సర్వర్ డౌన్ వెనుక ‘రద్దీ’ కుట్ర! | Telangana RTC Server Down in festival time | Sakshi
Sakshi News home page

సర్వర్ డౌన్ వెనుక ‘రద్దీ’ కుట్ర!

Published Sun, Jan 17 2016 3:19 AM | Last Updated on Fri, Jul 6 2018 3:36 PM

సర్వర్ డౌన్ వెనుక ‘రద్దీ’ కుట్ర! - Sakshi

సర్వర్ డౌన్ వెనుక ‘రద్దీ’ కుట్ర!

సాక్షి, హైదరాబాద్: ఎక్కడ చూసినా సంక్రాంతి హడావుడి. ప్రయాణికులతో బస్టాండ్లు కిటకిట.. టికెట్ల కోసం ప్రయాణికుల ఉరుకులు పరుగులు. సంవత్సరం పొడవునా వచ్చే ఆదాయం ఒక ఎత్తయితే, సంక్రాంతి వేళ సమకూరే మొత్తం మరో ఎత్తు. ఈ సీజన్‌ను ఆర్టీసీ ‘గోల్డెన్ టైం’గా భావిస్తుంది. ఇలాంటి కీలక తరుణంలో ఆర్టీసీ ఆన్‌లైన్ చేతులెత్తేసింది. రద్దీ తీవ్రంగా ఉండే జనవరి 13, 14, 15 తేదీల్లో ఆర్టీసీ సర్వర్ కాస్తా ఢమాల్ అయింది. భారీగా ఆదాయం కోల్పోయింది. కీలక సమయాల్లో సర్వర్ షట్‌డౌన్ అవడం గతంలోనూ జరిగింది.

ఆర్టీసీ బస్సెక్కాల్సిన ప్రయాణికులను తమవైపు తిప్పుకునే క్రమంలో ప్రైవేటు ఆపరేటర్లు కుట్ర చేసి ఉంటారనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. టికెట్ బుక్ చేసుకుందామని వెబ్‌సైట్ తెరిస్తే ‘దిస్ సైట్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్’ అన్న అక్షరాలు ప్రయాణికులను వెక్కిరించాయి.     
 బస్సులో సీటు దొరకడమే గగనం అనుకునే వేళ టాప్ పైన కూడా కూర్చుని ప్రయాణించేందుకు ఆరాటపడుతున్న వేళ బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ బస్సులు ఖాళీ సీట్లతో బయలుదేరాల్సి వచ్చింది.

ప్రీమియం కేటగిరీ బస్సులైన ‘గరుడ’ల్లో కూడా ప్రయాణికుల కోసం సిబ్బంది ‘హైదరాబాద్... హైదరాబాద్’ అంటూ పిలవాల్సి వచ్చింది. ఇదంతా సర్వర్ కుప్పకూలిన ఫలితం. రద్దీతో చాలినన్ని బస్సులు లేక చివరకు సిటీ బస్సులను కూడా ‘స్పెషల్’ బోర్డుతో నడిపే సమయంలో ఆన్‌లైన్ టికెట్ రిజర్వ్ చేసుకునే వెసులుబాటున్న కొన్ని బస్సుల్లోనూ సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. హైదరాబాద్ నుంచి 22 లక్షల మందికిపైగా ఆంధ్ర ప్రయాణికులు సొంతూళ్లకు బయలుదేరుతుంటే అదనపు బస్సులు నడపక విమర్శలపాలైన టీఎస్‌ఆర్టీసీ తుదకు ఆన్‌లైన్ రిజర్వేషన్ విషయంలోనూ చేతులెత్తేసింది.

పండుగ మూడు రోజుల పాటు సర్వర్ పనిచేయకపోవడంతో లక్షల రూపాయల ఆదాయాన్ని నష్టపోయింది. సీట్లు రిజర్వ్ అయ్యేకొద్దీ అదనపు బస్సులెన్ని నడపాలనే విషయంలో అధికారులు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారు. టీఎస్‌ఆర్టీసీవెబ్‌సైట్ పనిచేయకపోవటంతో చాలా రూట్లలో పరిస్థితిని అధికారులు అంచనా వేయలేకపోయారు.పండగ కోసం సొంతూళ్లకు వెళ్లిన వారు తిరిగి శనివారం గమ్యస్థానాలకు వెళ్లే వరకు కూడా సర్వర్ చికాకు పెట్టింది. అప్పుడప్పుడు పనిచేస్తూ తిరిగి షట్‌డౌన్ అవుతుండటంతో ఆర్టీసీ కౌంటర్లలో కూడా టికెట్లు జారీ చేయటం ఇబ్బందిగా మారింది. ప్రయాణికులు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఆశ్రయించారు.
 
అనుమానాలెన్నో...
గత దసరా పండగ వేళ, గత సంవత్సరం సంక్రాంతి సమయంలో కూడా ఇదే సమస్య తలెత్తింది. డిపో మేనేజర్లు విషయాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయటం, రద్దీ క్లియర్ అయిన తర్వాత సర్వర్ పనిచేయడం.. వె రసి ఈ సమస్యపై డిపో మేనేజర్లలో అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఆన్‌లైన్ రిజర్వేషన్ కోసం ఎక్కువ ఎగబడ్డ ఫలితంగానే సర్వర్‌లో సమస్య వచ్చి ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. కానీ, అదే రద్దీ ప్రైవేటు ఆపరేటర్ల సర్వర్‌పై ఉన్నా అక్కడేం సమస్య రాకపోవడమే అనుమానాలకు కారణమవుతోంది. శనివారం రాత్రి వరకు కూడా అసలు సమస్యకు కారణమేంటనే విషయంలో ఆర్టీసీ ఉన్నతాధికారులకు స్పష్టత లేదు. లోడ్ పెరిగి షట్‌డౌన్ అయిందనే పేర్కొంటున్నారు. ఇది సరికాదని కొందరు డిపోమేనేజర్లు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement