కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: తుపాను ధాటికి రైతుల కష్టమంతా తుడిచిపెట్టుకుపోయింది. ఐదు రోజులుగా ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో కురిసిన వర్షాలు శనివారం తెరిపిచ్చాయి. చేతికొచ్చిన పంటలు కళ్లెదుటే నీట మునగడంతో అన్నదాత కన్నీరుమున్నీరవుతున్నాడు. అతివృష్టితో వాగులు, వంకలు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి.
ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్ తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించి చలించిపోయారు. కొత్తపల్లి మండలం దుద్యాలలో దెబ్బతిన్న వరి పైరు, నందికుంటలో వర్షాలకు తడిచి మొలకలు వచ్చిన మొక్కజొన్నను పరిశీలించారు. ఆత్మకూరులో ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల్లోనూ ఆయన పర్యటించారు. ఆయా ప్రాంతాలను పరిశీలిస్తున్న వికాస్‌రాజ్‌తో పాటు జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డిలను బాధిత రైతులు, స్థానికులను చుట్టుముట్టి ఆదుకోవాలని వేడుకున్నారు. అన్నివిధాల అండగా ఉంటామని వారు భరోసానిచ్చారు. 2009లో అతివృష్టి.. 2010లో అధిక వర్షాలతో రైతులు నష్టాలను మూటగట్టుకున్నారు. 2011, 2012 సంవత్సరాల్లో అనావృష్టి రైతులను వెక్కిరించింది. 2013లో ఖరీఫ్ సీజన్ బాగుందని సంతోషిస్తున్న తరుణంలో తుపాను వారిని తీవ్ర నిరాశకు గురి చేసింది.
అధికారిక లెక్కల ప్రకారమే కొత్తపల్లి, మహానంది, బండిఆత్మకూరు, గడివేముల, పాణ్యం, బనగానపల్లె, చాగలమర్రి, గోస్పాడు, శిరువెళ్ల, ఆత్మకూరు, పాములపాడు, వెలుగోడు, దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాల్లో 38,137.5 ఎకరాల్లో పంట 50 శాతం పైగా దెబ్బతినింది. ఎకరాకు కనీసం రూ.10 వేల చొప్పున నష్టం వాటిల్లింది. వరి 14,850 ఎకరాలు, మొక్కజొన్న 10,415, వేరుశెనగ 3,792, పత్తి 2,920, జొన్న 1,577.50, శనగ 1380, పొగాకు 50, కొర్ర 85, పొద్దుతిరుగుడు 575, ఆముదం 225, కంది 1640, మినుములు 500, పెసలు 127.50 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. అనధికార అంచనాల ప్రకారం 90వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు జిల్లా మొత్తం మీద సగటున 3 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది.
పంట నష్టంపై సమగ్ర సర్వే
శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు జిల్లా మొత్తం మీద సగటున 3 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అక్టోబర్ నెల సాధారణ వర్షపాతం 114.5 మి.మీ కాగా, ఇప్పటి వరకు 135.8 మి.మీ వర్షం కురిసింది. భారీ వర్షాల వల్ల పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసిన వ్యవసాయాధికారులు సమగ్ర సర్వేకు చర్యలు చేపట్టారు. 14 మండలాల్లో పంట నష్టం సత్వరం ఎన్యుమరేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేయనున్నారు. పంట నష్టం సర్వేతో పాటు, రైతుల బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కూడా తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వీలైనంత త్వరగా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ఇదిలాఉండగా కర్నూలు, నంద్యాల డివిజన్లలో మొత్తం 1,674 ఇళ్లు దెబ్బతినగా, ఇందులో 320 ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. వీటికి మరో మూడు రోజుల్లో ఆర్థిక సహాయం అందించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపడుతున్నారు.
నిండా ముంచింది!
Published Sun, Oct 27 2013 4:04 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement