నేటి నుంచి రాజధాని గ్రామాల్లో భూసేకరణ
- ప్రభుత్వంపై సర్వత్రా ఆగ్రహం
- ప్రతిఘటించి తీరతామంటున్న రైతులు,కౌలు రైతులు, కూలీలు, విపక్షాలు
- నేడు ప్రకాశం బ్యారేజీ వద్ద నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆర్కే పిలుపు
- అన్ని వర్గాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి
మంగళగిరి/సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాజధాని గ్రామాలపై భూ భూతం విరుచుకుపడుతోంది. ప్రభుత్వం ఆయా గ్రామాల్లో శుక్రవారం నుంచి భూసేకరణ చట్టం అమలుల్లోకి తెచ్చింది. రాజధాని భూ సమీకరణను వ్యతిరేకించిన రైతులపై కక్షకట్టిన ప్రభుత్వం ఎట్టకేలకు భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిందని రైతులు, రైతుకూలీలు, కౌలు రైతుల సహా విపక్షాలు మండిపడుతున్నాయి. శుక్రవారం నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
భూసేకరణకు ఒప్పుకోబోమని అవసరమైతే ఆత్మహత్యలకైనా సిద్ధమని మండిపడుతున్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ఆర్కే ప్రత్యక్షపోరాటానికి నడుం బిగించారు. దీనిపై ఆందోళన చేయడంతో పాటు కోర్టును ఆశ్రయించి రైతులకు న్యాయం జరిగేవరకు అండగా వుంటానని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. దీనిలో భాగంగానే శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగే నిరసన కార్యక్రమానికి రైతులు, కూలీలు, కౌలురైతులతో పాటు రైతు, కార్మిక సంఘాలు విపక్షాలు తరలిరావాలని ఆర్కే పిలుపునిచ్చారు.
కలెక్టర్‌కు సర్వాధికారాలు
నేటి నుంచి రాజధాని గ్రామాల్లో భూ సేకరణ ప్రారంభం కానుంది. భూ సమీకరణ విధానంలో రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం 33,800 ఎకరాలను సమీకరించింది. దీనికితోడు రాజధాని నిర్మాణానికి అదనంగా భూములు కావాలని పట్టణాభివృద్ధి సంస్థ రెవెన్యూ శాఖను కోరడంతో భూసేకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అనేక మంది రైతులు నష్టపరిహారం పెంచాలని, రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయ్యే వరకు సాగుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంగళగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు భూ సేకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేయడంతోపాటు కోర్టులో కేసులు వేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు భూ సేకరణ చట్టం-2013 ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసింది. భూసేకరణకు సంబంధించి జిల్లా కలెక్టర్‌కు సర్వాధికారాలు ఇచ్చింది. శుక్రవారం నుంచి భూమిని సేకరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, బేతపూడి, యర్రపాలెం, కురగల్లు, రాయపూడి, వెంకటపాలెం తదితర గ్రామాల్లోని వెయ్యి ఎకరాల్లోపు భూములను భూ సేకరణ విధానంలో సేకరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైతుల పేర్లు, భూమి విస్తీర్ణం తదితర వివరాలను సీఆర్‌డిఏ కమిషనర్ శ్రీకాంత్ శుక్రవారం వెల్లడించనున్నారు. మూడు వేల ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం భూములను గుర్తించినప్పటికీ గ్రామ కంఠాలు, డొంకలు, దారులు పోనూ రైతుల నుంచి నికరంగా వెయ్యి ఎకరాలను సేకరించే అవకాశం ఉందని జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గురువారం సాయంత్రం ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు.
తీవ్రస్థాయిలో వ్యతిరేకత ...
రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన భూ సేకరణ చట్టాన్ని రాజధాని గ్రామాల్లోని రైతులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. భూ సమీకరణ విధానంలో తీసుకున్న భూములకు ఇప్పటి వరకు రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయిన ప్రభుత్వం భూ సేకరణ విధానాన్ని ప్రవేశపెట్టి మరింత నష్టాన్ని కలిగించనుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
భూతం
Published Fri, May 15 2015 4:46 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement