బలవంతపు భూసేకరణ నిలిపివేయాలి
♦ రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానం
♦ భూసేకరణ ఆపేయాలని 21న సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట ధర్నా
విజయవాడ(గాంధీనగర్) : రాజధాని ప్రాంతంలో బలవంతపు భూసేకరణను నిలిపివేయాల్సిందేనని రౌండ్‌టేబుల్ సమావేశం తీర్మానించింది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ‘రాజధాని గ్రామాల్లో భూసేకరణను నిలుపుదల చేయాలి’ అని కోరుతూ రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు సంఘాల ప్రతినిధులు, రాజధాని ప్రాంత రైతులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌కు కాలం చెల్లిందన్నారు. ప్రస్తుతం 2013 భూసేకరణ చట్టం మాత్రమే అమల్లో ఉందన్నారు. అందులో మూడు కీలకాంశాలు ఉన్నాయని తెలిపారు. సామాజిక ప్రభావ అంచనా, 70 శాతం ప్రజల ఆమోదం, మూడు పంటలు పండే భూములు సేకరించరాదని ఆ చట్టంలో స్పష్టం చేసినట్లు వివరించారు.
ఇవేమీ చేయకుండా భూసేకరణ చేపట్టడమం సాధ్యం కాదన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని భయభ్రాంతులకి గురిచేసి బలవంతంగా భూసేకరణ చేస్తోందని విమర్శించారు. తాము బలవంతంగా భూసేకరణ చేయడం లేదని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చెప్పినప్పటికీ వాస్తవంలో అందుకు భిన్నంగా జరుగుతోందన్నారు. బలవంతపు భూసేకరణ నిలిపివేయాలని కోరితే రాజధాని నిర్మాణానికి ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు వ్యతిరేకమని దుష్ర్పచారం చేస్తున్నారని విమర్శించారు. తాము రాజధానికి వ్యతిరేకంకాదన్నారు. అవసరానికి మించి భూముల్ని, అది కూడా మూడు పంటలు పండే భూముల్ని సేకరించడాన్ని వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. దేశంలో మరే ప్రాంతంలోనూ ఇలాంటి మూడుపంటలు పండే భూములు లేవన్నారు. ఫారెస్ట్ భూముల్లో రాజధాని నిర్మాణం చేపట్టాలని కోరారు. అన్ని సంస్థలు ఇక్కడే ఏర్పాటు చేస్తూ మరో వేర్పాటువాద ఉద్యమానికి ప్రభుత్వం ఊతమిస్తోందన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ రాజధాని పేరుతో సీఎం చంద్రబాబు రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. గోల్ఫ్ కోర్టు నిర్మాణానికి భూమిని కేటాయించారని, అది రాజధానిలో భాగమెలా అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటించిన మూడు మాస్టర్ ప్లాన్‌లు మూడు గ్రామాల్లోనే ఉన్నాయి. అటువంటప్పుడు 29గ్రామాలు ఎందుకని ప్రశ్నించారు. 5వేల ఎకరాలలో నిర్మించే రాజధానికి 29 గ్రామాల్లో 53 వేల ఎకరాలలో ల్యాండ్‌ఫూలింగ్‌కు పూనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఆ భూమిని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకేనని మండిపడ్డారు. భూసేకరణను పూర్తిగా అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని పిలుపు ఇచ్చారు. రైతు సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు మాట్లాడుతూ బలవంతపు భూసేకరణకు పాల్పడితే ప్రభుత్వ పునాదులు కదలడం ఖాయమని హెచ్చరించారు. రాజధాని పేరుతో చేస్తున్న భూ కబ్జాలకు మోడీ, వెంకయ్య నాయుడుల ఆమోదం పొందేందుకే చంద్రబాబు ప్రత్యేక హోదా అడగడం లేదన్నారు.
ఉండవల్లి రైతులు బాలాజీ రెడ్డి, బోసురెడ్డిలు మాట్లాడుతూ ప్రభుత్వం 9.2 అభ్యంతరాలపై సమాధానం చెప్పేందుకు భయపడుతుందన్నారు. ఇప్పటికే కోర్టులో అనేక పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు సమావేశం తీర్మానాలు వెల్లడించారు. భూ సేకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 21న సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టాలని తీర్మానించారు. ఈ సమావేశంలో రైతుకూలీ సంఘం నాయకులు సాంబశివరావు, ఆల్‌ఇండియా కిసాన్ ఫ్రంట్ జిల్లా కార్యదర్శి జి.ప్రసాద్, గ్రామీణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సత్యనారాయణ, కేవిపీఎస్ నాయకులు మాల్యాద్రి, రైతుకూలీ సంఘం నాయకులు లక్ష్మారెడ్డి, దడాల సుబ్బారావు, డీవైఎఫ్ నాయకులు సూర్యారావు, జొన్నా శివశంకర్, రాజధాని ప్రాంత నిర్వాసితుల సంఘం కన్వీనర్ రవి తదితరులు పాల్గొన్నారు.