్నింటిని పెట్టుకోవాలి. లేకుంటే ప్రైవేటు ఆపరేటర్లతో అన్నింటిని పంచుకోవాలి. అధిక విద్యుత్ ధరలు కలిగిన పీపీఏలను ప్రైవేటు ఆపరేటర్లకు వదులుకుని తక్కువ ధరలు కలిగిన వాటిని తమ వద్దే పెట్టుకుంటామంటే కుదరదు.. డిస్కంలు పీపీఏలను పంచుకోవడానికి ముందుకురాకుంటే ప్రైవేటు ఆపరేటర్లు కొత్త పీపీఏలు చేసుకుంటారు..’అని ఆర్కే సింగ్ వెల్లడించారు. ప్రైవేటు గుత్తాధిపత్యానికి నో చాన్స్.. భవిష్యత్తులో ప్రైవేటు ఆపరేటర్లందరినీ ఓ ప్రైవేటు కంపెనీ కొనేసి ప్రైవేటు గుత్తాధిపత్యానికి తెరతీయడానికి అవకాశం ఇవ్వకుండా విద్యుత్ బిల్లులో ఏమైనా రక్షణ కల్పిస్తారా? అని రాష్ట్రాల అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. ఎవరు తక్కువ ధరకు విద్యుత్ అమ్మితే వినియోగదారులు వారి వద్ద కొంటారని, ప్రైవేటు గుత్తాధిపత్యానికి అవకాశం ఉండదని కేంద్రమంత్రి స్పష్టం చేసినట్టు తెలిసింది. వినియోగదారులు తక్కువ ధరకు విద్యుత్ ఇచ్చే కంపెనీకి మారితే వారికి అదే మీటర్ కొనసాగిస్తారా? విద్యుత్ చౌర్యానికి ఎవరు బాధ్యులు? కేసులెవరు పెట్టాలి? మీటర్ రీడింగ్ ఎవరు తీస్తారు? మీటర్లను ఎవరు నిర్వహిస్తారు? అన్న అంశాలపై పరిశీలన చేస్తామని కేంద్రమంత్రి బదులిచ్చినట్టు తెలిసింది. అప్పీలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ (అప్టెల్) ప్రాంతీయ బెంచ్‌ను దక్షిణాదిలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలు కోరాయి. మరి ఉద్యోగుల పరిస్థితేంటి?: ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ విద్యుత్ సవరణ బిల్లు–2020ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర మంత్రి వర్గం చేసిన తీర్మానికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు కేంద్రమంత్రికి తెలియజేశారు. తెలంగాణ డిస్కంలలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్నారని, ప్రైవేటు ఆపరేటర్లకు అనుమతిస్తే వారి గతేంటని ఆయన కేంద్రమంత్రిని ప్రశ్నించారు. ప్రస్తుతం మీటర్ రీడింగ్ నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేయడం వరకు అన్ని పనులు ప్రైవేటు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే చేస్తున్నారని కేంద్రమంత్రి బదులిచ్చినట్టు తెలిసింది. ప్రైవేటు ఆపరేటర్లతో విద్యుత్ ఉద్యోగులపై ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రైవేటు ఆపరేటర్లతో వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని, ప్రస్తుత ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అక్కడికి వెళ్తారని ఆయన చెప్పినట్టు సమాచారం. తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు నిబంధన ఆచరణలో తెలంగాణకు సాధ్యం కాదని, ఈ విషయంలో జరిమానా విధించాలన్న యోచనను వెనక్కి తీసుకోవాలని ప్రభాకర్‌రావు కేంద్రమంత్రి ఆర్కే సింగ్‌ను కోరారు. ఈ విషయంపై పరిశీలన చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిసింది. -
‘ఆరోగ్యసేతు గోప్యతపై అనుమానం’
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో భారీగా డౌన్లోడ్ అవుతున్న యాప్ ఆరోగ్యసేతు ‘గోప్యత’పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనుమానం వ్యక్తంచేశారు. సర్వేలైన్స్ విధానం కలిగిన ఈ యాప్ ప్రస్తుతం ప్రైవేట్ ఆపరేటర్ చేతుల్లో ఉందని, ఈ నేపథ్యంలో యాప్ గోప్యతపై అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. మనలను మనం సురక్షితంగా ఉంచుకోవడం కోసం టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చని, అయితే ప్రజల అనుమతి లేకుండా వారిని ట్రాక్ చేస్తారన్న భయం రాకుండా చూసుకోవాల్సి ఉందన్నారు. -
సర్వర్ డౌన్ వెనుక ‘రద్దీ’ కుట్ర!
