పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు ఎట్టకేలకు శనివారం అటవీ శాఖ అనుమతి లభించింది. ఐదేళ్లుగా మూడు జిల్లాల ప్రజల ఎదురుచూపులు ఫలించాయి.
ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్: పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు ఎట్టకేలకు శనివారం అటవీ శాఖ అనుమతి లభించింది. ఐదేళ్లుగా మూడు జిల్లాల ప్రజల ఎదురుచూపులు ఫలించాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వడివడిగా సాగిన ప్రాజెక్టు పనులు ఆయన మరణం తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన తయారయ్యాయి. ప్రధానంగా ప్రాజెక్టు కాలువల నిర్మాణం నల్లమల అటవీ ప్రాంతంలో చేయాల్సి ఉండటంతో.. అటవీ అనుమతులు లభించక పనులు నిలిచిపోయాయి.
అటవీ శాఖకు పరిహారం కింద ప్రభుత్వం రూ.280 కోట్ల నిధులు చెల్లించింది. ఇన్నేళ్ల ఎదురుచూపుల తరువాత ఎట్టకేలకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.లక్ష్మిపార్ధసార థి భాస్కర్ శనివారం జీవో నంబర్ 59 ద్వారా అటవీ భూములకు అనుమతి ఇచ్చారు. మొత్తం 3069.91 హెక్టార్లకు అటవీ శాఖ క్లియరెన్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో మార్కాపురం వన్యప్రాణ సంరక్షణ అటవీ పరిధిలోని 1691 హెక్టార్లకు అనుమతి మంజూరైంది. అదే విధంగా గిద్దలూరు డివిజన్ అటవీ శాఖ పరిధిలోని 1169 హెక్టార్లకు, నెల్లూరు జిల్లా పరిధిలోని 103 హెక్టార్లకు, కడప జిల్లాలోని మరికొంత అటవీ భూమికి కూడా అనుమతి ఇచ్చారు.