ఔటర్‌పై అంబులెన్స్‌ను ఢీకొన్న కారు  | Four dead in car colliding with an ambulance | Sakshi
Sakshi News home page

ఔటర్‌పై అంబులెన్స్‌ను ఢీకొన్న కారు 

Published Sat, Jan 12 2019 1:15 AM | Last Updated on Sat, Jan 12 2019 1:15 AM

Four dead in car colliding with an ambulance  - Sakshi

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన అంబులెన్స్‌

హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబంలోని ముగ్గురితోపాటు అంబులెన్స్‌ డ్రైవర్‌ మృతి చెందాడు. అంబులెన్స్‌లోని మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. కర్ణాటకలోని బళ్లారికి చెందిన బొల్లిరెడ్డి వెంకటేశ్వరరావు(60) పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఓ ఆస్పత్రిలో కేన్సర్‌ చికిత్స పొందాడు. చికిత్స పూర్తికావడంతో తన భార్య సుబ్బలక్ష్మి(55), సోదరుడు రామారావు(70), కుమారుడు హేమచందర్‌రావు, అల్లుడు శ్రీనివాసరావుతో కలసి ప్రైవేటు అంబులెన్స్‌లో ఈ నెల 10న రాత్రి హైదరాబాద్‌ మీదుగా బళ్లారికి బయలుదేరారు. రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట నుంచి ఔటర్‌రింగ్‌ రోడ్డు మీదుగా శంషాబాద్‌కు వెళ్లే క్రమంలో తెల్లవారుజామున 3 గంటలకు తుక్కుగూడ రావిర్యాల సమీపంలోని ఔటర్‌ ఎగ్జిట్‌ 13 వద్దకు వచ్చారు.

ఆ సమయంలో శంషాబాద్‌ నుంచి బొంగుళూరు గేటుకు వస్తున్న హస్తినాపురానికి చెందిన మనోజ్‌తోపాటు ఆరుగురితో ఉన్న కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటుకుని అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్‌లో ప్రయాణిస్తున్న వెంకటేశ్వరరావు, సుబ్బలక్ష్మి, అంబులెన్స్‌ డ్రైవర్‌ శివ అక్కడికక్కడే మృతిచెందారు. హేమచందర్‌రావు, శ్రీనివాసరావు, రామారావు, అంబులెన్స్‌ మరో డ్రైవర్‌ మోహిద్‌ తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు కర్ణాటకకు చెందిన వారు కాగా.. అంబులెన్స్‌ డ్రైవర్‌ శివది ఆంధ్రప్రదేశ్‌. కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. ఆదిభట్ల పోలీసులు వచ్చి క్షత్రగాత్రులను, మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.  గాయపడిన రామారావును వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆదిభట్ల సీఐ నరేందర్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement