
విభజనపై కేంద్రం తీరు అసంబద్ధం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనలో కేంద్ర ప్రభుత్వం.. విధివిధానాలను పక్కనపెట్టి హడావుడి నిర్ణయాలు తీసుకుంటోందని కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య విమర్శించారు. రాష్ట్ర విభజన నిర్ణయం గురించి తాను మాట్లాడడం లేదని.. విభజన విషయంలో అనుసరిస్తున్న పద్ధతే పూర్తి అసంబద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఏర్పాటైన అన్ని రాష్ట్రాల విషయంలో ఆయా మాతృ రాష్ట్రాల శాసనసభల తీర్మానం తీసుకున్నాకే విభజన ప్రక్రియ ప్రారంభించారని ఆయన వెల్లడించారు. పద్మనాభయ్య ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతారని కేంద్రమంత్రి చిదంబరం పార్లమెంటులో రెండుసార్లు ప్రకటించారని, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ కూడా చెప్పారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడేమో కేవలం బిల్లు మాత్రమే వస్తుందంటున్నారని విమర్శించారు. బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర విభజనకు అనుసరిస్తున్న విధానం ఏమిటి? ఎందుకు విభజిస్తున్నారు? కారణాలేమిటి? విభజించకుండా ఉండాలంటే అందుకు ప్రత్యామ్నాయాలు ఏమిటి? అన్న అంశాలను కేబినెట్ నోట్‌లో అసలు పొందుపర్చలేదని ఆయన తప్పుపట్టారు. రాజ్యాంగంలోని మూడో అధికరణ ప్రకారమైనా విభజన జరుగుతుందా అన్నది అనుమానంగా ఉందన్నారు. విభజన నిర్ణయం తరువాత రాష్ట్రంలో పెల్లుబికిన ఉద్యమం గురించి కనీసం కేబినెట్ నోట్‌లో ప్రస్తావించకపోవటం గర్హనీయమన్నారు. ఎలాంటి ఉద్రిక్తతలు లేని సమయంలో సానుకూలంగా సమస్య పరిష్కరించాలని రాష్ట్రాల పునర్విభజన కమిషన్ సూచించిన విషయాన్ని గుర్తుచేశారు.
సమైక్యాంధ్ర అంటూ రాజకీయ నాయకులు చెప్తున్న మాటల్లో ఎంత వరకు నిజం అన్నది కూడా అనుమానాస్పదంగా మారిందన్నారు. ఉమ్మడి రాజధాని అంటే దానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని, దానికి రాజ్యాంగబద్ధత కల్పించాలని, లేదంటే ఆచరణ సాధ్యం కాదని పేర్కొన్నారు. ఈ విభజన న్యాయస్థానాల ముందు నిలబడుతుందా? లేదా? అన్నది చెప్పలేమన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కె.రామస్వామి మాట్లాడుతూ.. పరిస్థితులే నాయకులను దృఢంగా మారుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా, మంత్రి పితాని సత్యనారాయణ, తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, సీనియర్ జర్నలిస్టు ఎస్.వెంకటనారాయణ, పుస్తక రచయిత భోగాది వేంకటరాయుడు తదితరులు పాల్గొన్నారు.