సాక్షి, హైదరాబాద్: ఎక్కడ చూసినా సంక్రాంతి హడావుడి. ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిట.. టికెట్ల కోసం ప్రయాణికుల ఉరుకులు పరుగులు. సంవత్సరం పొడవునా వచ్చే ఆదాయం ఒక ఎత్తయితే, సంక్రాంతి వేళ సమకూరే మొత్తం మరో ఎత్తు. ఈ సీజన్‌ను ఆర్టీసీ ‘గోల్డెన్ టైం’గా భావిస్తుంది. ఇలాంటి కీలక తరుణంలో ఆర్టీసీ ఆన్లైన్ చేతులెత్తేసింది. రద్దీ తీవ్రంగా ఉండే జనవరి 13, 14, 15 తేదీల్లో ఆర్టీసీ సర్వర్ కాస్తా ఢమాల్ అయింది. భారీగా ఆదాయం కోల్పోయింది. కీలక సమయాల్లో సర్వర్ షట్‌డౌన్ అవడం గతంలోనూ జరిగింది. ఆర్టీసీ బస్సెక్కాల్సిన ప్రయాణికులను తమవైపు తిప్పుకునే క్రమంలో ప్రైవేటు ఆపరేటర్లు కుట్ర చేసి ఉంటారనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. టికెట్ బుక్ చేసుకుందామని వెబ్సైట్ తెరిస్తే ‘దిస్ సైట్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్’ అన్న అక్షరాలు ప్రయాణికులను వెక్కిరించాయి. బస్సులో సీటు దొరకడమే గగనం అనుకునే వేళ టాప్ పైన కూడా కూర్చుని ప్రయాణించేందుకు ఆరాటపడుతున్న వేళ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులు ఖాళీ సీట్లతో బయలుదేరాల్సి వచ్చింది. ప్రీమియం కేటగిరీ బస్సులైన ‘గరుడ’ల్లో కూడా ప్రయాణికుల కోసం సిబ్బంది ‘హైదరాబాద్... హైదరాబాద్’ అంటూ పిలవాల్సి వచ్చింది. ఇదంతా సర్వర్ కుప్పకూలిన ఫలితం. రద్దీతో చాలినన్ని బస్సులు లేక చివరకు సిటీ బస్సులను కూడా ‘స్పెషల్’ బోర్డుతో నడిపే సమయంలో ఆన్లైన్ టికెట్ రిజర్వ్ చేసుకునే వెసులుబాటున్న కొన్ని బస్సుల్లోనూ సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. హైదరాబాద్ నుంచి 22 లక్షల మందికిపైగా ఆంధ్ర ప్రయాణికులు సొంతూళ్లకు బయలుదేరుతుంటే అదనపు బస్సులు నడపక విమర్శలపాలైన టీఎస్ఆర్టీసీ తుదకు ఆన్లైన్ రిజర్వేషన్ విషయంలోనూ చేతులెత్తేసింది. పండుగ మూడు రోజుల పాటు సర్వర్ పనిచేయకపోవడంతో లక్షల రూపాయల ఆదాయాన్ని నష్టపోయింది. సీట్లు రిజర్వ్ అయ్యేకొద్దీ అదనపు బస్సులెన్ని నడపాలనే విషయంలో అధికారులు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారు. టీఎస్ఆర్టీసీవెబ్సైట్ పనిచేయకపోవటంతో చాలా రూట్లలో పరిస్థితిని అధికారులు అంచనా వేయలేకపోయారు.పండగ కోసం సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి శనివారం గమ్యస్థానాలకు వెళ్లే వరకు కూడా సర్వర్ చికాకు పెట్టింది. అప్పుడప్పుడు పనిచేస్తూ తిరిగి షట్‌డౌన్ అవుతుండటంతో ఆర్టీసీ కౌంటర్లలో కూడా టికెట్లు జారీ చేయటం ఇబ్బందిగా మారింది. ప్రయాణికులు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆశ్రయించారు. అనుమానాలెన్నో... గత దసరా పండగ వేళ, గత సంవత్సరం సంక్రాంతి సమయంలో కూడా ఇదే సమస్య తలెత్తింది. డిపో మేనేజర్లు విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటం, రద్దీ క్లియర్ అయిన తర్వాత సర్వర్ పనిచేయడం.. వె రసి ఈ సమస్యపై డిపో మేనేజర్లలో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆన్లైన్ రిజర్వేషన్ కోసం ఎక్కువ ఎగబడ్డ ఫలితంగానే సర్వర్‌లో సమస్య వచ్చి ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. కానీ, అదే రద్దీ ప్రైవేటు ఆపరేటర్ల సర్వర్‌పై ఉన్నా అక్కడేం సమస్య రాకపోవడమే అనుమానాలకు కారణమవుతోంది. శనివారం రాత్రి వరకు కూడా అసలు సమస్యకు కారణమేంటనే విషయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులకు స్పష్టత లేదు. లోడ్ పెరిగి షట్‌డౌన్ అయిందనే పేర్కొంటున్నారు. ఇది సరికాదని కొందరు డిపోమేనేజర్లు ఆరోపిస్తున్నారు. -
