- అక్కరకు రాని ‘రుణ విముక్తి’ పత్రాలు
- రైతుల ఖాతాలకు జమ కాని మాఫీ సొమ్ము
- వడ్డీతో చెల్లించాలని ఒత్తిడి చేస్తున్న బ్యాంకులు
- ఫిర్యాదు చేయాలంటే పి.గన్నవరం వెళ్లాల్సిందే..
ఆశాభంగం.. అదనపు భారంl
Published Sat, Sep 24 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM
ఆత్రేయపురం :
గత ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలు కోకొల్లలు. వాటిని నమ్మి ఓట్లేశాక..అవన్నీ కల్లలు, బొల్లులేనని ఆ పార్టీ పాలనతో తేలింది. అన్నివర్గాల వారికీ దక్కింది ఆశాభంగమే. ముఖ్యంగా రుణమాఫీ హామీని విశ్వసించి, కొండంత ఆశ పెట్టుకున్న అన్నదాతలకూ, డ్వాక్రా సంఘాల మహిళలకైతే ఆశించింది జరగకపోగా.. అదనపు భారం పడింది. రైతు రుణాలు రద్దు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడి సర్కారు రుణ విముక్తి పథకానికి ఆది నుంచీ తూట్లు పొడుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే 2015లో అట్టహాసంగా గ్రామ పంచాయితీల వద్ద ‘మీ రుణాలు రద్దయ్యా’యంటూ అన్నదాతలకు ప్రజా ప్రతినిధులు పంపిణీ చేసిన రుణ విముక్తి పత్రాలు ఎందుకు కొరగాకుండా పోతున్నాయి. వ్యవసాయ రుణాల రద్దులో భాగంగా గత ఏడాది జిల్లాలో 4,61,701 మంది రైతులకు రుణవిముక్తి పత్రాలను పంపిణీ చేశారు. అందులో భాగంగా రూ.139.88 కోట్ల రుణాలు రద్దు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, ఆలమూరు మండలాల్లో రైతులకు రుణమాఫీ పత్రాలను అందజేశారు.
సాంకేతిక లోపాల సాకుతో ఎగనామం..
ఆత్రేయపురం మండలంలో మొదటి విడత 3,256 మంది రైతులకు రూ.8.15 కోట్ల రుణం మాఫీ అయిందని, రెం డో విడత 1,763 మంది రైతులకు రూ.1.07 కోట్లు మాఫీ అయిందని మండల వ్యవసాయాధికారి తెలిపారు. అ యితే ఏడాది తిరిగేసరికి ‘తూచ్ ..ఆ రుణ విముక్తి పత్రాలు చెల్లవు. మీ రుణాలు మీరే వడ్డీతో చెల్లించాలి’ అంటూ బ్యాంక్ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు. సాంకేతిక లోపాలను సాకుగా చూపి తిరిగి రుణం చెల్లించాలనడంతో లబోదిబో మంటున్నారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పొరపాట్లు కూడా రైతుల పాలిట శాపమయ్యాయి. రైతుల రేషన్ కార్డు లేదా ఆధార్‌కార్డు నెంబర్‌లు పొరపాటుగా ఆన్‌లైన్ చేసినా రెండో విడత రుణ మాఫీ జ మ కావడం లేదు. తమకు జరిగిన అన్యాయంపై బ్యాం కులు, రెవెన్యూ, వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే.. నూతన రాజధాని సమీపంలో గన్నవరంలో ఏర్పాటు చేసిన రైతు సాధికారిక సంస్థకే ఫిర్యాదు చేయాలంటున్నారు. కొందరు రైతులు గన్నవరం వెళ్లి తిప్పలు పడుతుంటే.. కొందర సర్కారు వంచనాపూరిత విధానాలను దుయ్యబడుతూ అప్పోసప్పో చేసి రుణాలు చెల్లిస్తున్నారు.
ఒక్క విడతే జమ అయింది..
రూ.1.50 లక్షల రుణం రద్దయిందని విముక్తిపత్రం అందజేశారు. తొలుత రూ.30 వేలు జమ చేశారు. ఈ ఏడాది జమ చేయక పోవడంతో బ్యాంకర్లు రుణం చెల్లించాల్సిందేనన్నారు. గన్నవరంలోని రైతు సాధికారిక సంస్థకు ఫిర్యాదు చేస్తే పొరపాటును సరిదిద్దుకుంటామని తెలిపారు. నా రేషన్ కార్డు నంబర్‌కు బదులు వేరే నంబర్ నమోదుతోనే ఈ పరిస్థితి ఏర్పడింది.
– ముదునూరి సుబ్బరాజు, రైతు, ఆత్రేయపురం
కొర్రీలతో పథకానికి తూట్లు
ఎన్నికల ముందు రైతుల వ్యవసాయ రుణాలు బేషర
తుగా రద్దు చేస్తామని వాగ్దానం ఇవ్వడంతో అన్నదాతలు తెలుగుదేశం పార్టీకి ఓట్లు కుమ్మరించారు. అయితే రోజుకు ఒక కొర్రీ పెడుతూ రైతు రుణాల రద్దు పథకానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారు.
– రుద్రరాజు గాంధీరాజు,రైతు, ఆత్రేయపురం
Advertisement
Advertisement