సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలో పలు సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. పాలకవర్గం ఏర్పడి నెలలు గడుస్తున్నా అభివృద్ధి జాడ కనిపించలేదు. నగరవాసులు పలు సమస్యలతో సతమతవుతున్నారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లేకపోవటంతో మురుగునీరు వీధుల్లో ప్రవహిస్తోంది. ఎక్కడపడితే అక్కడ చెత్త పేరుకుపోయి ఉన్నాయి. దోమల నివారణ చర్యలు పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించలేదు. ఫాగింగ్ చేయరు.. బ్లీచింగ్ చల్లరు. మొత్తంగా నగరం పరిశుభ్రంగా లేకపోవటంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఫలితంగా నగరవాసులు వ్యాధులతో సతమతమవుతున్నారు.
ఇకపోతే పలు కాలనీలను తాగునీటి సమస్య వేధిస్తోంది. ఇన్ని సమస్యల మధ్య మూడునెలల విరామం తర్వాత రెండోసారి నిర్వహిస్తున్న నెల్లూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరుగనుంది. అజెండాలోని పలు వివాదాస్పద అంశాలతో పాటు కిందటి నెల 31న జరగాల్సిన కౌన్సిల్ సమావేశాన్ని వాయిదావేయటంపైనా సభ్యులు నిలదీసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మేయర్ అజీజ్‌పై అధికారపార్టీలోని కొందరు సభ్యులు గుర్రుగా ఉన్నారు. ఇక ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నగరపాలక సంస్థ పరిపాలనలో జరుగుతున్న లోపాలపై చీల్చి చండాడేందుకు సన్నద్ధమవుతున్నారు. మున్సిపల్ కమిషనర్, మేయర్ మధ్య సఖ్యత లేని నేపథ్యంలో ఈ సమావేశంలో సభ్యుల నుంచి వచ్చే విమర్శలను ఏ విధంగా తిప్పికొడతారనేది చర్చనీయాంశంగా మారింది.
నగరపాలక సంస్థలో పనిచేస్తున్న సుమారు 1,476 మంది సొసైటీ కార్మికులను కాంట్రాక్టు విధానంలోకి మార్చాలనే ప్రతిపాదన శనివారం నాటి సమావేశంలో చర్చకు రానుంది. కాంట్రాక్టు విధానాన్ని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సభ్యులతో పాటు టీడీపీ సభ్యులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి తోడు కార్మిక సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విధానం జోలికి పోవద్దంటూ కొన్ని సంఘాలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. శనివారం జరిగే కౌన్సిల్ సమావేశాన్ని ముట్టడించేందుకు వెనుకాడబోమని హెచ్చరికలు చేస్తున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో చేపట్టిన ప్రక్రియపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మేయర్ తీరుపై విమర్శలు
నగరానికి రూ.వందల కోట్లతో భూగర్భ మురుగునీటి వ్యవస్థ, తాగునీటి పథకాలకు సంబంధించి ప్రభుత్వానికి పంపిన నివేదికలు సాంకేతిక కారణాలతో వెనక్కి రావటం తెలిసిందే. దీనంతటికీ కారణం మేయర్ అజీజేనని ఆరోపణలున్నాయి. అదేవిధంగా మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారికి కొమ్ముకాశారనే విమర్శలు ఉన్నాయి. హైదరాబాద్‌లో యోగా క్లాస్‌కు వెళ్లేందుకు గత శనివారం జరగాల్సిన నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశాన్ని నేటికి వాయిదావేశారని సభ్యులు మండిపడుతున్నారు.
బలమైన కారణాలు లేకుండా ఒకసారి ప్రకటించిన సమావేశాన్ని వాయిదావేయడం కుదరదని మున్సిపల్ చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. చట్టాలపై అవగాహనలేని మేయర్ అధికారుల సలహాలు కూడా తీసుకోకుండా సమావేశాన్ని ఏకపక్షంగా వాయిదా వేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 88(సీ) ప్రకారం కౌన్సిల్ నిర్ణయించిన తేదీనే జరపాల్సి ఉంది. అలా జరపని పక్షంలో అది చట్ట విరుద్ధమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
మేయర్, మున్సిపల్ కమిషనర్‌లు ఆ రోజున అందుబాటులో లేనట్లయితే డిప్యూటీ మేయర్, అదనపు కమిషనర్‌లు జరపవచ్చు. ఏ కారణం చేతనైనా డిప్యూటీ మేయర్ కూడా అందుబాటులో లేనట్లయితే స్టాండింగ్ కమిటీ చైర్మన్‌కు కౌన్సిల్ సమావేశం నిర్వహించే అధికారం చట్టాలు కల్పిస్తున్నాయి. అంతే తప్ప కౌన్సిల్ సమావేశాల తేదీలను ఎప్పటికప్పుడు ఇష్టానుసారంగా మార్చుకునే అధికారం మేయర్‌కు లేదు. వాయిదా వేయాల్సి వస్తే ఏదైనా ప్రకృతి వైపరిత్యాలు, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందన్న అత్యవసర సమయాల్లో వాయిదా వేసే అధికారం మేయర్‌కు ఉంటుంది. అదేవిధంగా కోరం లేకపోయినా, మెజారీటీ సభ్యులు వాయి దా కోరినా చట్టాలు అనుమతిస్తాయి.
సమస్యలు.. వివాదాలు
Published Sat, Feb 7 2015 1:55 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement