నెత్తురోడిన రహదారి | Four killed, 16 more serious injuries in road accidents | Sakshi
Sakshi News home page

నెత్తురోడిన రహదారి

Published Mon, Mar 16 2015 2:04 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

నెత్తురోడిన రహదారి - Sakshi

నెత్తురోడిన రహదారి

నలుగురు మృతి, 16మందికి తీవ్ర గాయాలు
 బయ్యనగూడెం సమీపంలో ఘోర ప్రమాదం
 అన్నవరం నుంచి వస్తూ ఆగివున్న లారీని ఢీకొట్టిన వ్యాన్
 మృతులు, క్షతగాత్రులు కృష్ణాజిల్లా తిరువూరు ప్రాంతవాసులు
 
 కొయ్యలగూడెం: కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం సమీపంలో స్టేట్ హైవేపై ఆదివారం వేకువజామున చోటుచేసుకున్న ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. బయ్యనగూడెం గ్రామానికి సమీపంలో ఇటుకల బట్టీవద్ద ఆగివున్న కర్రల లోడు లారీని జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న కృష్ణాజిల్లా తిరువూరు మండలం అంజనాపురం గ్రామానికి చెందిన మట్టా నాగరత్నం (75), చిట్యాల గ్రామానికి చెందిన బజ్జూరి లక్ష్మీదేవి (65), ఖమ్మం జిల్లా కళ్లూరు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన వనిగళ్ల కొండయ్య (50) ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మట్టా నాగరత్నం కుమార్తె  వెంకట నర్సమ్మ (50) ప్రాణాలు విడిచింది.
 
 ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కృష్ణాజిల్లా తిరువూరు మండలం అంజనాపురానికి చెందిన మట్టా రాము, అతని భార్య కల్యాణి తమ కుమార్తెకు నామకరణం, అన్నప్రాసన చేయించేందుకు ఈనెల 13న బాడుగకు కుదుర్చుకున్న వ్యాన్‌లో అన్నవరం బయలుదేరారు. పరిసర గ్రామాలకు చెందిన 16మంది బంధుగణాన్ని తమవెంట తీసుకెళ్లారు. కుమార్తెకు అన్నవరంలో నామకరణం, అన్నప్రాసన చేయించారు. అక్కడి నుంచి సింహాచలం, మధ్యలో మరికొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని శనివారం అర్ధరాత్రి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. వారు ప్రయాణిస్తున్న వ్యాన్ ఆదివారం వేకువజామున కొయ్యలగూడెం చేరుకోగా, అక్కడ అందరూ టీ తాగారు. అనంతరం ఇళ్లకు తిరుగుముఖం పట్టారు. 10 నిముషాల వ్యవధిలోనే వారంతా ఘోర ప్రమాదానికి గురయ్యారు. బయ్యనగూడెం సమీపంలో ఇటుక బట్టీల కోసం పుల్లలను దిగుమతి చేయడానికి రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఆ వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో శేషారత్నం, లక్ష్మీదేవి, కొండయ్య, వెంకట నర్సమ్మ మృత్యువాతపడ్డారు. మరో 16 మంది గాయాల పాలయ్యారు.
 
 క్షతగాత్రులు వివరాలివీ
 మట్టా కల్యాణి, ఆమె భర్త రాంబాబు (రాము), వెలిగల సావిత్రి, కొండయ్య, అవనిగడ్డ సావిత్రి, బొజ్జారి ధనలక్ష్మి, బొజ్జారి వేణు, మరీదు వీరరాఘవులు, మట్టా లక్ష్మణ్, బొజ్జారి దిలీప్‌సాయి, మట్టా స్రవంతి, బొజ్జారి వేణుగోపాల్, మట్టా స్వాతి, మట్టా తపస్వి, బొజ్జారి పూజిత, పరిగెల వీరభద్రరావు గాయాల పాలయ్యారు. వీరంతా అంజనాపురం, చిట్యాల గ్రామాలకు చెందిన వారు. క్షతగాత్రుల రోదనలతో ప్రమాద ప్రాంతం దద్దరిల్లింది. వారి ఆర్తనాదాలతో నిద్రలేచిన స్థానికులు భయకంపితుల య్యారు. కొందరు ఘటనా స్థలానికి వెళ్లి వ్యాన్‌లోని వారిని బయటకు లాగారు. సీఐ కె.బాలరాజు, ఎస్సై ఎస్‌ఆర్‌ఆర్ గంగాధర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఎంత ప్రయత్నించినప్పటికీ లారీ, వ్యాన్ వేరుకాకపొవడంతో లారీని సుమారు అర కిలోమీటరు మేర ముందుకు నడిపారు. ఆ తరువాత ట్రాక్టర్ సాయంతో వ్యాన్‌ను లాగారు. అనంతరం మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు లాగి జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ పరామర్శించారు. అత్యవసర వైద్యసేవలు అందించేవిధంగా వైద్యాధికారులతో చర్చించారు. క్షతగాత్రులలో కొందరిని మెరుగైన చికిత్స కోసం ఏలూరు, ఖమ్మం ఆసుపత్రులకు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement