కేసుల సందట్లో కాసుల కక్కుర్తి..! | leaders ask private volvo operators for a bribe of Rs. 8 crore! | Sakshi
Sakshi News home page

కేసుల సందట్లో కాసుల కక్కుర్తి..!

Published Wed, Nov 27 2013 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM

leaders ask private volvo operators for a bribe of Rs. 8 crore!

వోల్వో బస్సు ప్రమాదాల నేపథ్యం
రవాణా శాఖ కేసులు..
దాదాపు 1000 బస్సులు సీజ్
ఇదే అదనుగా ప్రైవేటు ఆపరేటర్లతో ప్రభుత్వ పెద్ద బేరసారాలు!
కనీసం రూ.8 కోట్లు ఇవ్వాలని డిమాండ్
 
హైదరాబాద్ - సాక్షి ప్రధాన ప్రతినిధి:

క్షణాల్లోనే మనుషుల్ని బూడిద కుప్పలుగా మార్చేసిన మొన్నటి వోల్వో బస్సు ప్రమాదం గుర్తొస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కానీ శవాలపై కాసులు ఏరుకున్న చందంగా... ప్రభుత్వ పెద్ద ఒకరు ఆ దారుణ ప్రమాదాన్ని అవకాశంగా తీసుకుని ప్రైవేటు బస్సు ఆపరేటర్ల వద్ద భారీగా సొమ్ము వసూలు చేసుకునే బెదిరింపు బేరాల్లో నిమగ్నమయ్యారు! కఠినంగా వ్యవహరిస్తూ, అక్రమ బస్సులను నియంత్రించాల్సిన పెద్దలే నోట్ల కట్టలపై ఆశతో ప్రయాణికుల భద్రతను పణంగా పెడుతున్నారు. అయితే ఈ ప్రభుత్వం ఎన్నిరోజులు ఉంటుందో తెలియని అనిశ్చిత స్థితిలో ఆ పెద్దలు అడిగినంత భారీగా సొమ్ము చెల్లించడమెందుకనే భావనతో ఆపరేటర్లు కూడా మొరాయిస్తున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన దుర్ఘటన తరువాత కర్ణాటకలో సైతం వోల్వో బస్సు ప్రమాదం ఒకటి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రవాణా శాఖ ఉన్నతాధికారులు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1000 బస్సులను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నట్లు కనిపెట్టి సీజ్ చేశారు. 1396 కేసులు నమోదు చేశారు. అందులో దాదాపు 600 వరకూ వోల్వో బస్సులే ఉండటం గమనార్హం. వీటిలో పేరున్న ట్రావెల్ సంస్థల బస్సులు కూడా ఉన్నాయి. పర్మిట్ తీసుకున్న నంబర్‌తోనే రెండు, మూడు బస్సులను అనధికారికంగా, అక్రమంగా ప్రైవేటు బస్సు ఆపరేటర్లు తిప్పుతుంటారనేది రవాణా శాఖ వర్గాలకు బాగా తెలిసిన విషయమే.
 
అయినా ఇటీవలి ప్రమాదాల నేపథ్యంలో తనిఖీలతో పట్టుబడిన వాహనాలకు స్వల్ప జరిమానాలు విధించి తిరిగి జనం మధ్యకు వదలడానికి, చూసీచూడనట్లుగా వ్యవహరించటానికి రూ.12 కోట్లతో పెద్దలు బేరాన్ని మొదలు పెట్టినట్లు సమాచారం. ఒక దశలో బస్సుకు రూ.15 వేల చొప్పున డిమాండ్ చేసినట్లు తెలిసింది. కానీ రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఎన్నిరోజులు ఉంటుందో తెలియని స్థితిలో అంత భారీగా సొమ్ము చెల్లించి ప్రయోజనం ఏమిటనే భావన పలువురు ఆపరేటర్లలో నెలకొంది. దీంతో రూ.2 కోట్ల చెల్లింపునకు మాత్రమే వారు సిద్ధపడ్డారనీ, చివరకు ఆ ప్రభుత్వ పెద్దలు రూ.8 కోట్లకు దిగివచ్చినా ఆపరేటర్లు మాత్రం రూ.3 కోట్లకు మించి చెల్లించేది లేదంటూ భీష్మించుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీల వెన్నుదన్ను ఉన్న ఒకరిద్దరు మెగా ఆపరేటర్లు ఒక్క పైసా ఇవ్వబోమని, ప్రభుత్వం ఇలాగే కేసులతో వేధిస్తే బస్సులను కొంతకాలంపాటు పూర్తిగా నిలిపేస్తామని ఎదురు బెదిరింపులకు దిగినట్లు తెలిసింది.
 
మరోవైపు ఆ ప్రభుత్వ పెద్దకు మరింత అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు గాను... ఈ వ్యవహారం తేలేవరకూ వేచి చూద్దామనే భావనతో అక్రమంగా నడిచే బస్సులను ప్రస్తుతానికి ఆపరే టర్లు నిలిపేశారు. దాదాపు 600 బస్సులను కోర్టులకు వెళ్లి విడిపించుకున్నారు. ఇక రాష్ట్రం పెడుతున్న చిన్నాచితకా కేసులకు వెరిచి కర్ణాటక, తమిళనాడులకు చెందిన ఒకరిద్దరు పెద్ద ఆపరేటర్లు మొత్తం టికెట్ల బుకింగ్‌నే నిలిపేసి, రాష్ట్రానికి సర్వీసులు ఆపేశారు. సీజ్ చేసిన బస్సులు, ఆపరేటర్లు కావాలని నిలిపేసిన ట్రిప్పుల కారణంగా దూరప్రయాణాలకు సంబంధించి కొంతవరకు బస్సుల కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకోవడంలో ఆర్టీసీ వైఫల్యం కారణంగా ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. మరోవైపు ఆ ప్రభుత్వ పెద్ద పట్టువిడవకుండా చిన్న, మధ్యతరహా ప్రైవేటు ఆపరేటర్ల నుంచి వసూళ్లకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement