గోదాముల్లో ఖాళీ కరువు | formers geting difficulties in agriculture | Sakshi
Sakshi News home page

గోదాముల్లో ఖాళీ కరువు

Published Fri, Jun 13 2014 3:21 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

గోదాముల్లో ఖాళీ కరువు - Sakshi

గోదాముల్లో ఖాళీ కరువు

వ్యవసాయ రంగంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా అది చివరకు రైతు మెడకు చుట్టుకోవడం రివాజుగా మారింది. ఎవరికి వారు తమపై భారాన్ని తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు చివరకు అన్నదాతకు సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ప్రభుత్వానికి రైలుమిల్లర్లు సరఫరా చేసే లెవీ బియ్యం నిల్వకు గోదాముల్లో ఖాళీ కరువైంది. దీంతో మిల్లర్ల నుంచి బియ్యం సేకరణ నిలిపేయడంతో వారు రైతులకు నగ దు చెల్లింపులు నిలిపేశారు. ఈ క్రమంలోనే రెండో పంట సీజన్ ప్రారంభం కావడంతో అటు మిల్లర్లు డబ్బులు ఇవ్వక, ఇటు బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేయక రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
 సాక్షి, నెల్లూరు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది జిల్లాలో 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు లెక్కలువేశారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో సుమారు 7 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం చేతికొచ్చింది. ఓ రకంగా రైతులు సంబరపడ్డా గోదాములు ఖాళీ లేవనే నెపంతో మిల్లర్ల నుంచి లెవీ బియ్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో సమస్యలు ఏర్పడ్డాయి.
  రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసిన మిల్లర్లు నగదు నెలలో చెల్లిస్తామని చెప్పినా, రెండు నెలలు గడిచినా ఆ ఊసే ఎత్తడం లేదు. కడుపు మండిన రైతులు గట్టిగా నిలదీస్తే ‘మమ్మల్ని ఏం చేయమంటారు..ప్రభుత్వం లెవీ బియ్యం కొన డం లేదు’ అని సమాధానం ఇస్తున్నారు. ఓ వైపు చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండడం..బ్యాంకుల్లో తెచ్చిన రుణాలు తీర్చలేకపోవడం... చంద్రబాబు ఇచ్చిన రైతుల రుణమాఫీ ఎలాంటి మెలికలు లేకుండా అవుతుందా లేదా అనే మీమాంసలో రైతన్న తలపట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
 పూర్తయిన లెవీ లక్ష్యం
 రైసుమిల్లర్లు ఈ ఏడాది ఇప్పటివరకు 2.50 లక్షల మెట్రిక్ టన్నుల లెవీ బియ్యాన్ని ప్రభుత్వానికి సరఫరా చేశారు. ఏడాదికి సంబంధించిన లక్ష్యాన్ని (2.25 లక్షల మెట్రిక్ టన్నులు) కేవలం మూడు నెలలకే అందజేశారు. మిగిలిన బియ్యం సేకరణకు గోదాముల కొరత సాకు చూపుతోంది. గతంలో లెవీ బియ్యాన్ని ఎఫ్‌సీఐ ఈ లెవీబియ్యాన్ని కొనుగోలు చేసి కాకుటూరు సమీపంలోని గోదాముల్లో నిల్వ చేసేది. ఆ బియ్యాన్ని ఎప్పటికప్పుడు రైళ్ల ద్వారా వివిధ ప్రాంతాలకు సరఫరా చేసేది.
 
 అయితే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మనబియ్యం’ పథకంలో భాగంగా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు తదితర నాలుగు జిల్లాల్లో పండే పంటను కేవలం పౌరసరఫరాలశాఖ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంది. దీంతో ఎఫ్‌సీఐ లెవీ బియ్యాన్ని తీసుకోకపోవడంతో రైతులు, మిల్లర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో లెవీ లక్ష్యాలను పూర్తి చేశాం కనుక మిగిలిన బియ్యాన్ని ఇతర ప్రాంతాల్లో అమ్ముకునేందుకు పర్మిట్లు అయినా మంజూరు చేయాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు.
 
  మరిన్ని గోదాముల అవసరం
 ప్రస్తుతం ఎస్‌డబ్ల్యూసీ (స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో 12వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన వీఆర్‌ఆర్ గోదాము (అల్లీపురం), 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఎస్‌ఆర్‌కే గోదాము (పంటపాళెం) 25 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాము (చంద్రశేఖరపురం), 18వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాము (వేదాయపాళెం)తోపాటు సీడబ్ల్యూసీ (సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్)కి చెందిన 45వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాము (కోవూరు) మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంతా కలిపి నిల్వ సామర్థ్యం 1.30 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే. లెవీ బియ్యాన్ని నిల్వ చేసేందుకు పూర్తిస్థాయి సామర్థ్యం కలిగిన గోదాముల కోసం జిల్లాలోని మిల్లర్లు ఏళ్ల తరబడి ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. పాలకులు, అధికారులు అనేక సార్లు వారికి ఇచ్చిన హామీలు నీటిమూటలుగానే మిగిలిపోతున్నాయి. ప్రభుత్వం 40 ఎకరాల స్థలం చూపిస్తే దానిని తామే సొంత నిధులతో కొనుగోలు చేయడంతో పాటు గోదాములు నిర్మించుకుంటామని మిల్లర్లు ముందుకొచ్చినా ఫలితం కరువైంది. దీంతో ఏటా గోదాముల సమస్య రావడంతో రైతులు ఇబ్బందులు కొనసాగుతూనే ఉన్నాయి.
 
 ఏఎంసీల నుంచి వసతులేవి?
 జిల్లాలోని సుమారు 10 అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ (ఏఎంసీ)లకు తాము ఏటా  కోట్లాదిరూపాయలు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ వారి నుంచి తమకు ఎలాంటి వసతి సదుపాయాలు లభించడంలేదని మిల్లర్లు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో రైతులకు పొలాల్లో దారి, లింకురోడ్లు, మార్కెటింగ్ యార్డులు, ధాన్యం ఆరబెట్టుకునేందుకు కల్లాలు వంటి సౌకర్యాలు కల్పించాల్సిన ఏఎంసీలు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నాయని చెబుతున్నారు. తమవద్ద నుంచి సకాలంలో పన్నులు వసూలు చేసే ఏఎంసీలు అంతే బాధ్యతగా తమకు వసతి సౌకర్యాలు కల్పించాలని రైతులు, మిల్లర్లు కోరుతున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement