ఎన్ని జీవోలు తెచ్చినా..అడ్డుకుంటాం.. | Innovative protest against land acquisition | Sakshi
Sakshi News home page

ఎన్ని జీవోలు తెచ్చినా..అడ్డుకుంటాం..

Published Sat, May 16 2015 12:52 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

ఎన్ని జీవోలు తెచ్చినా..అడ్డుకుంటాం.. - Sakshi

ఎన్ని జీవోలు తెచ్చినా..అడ్డుకుంటాం..

భూ సేకరణపై వినూత్న నిరసన
ప్రకాశం బ్యారేజీపై కూరగాయలు పంచిన ఎమ్మెల్యే ఆర్కే
రైతులతో కలసి రాస్తారోకో,166 జీవో కాపీ దహనం
ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను ప్రతిఘటించి తీరతామని స్పష్టీకరణ

 
 తాడేపల్లి రూరల్ : లక్షా 66 వేల జీవోలు తెచ్చినా ప్రతిఘటించి తీరతాం...మూడు పంటలు పండే భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటాం...అన్నదాతలకు అండగా ఉంటాం...భూ సమీకరణ, భూ సేకరణ...ఏదైనా అడ్డుకుంటాం...చట్టం కాని ఆర్డినెన్స్‌తో, 166 జీవోతో సీఎం చంద్రబాబు  రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే సహించం. వైఎస్సార్‌సీపీతో నడిచి వచ్చే రాజకీయ పార్టీలతో కలసి, రైతుల పక్షాన పోరాటాలు చేస్తాం...రాజధాని కోసం ప్రభుత్వం భూసేకరణ ఆర్డినెన్స్ ప్రయోగించిన నేపథ్యంలో ఆ ప్రాంత రైతులకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఇచ్చిన భరోసా ఇది.

 భూ సేకరణ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే ఆర్కే నేతృత్వంలో  సీతానగరం ప్రకాశం బ్యారేజి వద్ద శుక్రవారం రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆర్కే కూరగాయలు పంచి తన నిసరన వ్యక్తం చేశారు. రైతులు తమ పంట పొలాల నుంచి స్వచ్ఛందంగా తెచ్చిన కూరగాయలను భారీ స్థాయిలో పంచిపెట్టారు. అనంతరం ప్రకాశం బ్యారేజీ వద్ద రైతులతో కలిసి రాస్తారోకో చేశారు. 166 జీవో కాపీని దహనం చేశారు.

ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పూర్తిగా రైతులను మోసం చేసే విధంగా భూ సమీకరణ, భూ సేకరణ ప్రక్రియలు నిర్వహిస్తుందని విమర్శించారు.  రైతాంగమే లేకుండా చేసేందుకు చట్టరూపం దాల్చని ఆర్డినెన్స్‌తో 166 జీవోను చంద్రబాబు తెచ్చారని మండిపడ్డారు. లక్షా 66 వేల జీవోలు తెచ్చినా, తాము భయపడబోమని స్పష్టం చేశారు. బహుళ పంటలు పండే భూములను ఎట్టిపరిస్థితుల్లో తీసుకోబోనివ్వమని చెప్పారు.

భూసేకరణను తీవ్రంగా ప్రతిఘటించి తీరతామని పేర్కొన్నారు. చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ, రైతులు పండించిన కూరగాయలను ఉచితంగా పంచిపెడుతున్నామన్నారు. ఒకే ప్రాంతంలో రెండు చట్టాలను ఎలా అమలు చేస్తారని, భూసేకరణను విరమించుకుని తీరాలని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రైతులు, వ్యవసాయ కూలీలను పూర్తిగా నష్ట పరిచే చంద్రబాబు ఎత్తుగడలను ముందుకు సాగనివ్వబోమని స్పష్టం చేశారు.

కేంద్రం హడావుడిగా తెచ్చిన ఆర్డినెన్స్‌ను చంద్రబాబు ముందుగా ప్రయోగించేందుకు సిద్ధపడుతున్నారని, హైకోర్టులో దీనిపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిత్యం అన్నదాతలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆర్కే తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకులు జక్కిరెడ్డి ప్రభాకర్, జిల్లా నాయకులు బండారు సాయిబాబా, మొగిలి మధు, పాతూరు లలిత కుమారి, ఈదులమూడి డేవిడ్‌రాజు, దొంతిరెడ్డి వేమారెడ్డి, మున్నంగి గోపిరెడ్డి, తాడేపల్లి మునిసిపల్ చైర్‌పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మి, వైస్‌చైర్మన్ దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి, దుగ్గిరాల జడ్‌పీటీసీ యేళ్ల జయలక్ష్మి, తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల ఎంపీపీలు కత్తిక రాజ్యలక్ష్మి, పచ్చల రత్మకుమారి, చల్లపల్లి భారతీదేవి, తాడేపల్లి పట్టణ, మండల పార్టీ కన్వీనర్లు భీమవరపు సాంబిరెడ్డి, పాటిబండ్ల కృష్ణమూర్తి, కొలనుకొండ సర్పంచ్ పి.ఏసుబాబు, మంగళగిరి నాయకులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మునగాల మల్లేశ్వరరావు, పచ్చల శ్యామ్‌బాబు, తోట శ్రీనివాసరావు, మంగళగిరి మండల పరిషత్ ఉపాధ్యక్షులు మొసలి పకీరయ్య, సీపీఎం నాయకులు జొన్నా శివశంకర్, దొంతిరెడ్డి వెంకటరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఉండవల్లి, పెనుమాక, బేతపూడి, నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం తదితర ప్రాంతాల రైతులు, రైతుకూలీలు, మహిళలు  భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement