
‘వేముగంటి’కి శంకుస్థాపన
భీమ్‌గల్, న్యూస్‌లైన్ : మండల ప్రజల చిరకాల వాంఛ అయిన వేముగంటి ప్రాజెక్టు నిర్మాణాన్ని జూలైలోగా పూర్తి చేయాలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి కాంట్రాక్టర్ ను, అధికారులను ఆదేశించారు. ఆగస్టులో ఆయకట్టుకు నీరందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆదివారం మం డలంలోని పల్లికొండలో వేముగంటి ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామ శివారులో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కోసం మండల ప్రజలు మూడు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారన్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి ప్రాజెక్టు నిర్మాణ దశకు చేరుకుందన్నారు. గట్టు పొడచిన వాగు నుంచి మండలంలోని మెండోరాకు నీళ్లు తరలించే విషయాన్ని పరిశీలించేందుకు అధికారులను పంపుతామన్నారు. భూగర్భ జలాల పెరుగుదల కోసం వాగుల్లో చెక్‌డ్యాంలు నిర్మించడానికి కృషి చేస్తానన్నారు. శ్రీరాంసాగర్ ప్రా జెక్టు వరద కాల్వకు 30 కిలోమీటర్లకు ఒక చెక్‌డ్యాం నిర్మించే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. గ్రామస్తుల కోరిక మేరకు పల్లికొండలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు.
చంద్రబాబు నాయుడు బూటకపు హామీలు ఇస్తున్నారని విమర్శించారు. ఆయన హయాంలో కరెంటోళ్లు రైతుల మీటర్ల డబ్బాలు లాక్కుపోయేవారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే మార్పు వచ్చిందన్నారు. అలాంటి బాబుకు ప్రజలు మళ్లీ ఎందుకు అవకాశమిస్తారన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమన్నారు. పెద్ద సంఖ్యలో సీట్లు సీమాంధ్రలో ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్నారు.
అందుకే.. భీమ్‌గల్‌పై అభిమానం
బాల్కొండకు, భీమ్‌గల్‌కు ఎంతో వ్యత్యాసం ఉందని ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తనకు వచ్చిన మెజారిటీలో సగం భీమ్‌గల్ నుంచే వచ్చిందన్నారు. అందుకే తనకు భీమ్‌గల్ అంటే ప్రత్యేక అభిమానమన్నారు. ఈ ప్రాంత ప్రజల ‘వేముగంటి’ ఆకాంక్షను నెరవేర్చానన్నారు. మౌలిక వసతుల కల్పనకు తాను పెద్ద పీట వేశానన్నారు. నియోజకవర్గంలో వంద కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి, విప్‌లను ప్రాజెక్టు కమిటీ, ఆయకట్టు రైతులు గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి శనిగరం సంతోష్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పట్వారి గంగాధర్‌రావు, నాయకులు కన్నె సురేందర్, మానాల మోహన్‌రెడ్డి, సుంకెట రవి, వేముగంట ప్రాజెక్టు చైర్మన్ రాజేశ్వర్, సర్పంచ్‌లు ఆర్మూర్ మహేశ్, కొమ్ము నరేశ్, గుగులోత్ రవినాయక్, ఏశాల సౌమ్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు.