చివరి ఆశలపై నీళ్లు
శ్రీకాకుళం అగ్రికల్చర్: అకాల వర్షాలతో అన్నదాత బెంబేలెత్తుతున్నాడు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలలపడటంతో. దాని ప్రభావంతో సోమవారం సోమవారం సాయంత్రం జిల్లాలో పలు చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. దీంతో ఇచ్చిందే స్వల్పం.. అందులోనూ స్వార్థంకళ్లాల్లో ఉన్న ఖరీఫ్ ధాన్యం దిగుబడులు తడిసిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే హుద్‌హుద్ తుపాను, సుడిదోమ తాకిడితో పంట దిగుబడి, నాణ్యత బాగా తగ్గిపోయాయి. చేతికొచ్చిన కొద్దిపాటి పంటను అమ్ముదామంటే తగిన ధర రాక చాలా మంది రైతులు ధాన్యాన్ని కళ్లాల్లోనే ఉంచి ధర కోసం ఆశగా చూస్తున్నారు. ఈ తరుణంలో కురిసిన అకాల వర్షాలతో ఆ ధాన్యం కూడా తడిసి ఈ మాత్రం ధర కూడా దక్కదేమోనని ఆవేదన చెందుతున్నారు.
అల్పపీడనం కారణంగా గత రెండు రోజులుగా ఆకాశం మబ్బు పట్టి చలిగాలుల తీవ్రత పెరిగింది. ఈ మార్పులను గమనించిన రైతులు ధాన్యాన్ని రక్షించుకునేందుకు టర్పాలిన్లు వగైరాలతో కప్పిపెట్టారు. సోమవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతంగా ఉంది. మధ్యాహ్నం కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి జల్లులు కురిసి ఆగిపోయాయి. అయితే సాయంత్రం చీకటి పడే సమయానికి శ్రీకాకుళం పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కసారిగా పెద్ద వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల ధాన్యం తడిసి మొలక వచ్చేస్తుందని రైతులు చెబుతున్నారు. సాంబ వంటి రకాలకైతే మరింత వేగంగా మొలకలు వస్తాయంటున్నారు. ఈ ఏడాది వరి సాగు పెట్టుబడి ఎకరాకు 40 నుంచి 50 శాతం పెరిగింది. ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో పాటు గత ఏడాది కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో చేసిన అప్పులు తీర్చలేక అల్లాడుతున్న రైతు పరిస్థితిని ప్రస్తుత అకాల వర్షాలు మరింత దిగజార్చే ప్రమాదముంది.
పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఇదిలా ఉండగా జిల్లాలో గత వారం రోజులుగా చలి తీవ్రత బాగా పెరిగింది. ఉష్ణోగ్రతలు బాగా పడిపోయి కనిష్టస్థాయిలో నమోదవుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో గాలుల తీవ్రత కూడా పెరగడంతో చలికి తట్టుకోలేక వృద్ధులు, పిల్లలు, రోగులు అవస్థలు పడుతున్నారు. ఆది, సోమవారాల్లో జిల్లాలో ఉష్ణోగ్రతలు 13 డిగ్రీలకు తగ్గాయి.