ప్రైవేటు దోపిడీ
ఒంగోలు క్రైం : ఆర్టీసీ సమ్మె..ప్రైవేటు ఆపరేటర్లకు వరంలా మారింది. జిల్లా నుంచి వివిధ నగరాలకు ప్రయాణిస్తున్న వారి నుంచి అధిక చార్జీల రూపంలో నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మె చేపట్టడంతో ప్రైవేటు ఆపరేటర్లకు అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేసేందుకు మంచి అవకాశం దక్కింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు ప్రైవేటు ఆపరేటర్లు వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె రూపంలో ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు కనకవర్షం కురిపిస్తున్నారు. గతంలో ఉన్న చార్జీల స్థానంలో నూరు శాతం ఎక్కువ చేసి రెట్టింపు మొత్తంలో వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారు. జిల్లా నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు నగరాలతో పాటు పలు నగరాలకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు నడుస్తున్నాయి. అదే అదనుగా చేసుకుని ప్రయాణికుల అవసరాన్ని ఆసరా చేసుకుని ముక్కుపిండి చార్జీలు వసూలు చేస్తున్నారు. గతంలో ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే రూ.300 నుంచి రూ.350 వసూలు చేసేవారు. అయితే ఇటీవల ట్రాన్స్‌పోర్టు డ్యూటీని పెంచడంతో రూ.350 ఉన్న బస్స చార్జీని రూ.450 నుంచి రూ.500 చేశారు. తాజాగా సమ్మె నేపథ్యంలో రూ.800 నుంచి రూ.1100 వరకు వసూలు చేస్తున్నారు. జిల్లా నుంచి, జిల్లా మీదుగా 40 నుంచి 60 వరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వివిధ నగరాలకు ప్రయాణీకులను చేరవేస్తున్నాయి. అదే విధంగా ఒంగోలు నుంచి విశాఖపట్నంకు గతంలో రూ.700 నుంచి రూ.800 వరకు వసూలు చేసేవారు. అలాంటిది ప్రస్తుతం రూ.1,100 నుంచి రూ.1,400 వరకు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. అదేమని అడిగితే బస్సుల్లో సీట్లు ఖాళీ లేవని చెబుతున్నారు. దీంతో ప్రయాణికులు తప్పనిసరై వారు అడిగినంత చెల్లిస్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాల శాఖ మంత్రి శిద్దా రాఘవరావు సొంత జిల్లా అయినప్పటికీ ప్రైవేట్ ఆపరేటర్ల అక్రమ వసూళ్లకు ముక్కుతాడు వేసే పరిస్థితి లేకుండా పోయిందంటే ప్రైవేట్ ఆపరేటర్ల దందాలు ఏ స్థాయిలో ఉన్నాయో అట్టే అర్థమవుతోంది. -
సంక్రాంతికి 2,835 అదనపు బస్సులు
ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 2,835 అదనపు బస్సులు నడుపుతున్నట్టు రాష్ట్ర రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు మంగళవారం తెలిపారు. ప్రైవేటు ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అదనపు బస్సుల పేరుతో ప్రభుత్వమే 50 శాతం చార్జీలు అదనంగా వసూలు చేస్తోందన్న ప్రశ్నకు, ఒక్కపైసా కూడా ఎక్కువ వసూలు చేయట్లేదని బదులిచ్చారు. -
రైలు టిక్కెట్ల జారీకి ప్రైవేట్ ఆపరేటర్లు
-
కేసుల సందట్లో కాసుల కక్కుర్తి..!
