సమ్మెట పోటు..
స్తంభించిన సరకు రవాణా...
ఎక్కడికక్కడ నిలిచిన లారీలు..ట్యాంకర్లు
లక్షలాది కార్మికుల జీవనోపాధికి గండి
తొలిరోజే రూ.20కోట్లకు పైగా లావాదేవీలకు బ్రేకు
సమ్మెట పోటు మొదలైంది. సరకు రవాణా స్తంభించింది. అఖిలభారత ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ పిలుపుతో లారీలు.. ట్యాంకర్లు.. టిప్పర్లతో సహా సరకు రవాణా వాహనాలు బుధవారం అర్ధరాత్రి నుంచి ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గురువారం ఉదయం ఆరు గంటల తరువాత ఏ ఒక్క వాహనం అడుగు ముందుకేయలేదు. రూ.కోట్లలో లావా దేవీలకు బ్రేకుపడింది. లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధి లేకుండా పోయింది. సమ్మె ప్రభావంతో పలుచోట్ల పెట్రోల్ బంకులు మూత పడగా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ నిత్యావసరాల రవాణాకు ఇబ్బందులు తప్పలేదు.
సాక్షి, విశాఖపట్నం: దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం జిల్లాపరిధిలో భారీవాహనాలకు బ్రేకులు పడ్డాయి. జిల్లాలోని 25,617 సరకు రవాణా వాహనాలతో పాటు వివిధ జిల్లాల నుంచి ఇక్కడకు రాకపోకలు సాగించే మరో 30వేల లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విశాఖ పోర్టు ట్రస్ట్, గంగవరం పోర్టు ఏరియాలతో పాటు ఆటోనగర్, ఇండస్ట్రియల్ ఏరియాల్లో వేలాది వాహనాలు నిలిచి పోయాయి. జాతీయరహదారిపొడవునా రోడ్లకు ఇరువైపులా వందలాదిలారీలు..ట్యాంకర్లు నిలిపివేశారు. వాటిపై పనిచేసే డ్రైవర్లు, క్లీనర్లు, ఇతర సిబ్బంది ఎక్కడికక్కడ రోడ్లపైనే వంటలు వార్పులు చేసుకుంటూ వాహనాల కింద భోజనాలు చేస్తూ గడిపారు. పౌరసరఫరాలశాఖ పరిధిలో సరకు రవాణా చేసే వాహనాలను సైతం ఎక్కడక్కడ నిలిపివేశారు. రేషన్ దుకాణాలకు నిత్యావసరాల తరలింపు నిలిచిపోయింది. పాలు, నీళ్లు, వైద్యం ఇలా అత్యవసర సేవలకు మినహాయింపునివ్వడం ఊరట నిచ్చింది. సమ్మె ప్రభావంతో ఈ రంగంపై ఆధారపడి జీవించే వేలాది మంది కార్మికులతో పాటు ఎగుమతులు, దిగుమతులు వంటి కార్య కలాపాలు నిలిచిపోవడంతో మరో లక్ష మందికి పైగా కార్మికులు ఉపాధికి దూరమయ్యే దుస్థితి దాపురించింది. వీరితో పాటు రాష్ర్ట వ్యాప్తంగా పెట్రోల్ బంకులు సమ్మె బాట పట్టిన ప్పటికీ జిల్లాలో మాత్రం సమ్మెకు దూరంగా ఉన్నారు. అయితే ట్యాంకర్ల సమ్మె కారణంగా స్టాక్ లేక జిల్లాలోని 50కు పైగా బంకులు మూత పడ్డాయి. మరో పక్క గ్రామీణ ప్రాంతాలనుంచి రైతు బజార్లు, మార్కెట్లకు కూరగాయల రవాణాకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా 12 బస్సులను ఏర్పాటు చేసిన ఆర్టీసీ యంత్రాంగం అవసరాన్ని బట్టి పెంచుతామని ప్రకటించింది. తొలి రోజు సామాన్యులకు ఇబ్బందులేకున్నప్పటికీ రూ.వేలకోట్ల లావాదేవీలు జరిగే పోర్టులు, పరిశ్రమలపై ప్రభావం కనబడింది. విశాఖ షిప్పింగ్ లాజిస్టిక్ పరిధిలోనే ఏకంగా వెయ్యికి పైగా టిప్పిర్లు నిలిచిపోయాయి. పోర్టునుంచి రోజు 40వేల మెట్రిక్ టన్నుల బొగ్గును టిప్పర్లు సంబంధిత పరిశ్రమలకు రవాణా చేస్తుంటాయి. టిప్పర్ల సమ్మెతో ఆ మేరకు పరిశ్రమలకు అందాల్సిన ముడిసరకు నిలిచిపోయింది. మరో పక్క విదేశాల నుంచి దిగుమతైన లక్ష మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు విశాఖ పోర్టులో ఉన్నాయి. వీటిని రాష్ర్టంలోని వివిధ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా రవాణా చేయాల్సి ఉంది. సమ్మె ప్రభావం ఎరువుల రవాణాపై పడింది. అలాగే అభివృద్ధి పనులపై కూడా ప్రభావం కనబడింది.
అసలే ఇసుక దొరక్క ఇబ్బందుల పడుతున్న నిర్మాణ రంగంపై లారీల సమ్మె రోకలిపోటుగా మారింది. క్వారీల నుంచి రాళ్లు, ఇసుక, ఇనుము తదితర నిర్మాణ ముడి సరకు నిలిచిపోవడంతో ఆ రంగం మరింత కుదేలయ్యే పరిస్థితి ఏర్పడింది. సమ్మె కారణంగా జిల్లా వ్యాప్తంగా రూ.20కోట్ల మేర లావాదేవీలకు బ్రేకుపడినట్టుగా వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. నిరవధిక సమ్మెలో భాగంగా లారీలు, ట్యాంకర్లు, టిప్పర్ల యజమానులు, కార్మికులు ఎక్కడికక్క నిరసనలు వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కారంపై కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు కచ్చితమైన హామీ లిచ్చేవరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ (ఎఐఎం టీసీ)సభ్యుడు ఎం. జానకిరామ్‌రెడ్డి స్పష్టం చేశారు. అప్పటి వరకు సమ్మె ఆగదన్నారు.