విషమ పరిస్థితిలోనూ విజయకేతనం
విడవలూరు(కోవూరు): రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన తల్లి పరిస్థితి మనసులో బాధిస్తున్నా పది పరీక్షలకు హాజరై 8.3 జీపీఏతో మండలంలోని వావిళ్ల గ్రామానికి చెందిన పి.తేజశ్విని ఉత్తీర్ణత సాధించింది. వావిళ్ల గ్రామానికి చెందిన తేజశ్వని స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివింది. పరీక్షల సమయంలో తేజశ్విని తల్లి పుష్ప రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై అపస్మారకస్థితికి చేరింది. ఆమె చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా తేజశ్విని తండ్రి వేణుగోపాల్ కుమార్తెకు ధైర్యం చెప్పి పరీక్షలకు సిద్ధం చేశారు.
తండ్రి ఇచ్చిన ధైర్యంతో పరీక్షలకు హాజరైంది. ఇటీవల విడుదలైన పది ఫలితాలలో తేజశ్విని 8.3 జీపీఏ సాధించింది. అయితే తన ప్రతిభను తల్లి పుష్ప ఆనందించేందుకు ఈ లోకంలో లేదనే బాధ తేజశ్వినిని కలచివేస్తోంది. అయితే తల్లి చనిపోతూ అవయవ దానం చేసి నలుగురికి జీవితాన్నిచ్చిందన్న స్ఫూర్తితో తాను ఉన్నత చదువులు చదివి తల్లి ఆశయాలను నిలుపుతానని తేజశ్విని పేర్కోంది.