వోల్వో బస్సు ప్రమాదాల నేపథ్యం రవాణా శాఖ కేసులు.. దాదాపు 1000 బస్సులు సీజ్ ఇదే అదనుగా ప్రైవేటు ఆపరేటర్లతో ప్రభుత్వ పెద్ద బేరసారాలు! కనీసం రూ.8 కోట్లు ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్ - సాక్షి ప్రధాన ప్రతినిధి: క్షణాల్లోనే మనుషుల్ని బూడిద కుప్పలుగా మార్చేసిన మొన్నటి వోల్వో బస్సు ప్రమాదం గుర్తొస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కానీ శవాలపై కాసులు ఏరుకున్న చందంగా... ప్రభుత్వ పెద్ద ఒకరు ఆ దారుణ ప్రమాదాన్ని అవకాశంగా తీసుకుని ప్రైవేటు బస్సు ఆపరేటర్ల వద్ద భారీగా సొమ్ము వసూలు చేసుకునే బెదిరింపు బేరాల్లో నిమగ్నమయ్యారు! కఠినంగా వ్యవహరిస్తూ, అక్రమ బస్సులను నియంత్రించాల్సిన పెద్దలే నోట్ల కట్టలపై ఆశతో ప్రయాణికుల భద్రతను పణంగా పెడుతున్నారు. అయితే ఈ ప్రభుత్వం ఎన్నిరోజులు ఉంటుందో తెలియని అనిశ్చిత స్థితిలో ఆ పెద్దలు అడిగినంత భారీగా సొమ్ము చెల్లించడమెందుకనే భావనతో ఆపరేటర్లు కూడా మొరాయిస్తున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన దుర్ఘటన తరువాత కర్ణాటకలో సైతం వోల్వో బస్సు ప్రమాదం ఒకటి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రవాణా శాఖ ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1000 బస్సులను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నట్లు కనిపెట్టి సీజ్ చేశారు. 1396 కేసులు నమోదు చేశారు. అందులో దాదాపు 600 వరకూ వోల్వో బస్సులే ఉండటం గమనార్హం. వీటిలో పేరున్న ట్రావెల్ సంస్థల బస్సులు కూడా ఉన్నాయి. పర్మిట్ తీసుకున్న నంబర్‌తోనే రెండు, మూడు బస్సులను అనధికారికంగా, అక్రమంగా ప్రైవేటు బస్సు ఆపరేటర్లు తిప్పుతుంటారనేది రవాణా శాఖ వర్గాలకు బాగా తెలిసిన విషయమే. అయినా ఇటీవలి ప్రమాదాల నేపథ్యంలో తనిఖీలతో పట్టుబడిన వాహనాలకు స్వల్ప జరిమానాలు విధించి తిరిగి జనం మధ్యకు వదలడానికి, చూసీచూడనట్లుగా వ్యవహరించటానికి రూ.12 కోట్లతో పెద్దలు బేరాన్ని మొదలు పెట్టినట్లు సమాచారం. ఒక దశలో బస్సుకు రూ.15 వేల చొప్పున డిమాండ్ చేసినట్లు తెలిసింది. కానీ రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఎన్నిరోజులు ఉంటుందో తెలియని స్థితిలో అంత భారీగా సొమ్ము చెల్లించి ప్రయోజనం ఏమిటనే భావన పలువురు ఆపరేటర్లలో నెలకొంది. దీంతో రూ.2 కోట్ల చెల్లింపునకు మాత్రమే వారు సిద్ధపడ్డారనీ, చివరకు ఆ ప్రభుత్వ పెద్దలు రూ.8 కోట్లకు దిగివచ్చినా ఆపరేటర్లు మాత్రం రూ.3 కోట్లకు మించి చెల్లించేది లేదంటూ భీష్మించుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీల వెన్నుదన్ను ఉన్న ఒకరిద్దరు మెగా ఆపరేటర్లు ఒక్క పైసా ఇవ్వబోమని, ప్రభుత్వం ఇలాగే కేసులతో వేధిస్తే బస్సులను కొంతకాలంపాటు పూర్తిగా నిలిపేస్తామని ఎదురు బెదిరింపులకు దిగినట్లు తెలిసింది. మరోవైపు ఆ ప్రభుత్వ పెద్దకు మరింత అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు గాను... ఈ వ్యవహారం తేలేవరకూ వేచి చూద్దామనే భావనతో అక్రమంగా నడిచే బస్సులను ప్రస్తుతానికి ఆపరే టర్లు నిలిపేశారు. దాదాపు 600 బస్సులను కోర్టులకు వెళ్లి విడిపించుకున్నారు. ఇక రాష్ట్రం పెడుతున్న చిన్నాచితకా కేసులకు వెరిచి కర్ణాటక, తమిళనాడులకు చెందిన ఒకరిద్దరు పెద్ద ఆపరేటర్లు మొత్తం టికెట్ల బుకింగ్‌నే నిలిపేసి, రాష్ట్రానికి సర్వీసులు ఆపేశారు. సీజ్ చేసిన బస్సులు, ఆపరేటర్లు కావాలని నిలిపేసిన ట్రిప్పుల కారణంగా దూరప్రయాణాలకు సంబంధించి కొంతవరకు బస్సుల కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకోవడంలో ఆర్టీసీ వైఫల్యం కారణంగా ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. మరోవైపు ఆ ప్రభుత్వ పెద్ద పట్టువిడవకుండా చిన్న, మధ్యతరహా ప్రైవేటు ఆపరేటర్ల నుంచి వసూళ్లకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.